breaking news
Bravery Awards
-
11 మంది ఏపీ పోలీసులకు శౌర్య పతకాలు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించిన అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు సత్తా చాటారు. 11 మంది పోలీస్ శౌర్య పతకాలు, ఇద్దరు రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీస్ పతకాలు, 14 మంది ప్రతిభా పోలీసు పతకాలు దక్కించుకున్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోం శాఖ దేశవ్యాప్తంగా ఇద్దరికి రాష్ట్రపతి పోలీస్ శౌర్య పతకాలు, 628 మందికి పోలీస్ శౌర్య పతకాలు, 88 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీస్ పతకాలు, 662 మందికి ప్రతిభా పోలీస్ పతకాలు ప్రకటించింది. ► ఏపీ నుంచి రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీస్ పతకాలు దక్కించుకున్నవారు: నలగట్ల సుధాకర్‌రెడ్డి (డీఎస్పీ, చిత్తూరు), పి.సీతారామ్ (కమాండెంట్, అదనపు డీజీపీ కార్యాలయం, గ్రేహౌండ్స్) ► ఏపీ నుంచి ప్రతిభా పోలీస్ పతకాలు వీరికే: కె.రఘువీర్‌రెడ్డి (ఏఎస్పీ, ఇంటెలిజెన్స్, రాజమహేంద్రవరం), కె.సదాశివ వెంకట సుబ్బారెడ్డి (ఏఎస్పీ, ఒంగోలు), కె.నవీన్‌కుమార్ (ఏఎస్పీ, అదనపు డైరెక్టర్ కార్యాలయం, హైదరాబాద్), వట్టికుంట వెంకటేశ్వర నాయుడు (ఏసీపీ, దిశ పోలీస్‌స్టేషన్, విజయవాడ), చింతపల్లి రవికాంత్ (ఏసీపీ, సిటీ స్పెషల్ బ్రాంచ్, విజయవాడ), వెంకటప్ప హనుమంతు (అసిస్టెంట్ కమాండెంట్, 6వ బెటాలియన్, ఏపీఎస్పీ, మంగళగిరి), జి.రవికుమార్ (డీఎస్పీ, తిరుపతి), కడిమిచెర్ల వెంకట రాజారావు (డీఎస్పీ, పీటీవో, మంగళగిరి), జె.శ్రీనివాసులురెడ్డి (ఎస్డీపీవో, నెల్లూరు), బోళ్ల గుణ రాము (ఇన్స్పెక్టర్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, విజయవాడ), మద్ది కోటేశ్వరరావు (ఎస్ఐ, సీసీఎస్, శ్రీకాకుళం), మేడిద వెంకటేశ్వర్లు (ఏఆర్ఎస్ఐ, నెల్లూరు), రమావత్ రామనాథం (ఏఆర్ఎస్ఐ, సీఎస్‌డబ్ల్యూ, విజయవాడ), ఈర్వ శివశంకర్‌రెడ్డి (ఏఆర్ఎస్ఐ, 9వ బెటాలియన్, వెంకటగిరి). కేంద్ర హోం శాఖ పరిధిలోని అధికారులకు ప్రతిభా పోలీస్ పతకం: రాజ్‌కుమార్ మద్దాలి (అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్–2, విజయవాడ) ► ఏపీ నుంచి పోలీస్ శౌర్య పతకాలు దక్కించుకున్నవారు: ఎస్.బుచ్చిరాజు (జేసీ), జి.హరిబాబు (జేసీ), ఆర్.రాజశేఖర్ (డీఏసీ), డి.మబాష (ఏఏసీ), బి.చక్రధర్ (జేసీ), కె.పాపినాయుడు (ఎస్ఐ), సీహెచ్ సాయిగణేష్ (డీఏసీ), ఎం.ముణేశ్వరరావు(ఎస్సీ), ఎం.నాని (జేసీ), పి.అనిల్‌కుమార్ (జేసీ), టి.కేశవరావు (హెచ్‌సీ) కాళంగి దళ ఎన్‌కౌంటర్‌తో గుర్తింపు ప్రతిష్టాత్మక రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీస్ పతకం పొందిన నలగట్ల సుధాకర్‌రెడ్డి కడపలో డిగ్రీ, తిరుపతిలో పీజీ చేశారు. 1991లో ఎస్ఐగా పోలీస్ శాఖలో అడుగుపెట్టారు. 2014లో డీఎస్పీగా పదోన్నతి పొందారు. ప్రస్తుతం చిత్తూరు నగర డీఎస్పీగా పనిచేస్తున్నారు. 