విండీస్‌ను కొట్టేందుకు..

Windies in the third T20 clean sweep in Chennai today - Sakshi

చెన్నైలో నేడు మూడో టి20

క్లీన్‌ స్వీప్‌ ఊపులో టీమిండియా

పరువు కాపాడుకునే యత్నంలో విండీస్‌

దాదాపు ఏకపక్షంగానే సాగిన సిరీస్‌లో తుది అంకం. రెండు టెస్టులనూ అలవోకగా గెలిచేసి, ఐదు వన్డేల సిరీస్‌ను ఒడిసి పట్టేసిన టీమిండియాకు టి20 ప్రపంచ చాంపియన్‌ వెస్టిండీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసే అవకాశం. 
విజయాల ఊపులో ఉన్న రోహిత్‌ బృందానికిది నల్లేరుపై నడకే! అటు ఆటలో, ఇటు దృక్పథంలో తేలిపోతున్న కరీబియన్లు విజయం అందుకోవాలంటే శక్తికి మించి ఆడాల్సిందే!

చెన్నై: పెద్దగా శ్రమించకుండానే వెస్టిండీస్‌తో టి20 సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్‌కు... దానిని సంపూర్ణ విజయంగా మార్చుకునే సందర్భం వచ్చింది. చెన్నైలోని చెపాక్‌ మైదానం వేదికగా ఆదివారం జరుగనున్న మూడో టి20 ఇందుకు వేదిక కానుంది. ఇప్పటికే సిరీస్‌ వశమైనందున టీమిండియా రెట్టించిన ఆత్మవిశ్వాసంతో బరిలో దిగనుంది. మరోవైపు పర్యాటక జట్టు పరాభవం తప్పించుకునే ప్రయత్నం చేయనుంది.

తుది జట్టులోకి చహల్, సుందర్‌... 
బుమ్రా, కుల్దీప్‌లకు విశ్రాంతి ఇవ్వడంతో ఈ మ్యాచ్‌లో భారత తుది జట్టులో రెండు మార్పులు ఖాయమయ్యాయి. వీరి స్థానాల్లో లెగ్‌ స్పిన్నర్‌ యజువేంద్ర చహల్, స్థానిక కుర్రాడు వాషింగ్టన్‌ సుందర్‌ ఆడనున్నారు. గత మ్యాచ్‌ల్లో ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో దిగిన టీమిండియా... చెన్నై పిచ్‌ స్వభావంరీత్యా ఇద్దరు పేసర్లు, ఆల్‌రౌండర్‌ సహా ముగ్గురు స్పిన్నర్ల వ్యూహానికి మొగ్గు చూపుతున్నట్లుంది. దీంతో సిద్ధార్థ్‌ కౌల్, ఎడంచేతి వాటం స్పిన్నర్‌ షాబాజ్‌ నదీమ్‌కు అవకాశం లేనట్లైంది. చివర్లో నిర్ణయం మారితే... నదీమ్‌ అరంగేట్రం చేయొచ్చు. కెప్టెన్‌ రోహిత్‌ గత మ్యాచ్‌లోలానే చెలరేగాలని జట్టు ఆశిస్తోంది. ఓపెనర్‌ ధావన్‌ ఫామ్‌లోకి రావడం మరింత బలం కానుంది. కేఎల్‌ రాహుల్, దినేశ్‌ కార్తీక్, రిషభ్‌ పంత్‌లతో బ్యాటింగ్‌ దుర్బేధ్యంగా ఉంది. భువనేశ్వర్, ఖలీల్‌ అహ్మద్‌ పేస్‌ బాధ్యతలు చూసుకుంటారు. ఆల్‌రౌండర్‌ కృనాల్‌ పాండ్యాతో పాటు చహల్, సుందర్‌ స్పిన్‌ భారం పంచుకుంటారు.

 విండీస్‌... ఈ ఒక్కటైనా! 
ప్రధాన ఆటగాళ్లు దూరమై... ముందే డీలాపడిన వెస్టిండీస్‌ టి20 సిరీస్‌లో మరీ తేలిపోయింది. లక్నోలో జరిగిన రెండో మ్యాచ్‌లో ఆ జట్టు అత్యంత పేలవంగా ఆడింది. హెట్‌మైర్, బ్రేవో, పొలార్డ్‌ వంటి ప్రతిభావంతులైన బ్యాట్స్‌మెన్‌ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చడం లేదు. బౌలింగ్‌లో ఒషేన్‌ థామస్‌ పేస్‌ మినహా చెప్పుకొనేదేమీ లేదు. చెన్నైలోనైనా గెలిస్తే జట్టుకు కొంత ఉపశమనం దక్కుతుంది. ఈ మ్యాచ్‌కు వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ దినేశ్‌ రామ్‌దిన్‌ను తప్పించి రావ్‌మన్‌ పావెల్‌ను తీసుకోనుంది. నికొలస్‌ పూరన్‌ కీపింగ్‌ చేస్తాడు. 

