సూపర్ ఉమెన్ కాప్.. | One-third of Delhi Police force to be women: Home Minister Rajnath Singh | Sakshi
Sakshi News home page

సూపర్ ఉమెన్ కాప్..

Aug 7 2014 12:32 AM | Updated on Sep 2 2017 11:28 AM

‘తలపైన మూడు సింహాల టోపీ.. ఖాకీ యూనిఫాం.. చేతిలో వైర్‌లెస్ సెట్.. నడుముకి అధునాతన ఆయుధం.. టూవీలర్‌పై రయ్‌న వచ్చిన ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ సెంటర్‌లో బండాపి చుట్టూ చూసి

 ‘తలపైన మూడు సింహాల టోపీ.. ఖాకీ యూనిఫాం.. చేతిలో వైర్‌లెస్ సెట్.. నడుముకి అధునాతన ఆయుధం.. టూవీలర్‌పై రయ్‌న వచ్చిన ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ సెంటర్‌లో బండాపి చుట్టూ చూసి దగ్గరలో ఉన్న వారితో మాట్లాడి.. అక్కడ వారికి ఎటువంటి సమస్య లేదనగానే మరో ప్రాంతానికి దూసుకుపోవడమే..’ ఇదేదో సినిమా సీన్‌లా ఉంది కదూ.. అయితే త్వరలో ఢిల్లీ రోడ్లు ఇటువంటి దృశ్యాలకు వేదిక కానున్నాయి.
 
 న్యూఢిల్లీ: నగర రోడ్లపై త్వరలో అధునాతన ఆయుధాలతో ద్విచక్రవాహనాలపై మహిళా పోలీసులు పెట్రోలింగ్ డ్యూటీ చేస్తూ కనిపించనున్నారు. పోలీస్‌స్టేషన్లలో నమోదైన మహిళా సంబంధ కేసులను పరిష్కరించేందుకు, నగర ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు ఢిల్లీ పోలీస్ శాఖలో కొత్తగా మహిళా పోలీసులను నియమించనున్నారు.
 
 ప్రస్తుతం శాఖలో పనిచేస్తున్న మహిళా పోలీసుల్లో చాలా కొద్దిమందికే మోటార్ సైకిల్ నడపడం తెలుసు. అందువల్ల పెట్రోలింగ్ డ్యూటీ చేసే వారికి స్కూటీలను కొనిచ్చేందుకు నిర్ణయించింది. నగరంలో మహిళలపై పెరుగుతున్న అత్యాచారాలు, అకృత్యాలపై కేంద్ర హోం శాఖ దృష్టి సారించింది. ఏయే ప్రాంతాల్లో మహిళలపై ఎక్కువ దాడులు జరుగుతున్నాయో, ఏ పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయో.. ఆయా ప్రాంతాల్లో పెట్రోలింగ్ డ్యూటీ నిర్వహించేందుకు మహిళా పోలీస్ కానిస్టేబుళ్లను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు నగర పోలీస్ శాఖలో మహిళా పోలీసుల సంఖ్య భారీగా పెరగనుంది.
 
 పోలీసు అధికారుల తెలిపిన వివరాల ప్రకారం ఈ మహిళా పోలీసులు నగరంలో రాత్రి పూట కూడా పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తారు. ఒక్కో బృందంలో ఇద్దరు కానిస్టేబుళ్లు ఉంటారు. ఈ బృందాలకు అందజేయడానికి ఎన్ని స్కూటీలు అవసరమవుతాయో పట్టిక తయారుచేయాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీని ఎంహెచ్‌ఏ కోరింది. ఈ బృందాలకు స్కూటీలతోపాటు వైర్‌లెస్ సెట్లు, అధునాతన ఆయుధాలు అందజేస్తారు. మామూలు బీట్ కానిస్టేబుళ్ల లాగే వీరికీ విధులు కేటాయించబడతాయి. అయితే వీరికి మహిళా కాలేజీలు, బాలికల పాఠశాలలు, మహిళా హాస్టళ్లు, మార్కెట్ల వద్దే ఎక్కువగా విధులున కేటాయిస్తారు.
 
 వీరికి స్కూటీలనే ఎందుకు అందజేస్తున్నారనే విషయమై ఒక ఉన్నత పోలీస్ అధికారి మాట్లాడుతూ..‘ చాలా తక్కువ మంది మహిళలే బైక్‌లను నడపుతారు. అవి ఎక్కువ బరువుండటంతో పాటు బ్యాలన్స్ చేయడం కూడా మహిళలకు కొంచెం ఇబ్బందికరంగానే ఉంటాయి.. అదే స్కూటీలైతే తేలిగ్గా ఉంటాయి. చాలామంది మహిళలు చాలా సులభంగా వీటిని నడపగలుగుతారు.. అందుకే మహిళా కానిస్టేబుళ్లకు స్కూటీలను అందజేయాలనే నిర్ణయించాం..’ అని ఆయన వివరించారు.
 
 నగరవ్యాప్తంగా ఎంతమంది మహిళా కానిస్టేబుళ్లు, స్కూటీలు అవసరమో నివేదిక వీలైనంతర త్వరగా అందజేయాలని ఆయా రేంజ్‌లకు సంబంధించిన జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (జేసీపీ)లకు సమాచారం అందించామని ఉన్నతాధికారులు తెలిపారు. నగరంలో మహిళలు, బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు, వేధింపులను నిరోధించేందుకే ఎంహెచ్‌ఏ ఈ నిర్ణయం తీసుకుందని పోలీస్ వర్గాలు తెలిపాయి. కేంద్రంలో మోడీ సర్కార్ ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిసారి గత నెల 16వ తేదీన ఢిల్లీ పోలీస్ అధికారులతో కేంద్ర హోం మంత్రి సమావేశమైన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా జాతీయ రాజధానిలో మహిళా భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. దాని ఫలితమే సూపర్ పోలీస్ కాప్‌ల ఏర్పాటని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement