నో ఛాన్స్...


  • కావేరి నిర్వహణ మండలి ప్రసక్తే లేదు

  •  మండలి ఏర్పాటు అపోహ మాత్రమే

  •  వివాదంపై సుప్రీం కోర్టులో ప్రత్యేక అప్పీలు

  •  అది పరిష్కారమయ్యేంత వరకు మండలి ఏర్పాటు అసాధ్యం

  •  త్వరలో కేంద్ర మంత్రులు, పార్టీ ఎంపీలు మోడీతో భేటీ

  •  రసాయనాలు, ఎరువులకు కొరత లేదు

  •   కేంద్ర మంత్రి అనంత కుమార్

  • సాక్షి ప్రతినిధి, బెంగళూరు : కావేరి జలాలను పరీవాహక రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలు పంచుకునే విషయమై జల నిర్వహణ  మండలిని ఏర్పాటు చేసే ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం ఎదుట లేదని రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి అనంత కుమార్ స్పష్టం చేశారు. కావేరి నిర్వహణ మండలి ఏర్పాటవుతుందనేది కేవలం అపోహ మాత్రమేనని కొట్టి పారేశారు. రాజ్యసభ, శాసన మండళ్లకు బీజేపీ అభ్యర్థులు శనివారం నామినేషన్లను దాఖలు చేసిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు.

     

    ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన సందర్భంగా తమను కలుసుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వ విధానాన్ని స్పష్టం చేశామని చెప్పారు. ఈరోజు కూడా తాను కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమా భారతితో మాట్లాడానని, కావేరి నిర్వహణ మండలి ప్రతిపాదనేదీ తమ వద్ద లేదని ఆమె కూడా చెప్పారని వివరించారు. కాగా సోమవారం రాష్ట్రపతి ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించిన తర్వాత, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి నాయకత్వంలో రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, పార్టీ ఎంపీలు ప్రధాని నరేంద్ర మోడీని కలవబోతున్నట్లు వెల్లడించారు.



    కావేరి వివాదంలో కర్ణాటక ప్రయోజనాలను కాపాడాల్సిందిగా ఆయనను కోరుతామని చెప్పారు. కావేరి జల వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో ప్రత్యేక అప్పీలును దాఖలు చేసినందున, అది పరిష్కారమయ్యేంత వరకు జల నిర్వహణా మండలి ఏర్పాటు సాధ్యం కాదని తెలిపారు. సుప్రీం కోర్టు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసిందని గుర్తు చేశారు.

     

    రసాయనాల కొరత లేదు




    కర్ణాటక సహా దేశ వ్యాప్తంగా రసాయనాలు, ఎరువులకు కొరత లేదని మంత్రి తెలిపారు. లక్ష మెట్రిక్ టన్నుల యూరియా సహా వివిధ రకాల ఎరువులను సరఫరా చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరిందని తెలిపారు. రాష్ట్రం కోరిన పరిమాణం కంటే 50 శాతం ఎక్కువగానే రసాయనాలను సమకూరుస్తామని ఆయన భరోసా ఇచ్చారు.

     

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top