ఈ ఏడాది జాతీయ సాహస బాలల పురస్కారానికి ఎంపికైన 25 మందిలో ఇద్దరు నగరవాసులు కూడా ఉన్నారు. కేదార్‌నాథ్ ను
ఇద్దరు ఢిల్లీ చిన్నారులకు సాహస అవార్డులు
Jan 18 2014 10:58 PM | Updated on Sep 2 2017 2:45 AM
సాక్షి, న్యూఢిల్లీ: ఈ ఏడాది జాతీయ సాహస బాలల పురస్కారానికి ఎంపికైన 25 మందిలో ఇద్దరు నగరవాసులు కూడా ఉన్నారు. కేదార్‌నాథ్ ను అతలాకుతలం చేసిన జలప్రళయంలో నాలుగేళ్ల తన తమ్ముడిని రక్షించిన తొమ్మిదేళ్ల మహికా గుప్తా, ఆగ్రా కాలువలో నీట మునిగిపోతున్నవారిని కాపాడినందుకు పదకొండేళ్ల సాగర్ కశ్యప్ ఈ నెల 25వ తేదీన ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ చేతుల మీదుగా ఈ పురస్కరాలను అందుకోనున్నారు. గత ఏడాది జూన్ 16వ తేదీన తల్లిదండ్రులు, బంధువులతో కలసి కేదార్‌నాథ్ యాత్రకు వెళ్లిన మహికా గుప్తాకు జీవితంలో మరచిపోలేని అనుభవాలను మిగిల్చింది.
సాయంత్రం ఏడుగంటలకు హోటల్ గదిలో తన నాలుగేళ్ల తమ్ముడితో ఒంటరిగా ఉన్న సమయంలో వరద నీరు ఆకస్మికంగా వచ్చేసింది. ‘అమ్మానాన్న తదితరులంతా గుడికి వె ళ్లారు. మాతో ఎవరూ లేరు. ఎక్కడచూసినా నీళ్లు, రాళ్లే. అంతలోనే తమ్ముడి ఏడుపు వినిపించింది. తమ్ముడు నీళ్లలో కొట్టుకుపోతూ ఏడవడం కనిపించింది. నాకు ఈత రాదు. ఏం చేయాలో తోచలేదు. అయినా తమ్ముడిని గట్టిగా పట్టుకుని బయటకు లాగా. తమ్ముడిని గట్టిగా కరచిపట్టుకుని కిటికీ రాడ్ పట్టుకుని వేలాడుతూ ఉండిపోయాను. నీటి వరద తగ్గిపోయాక బయటపడ్డాం’ అని చిన్నారి మహికా తన అనుభవాన్ని నెమరువేసుకుంది. అసలు అంత శక్తి తనకు ఎలా వచ్చిందతో తెలియదని, తమ్ముడిని ఎలాగైనా కాపాడాలని ఒంట్లో సత్తువనంతా కూడదీసుకుని ఉంటానేమోనని ఆ బాలిక తెలిపింది.
తిండి, నీరు లేకుండా మూడు రోజులు గడిపిన తరువాత తమ ఇద్దరు పిల్లలు తమకు కనిపించారని మహికా తల్లి రేణూ గుప్తా తెలిపారు. ఘటన జరిగిన వారం రోజుల వరకు మహికా ఆ దిగ్భ్రాంతి నుంచి కోలుకోలేకపోయిందని ఆమె తండ్రి దీపక్‌గుప్తా చెప్పారు. ప్రజెంటేషన్ కాన్వెంట్ స్కూల్‌లో మహికా చదువుకుంటోంది. ఎనిమిదో తరగతి చదువుతున్న సాగర్ కశ్యప్ ఆగ్రా కెనాల్‌లో కొట్టుకుపోతున్న నలుగురిని ఒడ్డుకు చే ర్చి సాహస పురస్కారానికి ఎంపికయ్యాడు. ‘సరితా విహార్‌లో తండ్రికి భోజనం ఇచ్చి తిరిగివస్తుండగా ఆగ్రా కెనాల్ లోనుంచి కేకలు వినిపించాయి. ఈత రావడంతో వెంటనే నీటిలోకి దూకి ముగ్గురిని సురక్షితంగా బయటకు లాగగలిగాన’ని సాగర్ చెప్పాడు. ఈ సాహసానికి గుర్తింపుగా అతనికి గాడ్‌ఫ్రే ఫిలిప్స్ జాతీయ సాహస పురస్కారం కూడా లభించింది.
Advertisement
Advertisement