‘వీరూ’ వీడ్కోలు | Sakshi
Sakshi News home page

‘వీరూ’ వీడ్కోలు

Published Tue, Oct 20 2015 3:35 AM

‘వీరూ’ వీడ్కోలు

* రిటైర్ కానున్న వీరేంద్ర సెహ్వాగ్
రెండున్నరేళ్ల క్రితం ఆఖరి టెస్టు
న్యూఢిల్లీ: ప్రపంచ క్రికెట్ చరిత్రలో విధ్వంసకర బ్యాట్స్‌మన్‌లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న వీరేంద్ర సెహ్వాగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. మంగళవారం 37 ఏళ్లు పూర్తిచేసుకోనున్న సెహ్వాగ్, దుబాయ్‌లో మాస్టర్స్ లీగ్ కు సంబంధించి మీడియా సమావేశంలో రిటైర్ కాను న్నట్లు చూచాయగా వెల్లడిం చాడు. దాదాపు రెండున్నరేళ్ల క్రితం 2013 మార్చిలో తన ఆఖరి టెస్టు ఆడిన సెహ్వాగ్, అదే ఏడాది జనవరిలో చివరిసారిగా వన్డేల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు.

ఆదివారం ముగిసిన హరియాణా, ఢిల్లీ రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో కూడా వీరూ బరిలోకి దిగాడు. టెస్టు క్రికెట్‌లో రెండు ‘ట్రిపుల్ సెంచరీలు’ చేసిన ఏకైక భారత ఆటగాడైన సెహ్వాగ్, వన్డేల్లో ‘డబుల్ సెంచరీ’ సాధించిన ఐదుగురు ఆటగాళ్లలో ఒకడు. 2007లో టి20, 2011లో వన్డే ప్రపంచకప్ గెలుచుకున్న భారత జట్టులో సభ్యుడైన సెహ్వాగ్ టెస్టు క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శనతో భారత్ చిరస్మరణీయ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. పేసర్ జహీర్ ఖాన్ రిటైర్మెంట్ ప్రకటించిన నాలుగు రోజులకే మరో భారత దిగ్గజం వీడ్కోలు పలకడం విశేషం.

Advertisement
Advertisement