వరల్డ్‌ టీ20: ఫైనల్‌కు టీమిండియా తొలిసారి

World T20: India Enter Maiden Final As Rain Washes Out Semis - Sakshi

సిడ్నీ: మహిళల టి20 ప్రపంచ కప్‌ చరిత్రలో భారత జట్టు తొలిసారి ఫైనల్‌కు చేరింది. ఈ మెగా టోర్నీల్లో ఇప్పటివరకూ మూడు సందర్భాల్లో సెమీస్‌ వరకే పరిమితమైన భారత మహిళలు.. ఈసారి మాత్రం తుది పోరుకు అర్హత సాధించారు. ఈ రోజు ఇంగ్లండ్‌తో జరగాల్సిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కావడంతో గ్రూప్‌-ఎలో అజేయంగా నిలిచిన భారత్‌ ఫైనల్‌ బెర్తును ఖాయం చేసుకుంది. తన గ్రూప్‌లో భారత్‌ ఒక్క మ్యాచ్‌ కూడా ఓడి పోకుండా అజేయంగా నిలిచింది. ఇంగ్లండ్‌తో నాకౌట్‌ మ్యాచ్‌కు భారీ వర్షం అంతరాయం కల్గించడంతో కనీసం టాస్‌ కూడా పడకుండానే గేమ్‌ రద్దయ్యింది. ఉదయం నుంచి ఎడ తెరిపి లేకుండా వర్షం కురుస్తూ ఉండటంతో మ్యాచ్‌ను నిర్వహించాలనే ప్రయత్నాలు సాగలేదు. ఈ వరల్డ్‌కప్‌లో నాకౌట్‌ మ్యాచ్‌లకు రిజర్వ్‌ డే లేకపోవడం గమనార్హం. (నంబర్‌ వన్‌గా షఫాలీ.. ఐసీసీ స్పెషల్‌ వీడియో!)

పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండటంతో భారత్‌కు ఫైనల్‌ చాన్స్‌ దక్కింది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన రెండో సెమీస్‌ కూడా సిడ్నీ మైదానంలోనే జరుగనుంది. ఒకవేళ ఆసీస్‌-దక్షిణాఫ్రికాల మ్యాచ్‌ కూడా రద్దయితే  సఫారి టీమ్‌ ఫైనల్‌కు వెళుతుంది. గ్రూప్‌ ‘బి’లో దక్షిణాఫ్రికా అగ్రస్థానంలో నిలిచింది. మరి టీమిండియా ఫైనల్‌ ప్రత్యర్థి ఎవరు అనేది ఈరోజు తేలిపోనుంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆసీస్‌ ఫైనల్‌కు చేరుతుందా.. లేక సఫారీలు తుది పోరుకు చేరుకుంటారో చూడాలి. 

టోర్నీ ప్రారంభానికి ముందు అంగీకరించిన నిబంధనల్లో రిజర్వ్‌ డే ప్రస్తావన లేకపోవడంతో దీన్ని పెట్టలేదు. ఆలస్యంగా మేలుకున్న ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు (సీఏ) తర్వాత రిజర్వ్‌ డే గురించి అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది. ముందుగా అనుకున్నదాని ప్రకారం సెమీఫైనల్‌ మ్యాచ్‌ల కోసం రిజర్వ్‌ డే లేదని, చివరి నిమిషంలో షెడ్యూల్‌ మార్చలేమని సీఏకు ఐసీసీ స్పష్టం చేసింది. సెమీస్, ఫైనల్‌ మ్యాచ్‌లకు రిజర్వ్‌ డే పెడితే టోర్నీ వ్యవధి మరింత పెరుగుతుందని, ఇది అనవసరపు ఇబ్బందికి దారి తీస్తుందని కూడా ఐసీసీ వెల్లడించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం వర్షం పడితే పిచ్, మైదానం పరిస్థితులను బట్టి రిఫరీ నిర్ణయం తీసుకుంటారు.  కనీసం ఒక్కో జట్టు 10 ఓవర్ల చొప్పున ఆడే అవకాశం ఉంటేనే మ్యాచ్‌ కొనసాగిస్తారు. అంతకంటే తక్కువ ఓవర్లే సాధ్యమైతే మ్యాచ్‌ రద్దయినట్లే. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top