ముండేకు ఆదిలాబాద్ వాసుల నివాళి


గుడిహత్నూర్ (ఆదిలాబాద్), న్యూస్‌లైన్ : మహా రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గోపీనాథ్ ముండే అకాల మరణం మండల వాసులను దిగ్భాంత్రికి గురిచేసింది. ఆయనకు వేర్వేరు చోట్ల శ్రద్ధాంజలి ఘటించారు. మండలంలో ఆయన బంధువులు చాలా మంది ఉండడంతో వారంతా ఆయన మరణాన్ని తట్టుకోలేకపోయారు. గతంలో ఇదే సాన్నిహిత్యంతో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుడిహత్నూర్‌ను ఆయన సందర్శించారు. దీంతో ఇక్కడి నాయకులకు సుపరిచితుడిగా ఉండిపోయారు. మంగళవారం ఆయన అకాల మృతి చెందడంతో మండలవాసులు తీవ్ర దిగ్భాంత్రికి లోనయ్యారు.



 స్థానిక బంధువులు, నాయకులు జాతీయ రహదారి 44లోని చౌరస్తాలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. మహారాష్ట్ర ప్రజల ప్రియనేత తమ సన్నిహితుడు గోపీనాథ్ ముండే లేని లోటును ఎవరూ తీర్చలేరని జెడ్పీటీసీ కేశవ్ గిత్తే, గణేశ్ ముండే అన్నారు. లియాఖత్ అలీఖాన్, రాజారాం, బీజేపీ జిల్లా నాయకుడు డా.లక్ష్మణ్ కేంద్రే, టీఆర్‌ఎస్ నాయకులు వామన్ గిత్తే, వైజునాథ్ కేంద్రే,  గిత్తే మదన్ సేట్, ఎంపీటీసీ సత్యరాజ్, సర్పంచ్ ప్రతాప్, ఇద్రిస్‌ఖాన్, కాంగ్రెస్ నాయకులు బేర దేవన్న. రవూఫ్‌ఖాన్‌లతో పాటు డా.నారాయణ్ ఫడ్ తదితరులు పాల్గొన్నారు.



 మహానేతను కోల్పోయాం

 గోపీనాథ్ ముండే మృతికి నివాళిగా గుడిహత్నూర్‌లో రాత్రి 8 గంటల ప్రాంతంలో స్థానిక శివాలయం నుంచి, బస్టాండ్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. సంజీవ్ ముండే, రావణ్ ముండే, మాధవ్ కేంద్రే, నీలకంఠ్ అప్పా, గణేష్ ముండే, త్రియంబక్ ముండే, రవింద్రనాథ్ ముండే, రాహుల్ ముండే, దీపక్ ముండే, వెంకటీ ముండే, జ్ఞానేశ్వర్, దిలీప్ ముండే పాల్గొన్నారు.



 గోపీనాథ్ స్వగ్రామానికి పయనం

 కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే అంత్యక్రియల్లో పాల్గొనడానికి మండలంలోని ఆయన బంధువులు ఆయన స్వగ్రామమైన మహారాష్ట్రలోని భీడ్ జిల్లా పరళీ తాలుకాలోని నాత్రా గ్రామానికి బయల్దేరారు. కడసారి చూపుకైనా నోచుకోవాలని మండల వంజరి కులస్తులు, నాయకులు మంగళవారం రాత్రి నాత్రాకు వెళ్లారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top