ఒక బెస్ట్‌ బౌలర్‌కు ఇచ్చే గౌరవం ఇదేనా?: కోహ్లి

Virat Kohli Backs Under Fire Australian Pacer Mitchell Starc - Sakshi

సిడ్నీ: ఇటీవల ముగిసిన టెస్టు సిరీస్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేక విమర్శరలు ఎదుర్కొంటున్న ఆసీస్‌ ప్రధాన పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌కు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మద్దతుగా నిలిచాడు. ఎంతోకాలంగా ఆసీస్‌ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న స్టార్క్‌.. ఏదొక సిరీస్‌లో ఆకట్టుకోలేకపోతే ఆ దేశ మాజీలు ఒక్కసారిగా విమర్శలు ఎక్కుపెట్టడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నాడు. కొన్ని సందర్భాల్లో ఎవరైనా గాడి తప్పడం సహజమేనని, అటువంటి తరుణంలో వారికి మద్దతుగా ఉండాలే తప్ప ఇలా విమర్శలు చేయడం ఏమిటని ప‍్రశ్నించాడు. ఒక బెస్ట్‌ బౌలర్‌కు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ కోహ్లి నిలదీశాడు.

‘చాలా ఏళ్లుగా స్టార్క్‌ మీ జట్టులో నంబర్‌ వన్‌ బౌలర్‌గా కొనసాగుతున్నాడు. ఇప్పుడు అదే బౌలర్‌పై వరుసగా విమర్శలు చేయడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. స్టార్క్‌ మీ అత్యుత్తమ బౌలర్‌ అనుకుంటే అతనికి కొంత స్వేచ్ఛ ఇవ్వండి. మళ్లీ గాడిలో పడటానికి అతనికి మద్దతుగా నిలవండి. అంతే కానీ విమర్శలు చేస్తే అతనిపై మరింత ఒత్తిడి పెరుగుతుంది.  అపార నైపుణ్యమున్న ఈ తరహా బౌలర్‌పై ఒత్తిడి పెంచి దూరం చేసుకోవద్దు. ఆస్ట్రేలియా సాధించిన ఎన్నో విజయాల్లో స్టార్క్‌ ప్రధాన పోషిస్తూ వస్తున్నాడు. అతని సేవల్ని కోల్పోవద్దు’ అని కోహ్లి పేర్కొన్నాడు.

భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో స్టార్క్‌ 13 వికెట్లు తీశాడు.  దాంతో ఆసీస్‌ దిగ్గజ ఆటగాళ్లు షేన్‌ వార్న్‌, మిచెల్‌ జాన్సన్‌ల నుంచి విమర్శలు ఎదుర్కొన్నాడు స్టార్క్‌. కాగా, భారత్‌తో త్వరలో ఆరంభం కానున్న వన్డే సిరీస్‌ నుంచి స్టార్క్‌కు విశ‍్రాంతినిచ్చారు. యాషెస్‌ సిరీస్‌ను దృష్టిలో పెట్టుకుని స్టార్క్‌ను భారత్‌తో జరిగే వన్డే సిరీస్‌కు ఎంపిక చేయలేదు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top