సరైన వ్యవస్థ లేకే... 
విండీస్‌ క్రికెట్‌ దుస్థితిపై బ్రియాన్‌ లారా ఆవేదన 
సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుతం వెస్టిండీస్‌ క్రికెట్‌ దుస్థితికి కారణం తమ దేశంలో యువతరాన్ని తీర్చిదిద్దే సరైన వ్యవస్థ లేకపోవడమేనని దిగ్గజ క్రికెటర్, విండీస్‌ మాజీ కెప్టెన్‌ బ్రియాన్‌ లారా ఆవేదన వ్యక్తం చేశాడు. కృష్ణపట్నం పోర్టు గోల్డెన్‌ ఈగల్స్‌ గోల్ఫ్‌ చాంపియన్‌ షిప్‌ కోసం హైదరాబాద్‌కు విచ్చేసిన లారా తమ దేశ క్రికెట్‌కు సంబంధించిన పలు అంశాలపై మీడియాతో తన అభిప్రాయాలను పంచుకున్నాడు. విండీస్‌ క్రికెట్‌ బోర్డు శక్తిమంతంగా లేకపోవడం కూడా తమ స్థితికి కారణమన్నాడు.

క్రికెట్‌ భవిష్యత్‌కు ఆధారమైన యువతరాన్ని చేరదీయడంలో తమ బోర్డు విఫలమైందని విమర్శించాడు. మౌలిక వసతులు, స్టేడియాలు బాగున్నప్పటికీ యువ క్రికెటర్లను తీర్చిదిద్దే సరైన వ్యవస్థ లేకపోవడంతో క్రికెట్‌ అభివృద్ధి కుంటుపడిందని వివరించాడు. ‘భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా దేశాల తరహాలో దేశవాళీ క్రికెట్‌ అభివృద్ధి కోసం మా బోర్డు కృషి చేయడంలేదు. ఫలితంగా గత మూడు, నాలుగేళ్లుగా ప్రతిభ గల యువ క్రికెటర్లు వెలుగులోకి రాలేకపోతున్నారు. వారిని సానబెట్టే వ్యవస్థ ప్రస్తుతం మా దగ్గర లేదు’ అని పేర్కొన్నాడు.

భారత పర్యటనలో టెస్టుల్లో విండీస్‌ విఫలమైన తీరుపై లారా విచారం వ్యక్తం చేశాడు. ‘టెస్టుల్లో ప్రదర్శనే ఒక జట్టు స్థాయిని నిర్ణయిస్తుంది. కానీ భారత్‌పై తొలి రెండు టెస్టులను విండీస్‌ మూడు రోజుల్లోనే ముగించింది. ఇది ఆశించదగినది కాదు. మూడు రోజులకు మించి విండీస్‌ టెస్టు ఆడలేకపోతోంది. ఈ అంశం నాకు చాలా నిరాశ కలిగించింది’ అని వివరించాడు. యువతరాన్ని తీర్చిదిద్దితేనే విండీస్‌ క్రికెట్‌ మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని అభిప్రాయపడ్డాడు. వచ్చే ఏడాది తన బయోగ్రఫీని విడుదల చేస్తానని లారా ప్రకటించాడు. 

తుది జట్లు (అంచనా)
భారత్‌: రోహిత్‌ (కెప్టెన్‌), ధావన్, రాహుల్, మనీశ్‌ పాండే, దినేశ్‌ కార్తీక్, పంత్, కృనాల్, సుందర్, చహల్, భువనేశ్వర్, ఖలీల్‌. వెస్టిండీస్‌: షై హోప్, పూరన్, హెట్‌మైర్, డారెన్‌ బ్రేవో, పొలార్డ్, బ్రాత్‌వైట్‌ (కెప్టెన్‌), రావ్‌మన్‌ పావెల్, కీమో పాల్, అలెన్, పియర్, థామస్‌. 

పిచ్, వాతావరణ
చెపాక్‌ మైదానం స్పిన్‌కు అనుకూలిస్తుంది. రాత్రి వేళ మంచు ప్రభావం ఉంటుంది. ఇక్కడ ఇది రెండో టి20. ఆరేళ్ల క్రితం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ను న్యూజిలాండ్‌ ఒక్క పరుగు తేడాతో ఓడించింది.చెపాక్‌ మైదానం స్పిన్‌కు అనుకూలిస్తుంది. రాత్రి వేళ మంచు ప్రభావం ఉంటుంది. ఇక్కడ ఇది రెండో టి20. ఆరేళ్ల క్రితం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ను న్యూజిలాండ్‌ ఒక్క పరుగు తేడాతో ఓడించింది. 

రాత్రి గం.7 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో  ప్రత్యక్ష ప్రసారం 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top