1995లో శ్రీకాళహస్తిలో జరిగిన కాళంగి దళ ఎన్‌కౌంటర్‌తో ఈయనకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అదే ఏడాది సామపాటి అనే దోపిడీ ముఠాను పట్టుకుని 155 తుపాకులు, రూ.10 లక్షల నగదు సీజ్ చేశారు. 2008లో తిరుపతిలో ఆరేళ్ల పాపను హత్య చేసిన కేసులో దోషిని అరెస్టు చేసి జీవితఖైదు పడేలా చూశారు. 2010లో అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఫ్యాక్షన్, మట్కా కట్టడిలో విశేష ప్రతిభ చూపారు. 2010లో సేవాపతకం, 2012లో ఇండియన్ పోలీస్ మెడల్, 2015లో ఉత్తమ సేవాపతకం పొందారు. 400కు పైగా క్యాష్ రివార్డులు, 27 ప్రశంసపత్రాలు కూడా లభించాయి. -
ఇద్దరు ఢిల్లీ చిన్నారులకు సాహస అవార్డులు
సాక్షి, న్యూఢిల్లీ: ఈ ఏడాది జాతీయ సాహస బాలల పురస్కారానికి ఎంపికైన 25 మందిలో ఇద్దరు నగరవాసులు కూడా ఉన్నారు. కేదార్నాథ్ ను అతలాకుతలం చేసిన జలప్రళయంలో నాలుగేళ్ల తన తమ్ముడిని రక్షించిన తొమ్మిదేళ్ల మహికా గుప్తా, ఆగ్రా కాలువలో నీట మునిగిపోతున్నవారిని కాపాడినందుకు పదకొండేళ్ల సాగర్ కశ్యప్ ఈ నెల 25వ తేదీన ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ చేతుల మీదుగా ఈ పురస్కరాలను అందుకోనున్నారు. గత ఏడాది జూన్ 16వ తేదీన తల్లిదండ్రులు, బంధువులతో కలసి కేదార్నాథ్ యాత్రకు వెళ్లిన మహికా గుప్తాకు జీవితంలో మరచిపోలేని అనుభవాలను మిగిల్చింది. సాయంత్రం ఏడుగంటలకు హోటల్ గదిలో తన నాలుగేళ్ల తమ్ముడితో ఒంటరిగా ఉన్న సమయంలో వరద నీరు ఆకస్మికంగా వచ్చేసింది. ‘అమ్మానాన్న తదితరులంతా గుడికి వె ళ్లారు. మాతో ఎవరూ లేరు. ఎక్కడచూసినా నీళ్లు, రాళ్లే. అంతలోనే తమ్ముడి ఏడుపు వినిపించింది. తమ్ముడు నీళ్లలో కొట్టుకుపోతూ ఏడవడం కనిపించింది. నాకు ఈత రాదు. ఏం చేయాలో తోచలేదు. అయినా తమ్ముడిని గట్టిగా పట్టుకుని బయటకు లాగా. తమ్ముడిని గట్టిగా కరచిపట్టుకుని కిటికీ రాడ్ పట్టుకుని వేలాడుతూ ఉండిపోయాను. నీటి వరద తగ్గిపోయాక బయటపడ్డాం’ అని చిన్నారి మహికా తన అనుభవాన్ని నెమరువేసుకుంది. అసలు అంత శక్తి తనకు ఎలా వచ్చిందతో తెలియదని, తమ్ముడిని ఎలాగైనా కాపాడాలని ఒంట్లో సత్తువనంతా కూడదీసుకుని ఉంటానేమోనని ఆ బాలిక తెలిపింది. తిండి, నీరు లేకుండా మూడు రోజులు గడిపిన తరువాత తమ ఇద్దరు పిల్లలు తమకు కనిపించారని మహికా తల్లి రేణూ గుప్తా తెలిపారు. ఘటన జరిగిన వారం రోజుల వరకు మహికా ఆ దిగ్భ్రాంతి నుంచి కోలుకోలేకపోయిందని ఆమె తండ్రి దీపక్‌గుప్తా చెప్పారు. ప్రజెంటేషన్ కాన్వెంట్ స్కూల్లో మహికా చదువుకుంటోంది. ఎనిమిదో తరగతి చదువుతున్న సాగర్ కశ్యప్ ఆగ్రా కెనాల్లో కొట్టుకుపోతున్న నలుగురిని ఒడ్డుకు చే ర్చి సాహస పురస్కారానికి ఎంపికయ్యాడు. ‘సరితా విహార్‌లో తండ్రికి భోజనం ఇచ్చి తిరిగివస్తుండగా ఆగ్రా కెనాల్ లోనుంచి కేకలు వినిపించాయి. ఈత రావడంతో వెంటనే నీటిలోకి దూకి ముగ్గురిని సురక్షితంగా బయటకు లాగగలిగాన’ని సాగర్ చెప్పాడు. ఈ సాహసానికి గుర్తింపుగా అతనికి గాడ్ఫ్రే ఫిలిప్స్ జాతీయ సాహస పురస్కారం కూడా లభించింది.