ఎమ్మెన్నెస్‌కు చెందిన నలుగురు మాజీ ఎమ్మెల్యేలతోపాటు మరికొందరు బీజేపీ వైపు అడుగులు..
సాక్షి, ముంబై: ఎమ్మెన్నెస్‌కు చెందిన నలుగురు మాజీ ఎమ్మెల్యేలతోపాటు మరికొందరు బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారు. కొత్త ఏడాది ఆరంభంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడి సమక్షంలో వీరంతా కమలం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. వీరి చేరికకు మార్గం సుగమమైందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఘోరంగా పరాజయాన్ని ఎమ్మెన్నెస్ జీర్ణించుకోలేకపోతోంది.
దీనికితోడు ఒక్కొక్కరుగా పార్టీ నుంచి బయటపడుతున్నారు. శాసనసభ ఎన్నికల ఫలితాల తర్వాత ఓటమిపాలైన కొందరు అభ్యర్థులు... ఆ పార్టీ సీనియర్ నాయకులుగా వెలుగొందుతున్న అవినాశ్ అభ్యంకర్, బాలానాంద్‌గావ్కర్‌లపై రాజ్‌ఠాక్రేకు ఫిర్యాదు చేశారు. ఓటమికిగల కారణాలను ఆయనకు విశ్లేషించారు. అయినప్పటికీ రాజ్ ఠాక్రే ఇంతవరకు వారిపై ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. దీంతో ప్రవీణ్ దరేకర్‌తోపాటు వసంత్ గీతే తదితరులు పార్టీకి రాజీనామా చేశారు.