
15 నుంచి గడపగడపకూ వైఎస్సార్
ఈ నెల 15వ తేదీన గురజాల నియోజకవర్గం పిడుగురాళ్లలోని 29, 30 వార్డులో నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేష్‌రెడ్డి గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ చెప్పారు.
- పిడుగురాళ్ల పట్టణం నుంచి ప్రారంభం
- పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్
పట్నంబజారు (గుంటూరు): ఈ నెల 15వ తేదీన గురజాల నియోజకవర్గం పిడుగురాళ్లలోని 29, 30 వార్డులో నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేష్‌రెడ్డి గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ చెప్పారు. అరండల్‌పేటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. గురజాల నియోజకవర్గ సమన్వయకర్తగా నూతనంగా నియమితులైన కాసు మహేష్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగా కృష్ణమూర్తితో కలిసి గడప, గడపకూ వైఎస్సార్ నిర్వహిస్తారని తెలిపారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే గడప గడపకూ వైఎస్సార్ జరుగుతోందన్నారు.
ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లోనూ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వాటిని మా దృష్టికి తీసుకొస్తున్నారని తెలిపారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ ప్రజల కష్టాలు తెలుసుకుని, వాటి పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని నిలదీసేందుకు గడపగడపకూ వైఎస్సార్ జరుగుతోందని పేర్కొన్నారు. కాసు మహేష్‌రెడ్డి గడపగడపకూ వైఎస్సార్‌ను ప్రారంభించనున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు.
పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం వాటిల్లేలా..ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. 15న ప్రారంభం కానున్న కార్యక్రమానికి పార్టీ జిల్లా ఇన్‌చార్జి, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు పలువురు ముఖ్యఅతిథులు రానున్నారని తెలిపారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ నేతలు ఆతుకూరి ఆంజనేయులు, పోలూరి వెంకటరెడ్డి, కొత్తా చిన్నపరెడ్డి, ఉప్పుటూరి నర్సిరెడ్డి, పలువురు జెడ్పీటీసీలు, నేతలు పాల్గొన్నారు.