బళ్లారి మహానగర పాలికె మేయర్, ఉపమేయర్ ఎన్నిక శనివారం జరగనుంది.
బళ్లారి : బళ్లారి మహానగర పాలికె మేయర్, ఉపమేయర్ ఎన్నిక శనివారం జరగనుంది. రెండవ అవధి కింద మేయర్ పదవిని ఎస్టీ వర్గానికి రిజర్వు చేయడంతో ఆ వర్గానికి చెందిన కాంగ్రెస్ కార్పొరేటర్లు కుమార స్వామి, నాగమ్మ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు మెజారిటీ సభ్యులున్నప్పటికీ రెండు వర్గాలుగా విడిపోయి సూచనలు ఉన్నాయి. దీంతో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్రమత్తమయ్యారు. మేయర్ పదవి కోసం కుమారస్వామి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఆయనకు చెక్ పెట్టేందుకు కొందరు కార్పొరేటర్లు ముమ్మర కృషి చేస్తున్నారు. దీంతో మాజీ మంత్రులు దివాకర్ బాబు, అల్లం వీరభద్రప్ప, మాజీ ఎంపీ కె.సి.కొండయ్య మేయర్ ఏకగ్రీవ ఎన్నికకు కార్పొరేటర్లను ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే కొందరు కార్పొరేటర్లు కుమారస్వామికి, మరికొందరు నాగమ్మకు మద్దతు ఇవ్వాలని బయటపడుతుండడంతో నాయకులు తలలు పట్టుకుంటున్నారు.
దీంతో విపక్ష వర్గానికి చెందిన ఎంపీ శ్రీరాములు శిబిరంలో ఆరుగురు కార్పొరేటర్లు ఉండడంతో వారిపై ఓ వర్గానికి చెందిన కార్పొరేటర్లు ఆశలు పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి సిటీ మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి స్వగృహంలో శ్రీరాములు నేతృత్వంలో ఆ పార్టీకి చెందిన కార్పొరేటర్లు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టిన నేపథ్యంలో తాము ఏ వర్గానికి మద్దతు ఇవ్వరాదని శ్రీరాములు వర్గానికి చెందిన కార్పొరేటర్లు తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీలో ఎవరిని మేయర్‌గా ఎన్నుకున్నా తమకు అభ్యంతరం లేదని, ప్రజలు తమను ప్రతిపక్షంలో కూర్చొబెట్టిన నేపథ్యంలో ప్రజల అభీష్టం మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. ఇది ఇలా ఉండగా బళ్లారి నగర మేయర్ స్థానంపై కాంగ్రెస్ గ్రూపుల మధ్య విభేదాలు వేడెక్కాయి.