ప్రశ్నిస్తే.. వేధింపులా?

ZPTC Member Cryed In Meeting Karnataka - Sakshi

 రౌడీలతో హాస్టల్‌ వార్డెన్ల దాడులు  

మండ్య జడ్పీ భేటీలో సభ్యురాలి రోదన

ఆమె చేసిన తప్పల్లా హాస్టళ్లలో పేద బాలలకు సరైన ఆహారం అందుతోందా? లేదా? అని అడగడమే. తమనే ప్రశ్నిస్తావా? అని ఘరానా వార్డెన్లు కన్నెర్ర చేశారు. ఇక జడ్పీ సభ్యురాలికే రౌడీల వేధింపులు తప్పలేదు.  

మండ్య: హాస్టళ్లలో అందిస్తున్న ఆహారం నాణ్యతపై ప్రశ్నించినందుకు వార్డెన్లు తనమీదకు రౌడీలను ఉసిగొలిపి నడివీధిలో అసభ్యంగా దూషిస్తూ అవమానిస్తున్నారంటూ జడ్పీ సభ్యురాలు కన్నీటి పర్యంతమైన ఘటన గురువారం మండ్య జిల్లా పంచాయితీ సమావేశంలో చోటు చేసుకుంది. జడ్పీ అధ్యక్షురాలు నాగరత్నస్వామి నెలవారి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సభ్యురాలు సునందమ్మ మాట్లాడుతూ నాగమంగల తాలూకా శికారిపుర గ్రామ హాస్టల్‌ నిర్వహణ అత్యంత నాసిరకంగా ఉంటోందని చెప్పారు. ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం కాకుండా హాస్టల్‌ వార్డెన్లు లోకేశ్, పార్వతిలు వారి ఇష్టానుసారం పిల్లలకు నాసిరకం ఆహారం అందిస్తున్నారంటూ సునందమ్మ ఆరోపించారు. దీన్ని ప్రశ్నించినందుకు హాస్టల్‌ వార్డెన్లు తనపై రౌడీలతో బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారని, ప్రతిరోజూ రౌడీలు బహిరంగ ప్రదేశాల్లో తనను నానా మాటలంటూ  అవమానిస్తున్నారని విలపించారు. దీనిపై జిల్లా సంక్షేమ అధికారికి ఫిర్యాదు చేసినా ఫలితం లేదని చెప్పారు. ఈ విషయాన్ని శాఖ ప్రధాన కమిషనర్‌ దృష్టికి తీసుకెళతామని జి.పం అధ్యక్షురాలు నాగరత్న స్వామి తెలుపగా, అధ్యక్షురాలిగా మీరెందుకు ఉన్నారని సునందమ్మ గట్టిగా రోదిస్తూ ప్రశ్నించడంతో అందరూ స్తబ్దులయ్యారు.  

మాటమార్చిన అధికారులు  
ఈ క్రమంలో జిల్లా సంక్షేమ అధికారి మాలతి,రాజీవ్‌లు తాము జిల్లావ్యాప్తంగా ఉన్న అనేక హాస్టళ్లను పరిశీలించామని ప్రతీ హాస్టల్‌లోనూ నిర్వహణ తీరు సక్రమంగానే ఉందంటూ బదులిచ్చారు. దీంతో ఇప్పటి వరకు ఎన్ని హాస్టళ్లు పరిశీలించారో చెప్పాలంటూ ప్రశ్నించిన సునందమ్మ.. హాస్టళ్ల పరిశీలనకు ఇప్పుడే వెళదామని డిమాండ్‌ చేశారు. దీంతో కొన్ని హాస్టళ్లలో సీసీటీవీలు, బయోమెట్రిక్‌ తదితర వాటిలో నిర్వహణ లోపం ఉందంటూ మాట మార్చారు. జి.పం. సభ్యురాలికే భద్రత లేకపోవడం దారుణమని పలువురు సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.  

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top