నువ్వు లేక నేను లేను అన్నాడు.. కానీ!

Love Affair Women Protest In Front Of Lover House - Sakshi

భువనేశ్వర్‌ : వాళ్లిద్దరూ మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. కలిసి తిరిగారు. నువ్వు లేకపోతే నేను లేనంటూ బాసలు చేసుకున్నారు. ఇంతలో ఏమైందో తెలియదు ఆ యువకుడు ముఖం చాటేయడంతో కథ అడ్డం తిరిగింది. బాధిత యువతి, కుటుంబ సభ్యులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని జమదాల గ్రామానికి చెందిన కళింగపట్నం పద్మ (రజక కులానికి చెందిన యువతి) అదే గ్రామానికి చెందిన మత్స్యకార సామాజికవర్గానికి చెందిన కొర్ర సంతోష్‌కుమార్‌ ప్రేమించుకున్నారు. సంతోష్‌ను పూర్తిగా నమ్మిన పద్మ శారీరకంగా దగ్గరైంది. పద్మ తల్లిదండ్రులు సంబంధాలు తీసుకువచ్చినా ఎవర్నీ పెళ్లి చేసుకోవద్దని...

తానే చేసుకుంటానని సంతోష్‌ చెప్పడంతో బాధిత యువతి వచ్చిన సంబంధాలను వదులుకుంది. అయితే తనను పెళ్లి చేసుకోవాలని పద్మ కోరగా కొద్దికాలం నుంచి సంతోష్‌ తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ విషయాన్ని గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లగా సంతోష్‌ పెళ్లికి నిరాకరించాడు. దీంతో రెండు రోజుల కిందట పద్మ ప్రియుడి ఇంటిముందు తనకు న్యాయం చేయాలంటూ బైఠాయించగా.. పెద్ద మనుషుల ముందు సంతోష్‌ పెళ్లికి ఒప్పుకున్నాడు. మరలా మాట తప్పడంతో పద్మ శుక్రవారం యువకుడి ఇంటి ముందు బైఠాయించింది. తనకు న్యాయం చేసే వరకూ దీక్ష విరమించేది లేదని బాధితరాలు స్పష్టం చేస్తోంది.

మాకు ఇష్టమే..
తమ కుమారుడు సంతోష్‌కి నచ్చితే పెళ్లి చేయడానికి తమకు ఇబ్బంది లేదని యువకుడి తల్లిదండ్రులు చెబుతున్నారు. అయితే ఈ నాటకమంతా వారే ఆడిస్తున్నారని బాధిత యువతి ఆరోపించింది. తనను పెళ్లి చేసుకుంటే చనిపోతామని  తల్లిదండ్రులు బెదిరించడం వల్లే సంతోష్‌ తనతో వివాహానికి వెనకడుగు వేస్తున్నాడని చెప్పింది. ఇదిలా ఉంటే తనతో పాటు తమ కుటుంబ సభ్యులపై దాడి కూడా చేస్తున్నారని ఆరోపించింది. చివరకు ఈ కేసు పార్వతీపురం రూరల్‌ పోలీసు స్టేషన్‌కుచేరింది. ఎస్సై లోవరాజు ఇరువర్గాలతో మాట్లాడినా సంతోష్‌ పెళ్లికి ఒప్పుకోవడం లేదు.

అనేక మలుపులు..!
ప్రేమికుల వివాదం అనేక మలుపులు తిరుగుతోంది. ఒకసారి చేసుకుంటాను.. మరోసారి చేసుకోను.. అంటూ ప్రియుడు మాట మార్చడం వెనుక కొంతమంది పెద్దల దన్ను ఉందని బాధిత యువతి తరఫు వారు ఆరోపిస్తున్నారు. ఇరువర్గాల మధ్య గొడవలు సృష్టించి ఆ నెపం మామీద వేసి కేసులు బనాయించాలని చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top