గ్రూపు నేతలను మళ్లీ ఒకే వేదిక మీదకు తెచ్చి, ఐక్యతను చాటుకునేందుకు టీఎన్‌సీసీ కసరత్తుల్లో పడింది. ఈ నెల ఏడో తేదీన రాష్ట్ర కార్యవర్గ, జిల్లా కార్యదర్శుల సమావేశానికి పిలుపు నిచ్చింది.
గ్రూపు నేతలను మళ్లీ ఒకే వేదిక మీదకు తెచ్చి, ఐక్యతను చాటుకునేందుకు టీఎన్‌సీసీ కసరత్తుల్లో పడింది. ఈ నెల ఏడో తేదీన రాష్ట్ర కార్యవర్గ, జిల్లా కార్యదర్శుల సమావేశానికి పిలుపు నిచ్చింది. ఒకరి మీద మరొకరు నిందలు వేసుకుని రచ్చకెక్కవద్దని, బలోపేతం చేద్దామని సీనియర్ నేత జీకే వాసన్ పిలుపు నిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని టీఎన్‌సీసీ అధ్యక్షుడు జ్ఞానదేశికన్ ఆరోపించారు.
సాక్షి, చెన్నై : రాష్ట్ర కాంగ్రెస్‌లో గ్రూపులకు కొదవలేదు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఐక్యతతో ఉన్న గ్రూపుల నాయకులు, ఇప్పుడు కయ్యానికి కాలుదువ్వుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఈ ఓటమికి బాధ్యత వహిస్తూ టీఎన్‌సీసీ అధ్యక్షుడు జ్ఞాన దేశికన్ తన పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్ రెండు రోజులకు ముందు తెర మీదకు వచ్చింది. రాష్ట్ర కాంగ్రెస్ గ్రూపుల్లో ప్రధాన గ్రూపుగా ఉన్న కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి చిదంబరం వర్గం ఈ నినాదాన్ని అందుకోవడంతో మరో ప్రధాన గ్రూపు జీకే వాసన్ వర్గంలో ఆగ్రహం రేగింది. తమ గ్రూపునకు చెందిన టీఎన్‌సీసీ అధ్యక్షుడు జ్ఞాన దేశికన్‌ను రాజీనామా చేయమని అడిగే అధికారం చిదంబరం వర్గానికి లేదంటూ ఎదురు దాడికి సిద్ధమైంది. ఈ పరిణామాలు మీడియాకు హాట్ టాపిక్‌గా మారడంతో పార్టీలో నెలకొన్న పరిస్థితిని చక్క దిద్దేందుకు టీఎన్‌సీసీ వర్గాలు సిద్ధం అయ్యాయి.
ఐక్యతా పాఠాలు: దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌కు తగిలిన దెబ్బను రాష్ట్ర నాయకులు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని, వివాదాన్ని పెద్దది చేసుకోవద్దంటూ టీఎన్‌సీసీ పెద్దలు హితవు పలుకుతున్నారు. సమస్య ఏదేని ఉంటే, పార్టీ సమావేశంలో చర్చించుకుని చర్యలు తీసుకుందామని సూచించే పనిలో పడ్డారు. ఎవరెన్ని ఆరోపణలు చేసినా వాటిని పట్టించుకోకుండా, ఐక్యతతో అందరూ కలసి కట్టుగా పయనించే విధంగా మంతనాల కసరత్తుల్లో నిమగ్నం అయ్యారు. టీఎన్‌సీసీ అధ్యక్షుడు జ్ఞాన దేశికన్ ఇందుకు తగ్గ ప్రయత్నాలు వేగవంతం చేశారు. ఇది వరకు ఎవరికి వారు అన్నట్టుగా ఉన్న గ్రూపు నేతలను గాడిలో పెట్టి
ఒకే వేదిక మీదకు తెచ్చిన ఘనతను జ్ఞానదేశికన్ దక్కించుకున్నారు. ఈ దృష్ట్యా, ఆయన ప్రయత్నాలు సత్ఫలితాల్ని ఇచ్చే అవకాశాలు కన్పిస్తున్నారుు. ఐక్యతను చాటుకునేందుకు ముందుగా అందరి అభిప్రాయాల సేకరణ లక్ష్యంగా, పార్టీ భవిష్యత్తు కార్యాచరణ ధ్యేయంగా కార్యవర్గ, జిల్లా స్థాయి నేతలతో సమావేశానికి టీఎన్‌సీసీ పిలుపు నిచ్చింది.
రచ్చకెక్కవద్దు
పార్టీ ఓటమికి గల కారణాలు చర్చించాల్సిన అవసరం ఉందని సీనియర్ నేత జీకేవాసన్ పేర్కొన్నారు. శనివారం మీడియాతో వాసన్ మాట్లాడుతూ, కాంగ్రెస్‌లో ఐక్యతను దెబ్బ తీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. అందరూ కలసి కట్టుగా ఇన్నాళ్లు నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని, అలాంటి నిర్ణయాల్నే ఇక ముందు కూడా తీసుకుందామని పిలుపు నిచ్చారు. ఇలాంటి సమయంలో నిందలను ఒకరి మీద మరొకరు వేసుకుంటూ రచ్చకెక్కడం మంచి పద్దతి కాదని హితవు పలికారు. అధిష్టానానికి మద్దతుగా తమిళనాడులోని ప్రతి నాయకుడు, కార్యకర్త నిలవాల్సి ఉందని, ఈ దృష్ట్యా, ఏదేని సమస్యలు ఉంటే కలసికట్టుగా చర్చించి పరిష్కరించుకుందామని, రచ్చకు మాత్రం ఎక్క వద్దని విజ్ఞప్తి చేశారు.
నిర్వీర్యానికి కుట్ర
టీఎన్‌సీసీ అధ్యక్షుడు జ్ఞానదేశికన్ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్‌ను నిర్వీర్యం చేయడానికి పెద్ద కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అందుకే పని గట్టుకుని కొందరు మీడియాకు ప్రకటనల మీద ప్రకటనలు ఇస్తూ, పార్టీ కేడర్‌ను పక్కదారి పట్టించే యత్నం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. ఎవరెన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్‌ను నిర్వీర్యం చేయలేరని, నేతలందరూ ఐక్యతతో పార్టీ బలోపేతం లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. కాంగ్రెస్‌కు దేశ వ్యాప్తంగా ఓటమి ఎదురైందని, ఇందుకు పలు రకాల కారణాలు ఉన్నాయని పేర్కొన్నా రు. వీటన్నింటిపై చర్చించి, నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని, అలా చేయకుం డా, ఎవరికి వారు ప్రకటనలు ఇచ్చుకోవడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ఎవరిని పదవిలో ఉంచాలో, ఎవరిని తొలగించాలన్నది అధిష్టానం చూసుకుంటుందని పేర్కొంటూ, అందరూ కలసికట్టుగా చర్చించి నిర్ణయాలు తీసుకుందామన్నారు. ఈనెల ఏడో తేదీ సత్యమూర్తి భవన్ వేదికగా జరిగే సమావేశానికి పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లాల కార్యవర్గాల నాయకులు తప్పనిసరిగా హాజరు కావాలని పిలుపునిచ్చారు.