ఇంతటి వరస్ట్‌ క్యాచ్‌ డ్రాపింగ్‌ చూశారా?

Worst Dropped Catch Ever, Joe Denly Stuns Team Mates - Sakshi

హామిల్టన్‌: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్‌ కేవలం డ్రాతో సరిపెట్టుకోవడంతో సిరీస్‌ను కోల్పోయింది. అదే సమయంలో తొలి టెస్టులో ఇన్నింగ్స్‌తో తేడాతో గెలిచిన న్యూజిలాండ్‌ సిరీస్‌ను 1-0తో కైవసం చేసుకుంది. రెండో టెస్టును గెలిస్తేనే సిరీస్‌ను కాపాడుకునే పరిస్థితుల్లో ఇంగ్లండ్‌ ఫీల్డింగ్‌ పొరపాట్లు కొట్టొచ్చినట్లు కనబడ్డాయి.  ప్రధాన ఆటగాడైన న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ ఇచ్చిన క్యాచ్‌ను ఇంగ్లండ్‌ ఫీల్డర్‌ జో డెన్లీ వదిలేసిన తీరు అందర్నీ నవ్వుల్లో ముంచెత్తింది. జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో విలియమ్సన్‌ ఒక షాట్‌ను మిడ్‌ వికెట్‌ మీదుగా ఆడగా అది క్యాచ్‌గా లేచి నేరుగా వెళ్లి ఫీల్డర్‌ డెన్లీ చేతుల్లో పడింది.

అయితే దాన్ని డెన్లీ వదిలేశాడు. అది చాలా సునాయాసమైన క్యాచ్‌ కావడంతో విలియమ్సన్‌ ఔటయ్యాడనే అనుకున్నారంతా. కానీ డెన్లీ ఆ క్యాచ్‌ను నేలపాలు చేశాడు. తక్కువ ఎత్తులో సమానమైన వేగంతో వచ్చిన బంతి క్యాచ్‌ రూపంలో వస్తే డెన్లీ వదిలేయడంతో ఆటగాళ్లతో పాటు కామెంటేటర్లు కూడా తలలు పట్టుకున్నారు. ఒకవైపు బౌలర్‌ ఆర్చర్‌ సెలబ్రేషన్స్‌ చేసుకుంటుంటే.. ఆ క్యాచ్‌ను వదిలేయడం చూసిన స్టువర్ట్‌ బ్రాడ్‌ షాకయ్యాడు.  అప్పటికి విలియమ్సన్‌ 62 పరుగుల వద్ద ఉన్నాడు. ఆ తర్వాత విలియమ్సన్‌కు మరొక లైఫ్‌ లభించింది. విలియమ్సన్‌ను రనౌట్‌ చేసే అవకాశాన్ని సామ్‌ కర్నాన్‌ జార విడిచాడు. ఇలా రెండు లైఫ్‌లు సెంచరీ పూర్తి చేసుకున్నాడు విలియమ్సన్‌. కాకపోతే అటు తర్వాత వర్షం పడటంతో మ్యాచ్‌ రద్దు చేయక తప్పలేదు.

డెన్లీ క్యాచ్‌ డ్రాపింగ్‌పై సోషల్‌ మీడియలో జోకులు పేలుతున్నాయి.  డెన్లీ.. మరో మైక్‌ గాటింగ్‌లా ఉన్నాడంటూ నెటిజన్లు ఆడేసుకుంటున్నారు.  1993లో భారత్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో కిరణ్‌ మోరే వికెట్లు ముందు ఇచ్చిన చాలా సింపుల్‌ క్యాచ్‌ను గాటింగ్‌ ఇలానే వదిలేయడాన్ని ఉదహరిస్తున్నారు. ఇది టెస్టు చరిత్రలోనే చెత్త ఫీల్డింగ్‌ అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top