ఇలాగైతే ఎన్ని పరుగులు చేసినా వేస్ట్‌!

Virat Kohli Fires on Team Poor Fielding - Sakshi

రెండో టీ-20లో చెత్త ఫీల్డింగ్‌పై కోహ్లి ఆవేదన

తిరువనంతపురం: వెస్టిండీస్‌తో తొలి టీ-20లో వీరోచితంగా పోరాడి అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న టీమిండియాకు రెండో టీ-20లో షాక్‌ తగిలిన సంగతి తెలిసిందే. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియంలోని జరిగిన రెండో టీ-20లో భారత్‌ విసిరిన 171 పరుగుల విజయలక్ష్యాన్ని విండీస్‌ జట్టు అలవోకగా ఛేదించింది. 1.3 మూడు ఓవర్లు మిగిలి ఉండగానే విజయాన్ని సాధించి.. భారత్‌తో వరుసగా ఏడు పరాజయాల అనంతరం విజయాన్ని చవిచూసింది. అంతేకాకుండా మూడు సిరీస్‌ను 1-1తో  సమం చేసి.. తదుపరి మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. 

ఈ మ్యాచ్‌లో టీమిండియా పరాజయానికి చెత్త ఫీల్డింగ్‌ ప్రధాన కారణం. విండీస్‌ ఓపెనర్లు సిమన్స్, లూయిస్‌ ఇచ్చిన క్యాచ్‌లను ఓకే ఓవర్‌లో నేలపాలు చేయడం టీమిండియాను గట్టిగా దెబ్బతీసింది. ఐదో ఓవర్‌లో వ్యక్తిగత స్కోరు 6 పరుగుల వద్ద విండీస్‌ ఓపెనర్‌ సిమన్స్ ఇచ్చిన క్యాచ్‌ను వాషింగ్టన్‌ సుందర్‌ వదిలేశాడు. అనంతరం 17 పరుగుల వద్ద ఎల్విన్‌ లూయిస్‌ ఇచ్చిన క్యాచ్‌ను రిషబ్‌ పంత్‌ జారవిడిచాడు. దీంతో లైఫ్‌ పొందిన సిమన్స్‌ అజేయంగా 67 పరుగులు చేయగా.. లెవిస్‌ 40 పరుగులు చేసి లక్ష్యఛేదనను అలవోకగా మార్చేశాడు.
చదవండి: వాహ్‌ క్యాచ్‌... వారెవ్వా కోహ్లి!

మ్యాచ్‌లో అద్భుతమైన క్యాచ్‌ పట్టుకొని.. శిమ్రన్‌ ఔట్‌ను చేసిన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి చెత్త ఫీల్డింగ్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. తమ ఓటమికి చెత్త ఫీల్డింగే కారణమని, ఫస్ట్‌ బ్యాటింగ్‌ చేయడం కాదని మ్యాచ్‌ అనంతరం అభిప్రాయపడ్డాడు. 2018 జనవరి నుంచి భారత్‌ ఇప్పటివరకు 16 మ్యాచ్‌ల్లో మొదట బ్యాటింగ్‌ చేయగా.. ఎనిమిది సార్లు ఓటమిపాలైం‍ది. అదే ఛేజింగ్‌లో 18 మ్యాచ్‌లు ఆడగా 14 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. అయితే, ఈ లెక్కలను తోసిపుచ్చిన కోహ్లి.. ఈ గణాంకాలు వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించబోవని అన్నారు. 16 ఓవర్ల వరకు తమ బ్యాటింగ్‌ బాగానే సాగిందని, కానీ చివరి నాలుగు ఓవర్లలో 30 పరుగులే రావడం కొంత ప్రతికూలతకు కారణమైందని, దీనిపై ఫోకస్‌ చేయాల్సిన అవసరముందన్నారు. శివం దూబే అద్భుతంగా ఆడటంతో భారత్‌ 170 పరుగులు చేసిందన్నారు. 

‘నిజాయితీగా చెప్పాలంటే విండీస్‌ బౌలర్లు కటర్లు, పేస్‌ బౌలింగ్‌లో మార్పుతో మాకు ఒరిగిందేమీ లేదు. కానీ, మేం ఇంత చెత్తగా బౌలింగ్‌ చేస్తే.. ఎన్ని పరుగులు చేసినా ప్రయోజనం ఉండదు. గడిచిన రెండు మ్యాచ్‌లోనూ మా ఫీల్డింగ్‌ బాలేదు. ఒక్క ఓవర్‌లో రెండు క్యాచ్‌లను జారవిడిచాం. ఒకే ఓవర్లు రెండు చాన్సులు వారికి వచ్చాయి. మేం మా ఫీల్డింగ్‌ను చాలా మెరుగుపరుచుకోవాల్సి ఉంది’ అని కోహ్లి అభిప్రాయపడ్డాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top