‘మిస్టర్ అండ్ మిస్సెస్ అయ్యర్’ సినిమా తర్వాత పరిశ్రమలో మంచి గుర్తింపు | Sakshi
Sakshi News home page

‘మిస్టర్ అండ్ మిస్సెస్ అయ్యర్’ సినిమా తర్వాత పరిశ్రమలో మంచి గుర్తింపు

Published Sat, May 10 2014 10:46 PM

‘మిస్టర్ అండ్ మిస్సెస్ అయ్యర్’ సినిమా తర్వాత పరిశ్రమలో మంచి గుర్తింపు

తల్లి, దర్శకురాలు అపర్ణాసేన్ నుంచి పొందిన స్ఫూర్తితో సినీపరిశ్రమలోకి అడుగుపెట్టిన కొంకణాసేన్ ఖాతాలో విజయాలు తక్కువేనని చెప్పాలి. అయితే నటనపరంగా చూస్తూ మిగతా నటీనటులకంటే ఆమెకే ఎక్కువ మార్కులు పడ్డాయి. ఈ విషయమై అస్ట్రేలియాలోని సత్యజిత్ రే ఇన్‌స్టిట్యూట్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ... ‘మిస్టర్ అండ్ మిస్సెస్ అయ్యర్ సినిమా తర్వాత పరిశ్రమలో నాకు మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమాలో నటనకుగాను నాకు జాతీయ అవార్డు వచ్చింది. చిత్రీకరణ సమయంలో నటనలోని అన్ని కోణాలను చాలా దగ్గరగా చూశాననే అనుభూతి కలిగింది.

 నిజానికి ఆ సినిమా అంగీకరించే సమయంలో నాకు నటనలో పెద్దగా అనుభం లేదనే చెప్పాలి. కానీ నా తల్లి, దర్శకురాలు అపర్ణాసేన్ ప్రోత్సాహంతో ఆ పాత్రను ఒప్పుకున్నాను. నటనకు సంబంధించి ఎన్నో మెళకువలు ఆమె వద్ద నేర్చుకున్నాను. సినిమాలో నా పాత్ర కోసం ఓ పరిశోధన జరిగిదంనే చెప్పాలి. పాత్ర తీరుతెన్నులు ఎలా ఉండాలనే విషయాన్ని తెలుసుకునేందుకు అమ్మ చెన్నై వెళ్లింది. తనపాటు అసిస్టెంట్‌గా నన్ను తీసుకెళ్లింది. అలా తీసుకెళ్లడం నాకెంతో ఉపయోగపడింది. మొత్తానికి సినిమా బాగా వచ్చింది. ఆ తర్వాత అవార్డుల గురించి మీకు తెలిసిందే.

 అయితే సినిమాకు అవార్డులు వచ్చే సమయంలో నేను ఢిల్లీలో ఓ జాబ్‌లో స్థిరపడిపోయాను. కానీ అవార్డు తర్వాత అవకాశాలు నన్ను వెతుక్కుంటూ వచ్చాయి. ఇంగ్లిష్, బెంగాలీ, హిందీ సినిమాల్లో నటించాను. బాల నటిగా 1983లోనే ‘ఇందిరాహ్’తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నాకు తొలి చిత్రంలోనే బాలుడిలా కనిపించేందుకు వెంట్రుకలు కత్తిరించుకోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి సినిమా కోసం ఏదైనా చేయాలనే అభిప్రాయానికి వచ్చాను. అదే నన్ను జాతీయ అవార్డు దక్కించుకునేలా చేసింద’ని చెప్పింది.
 

Advertisement
Advertisement