Starc
-
DC Vs RR: ఢిల్లీ ‘సూపర్’ విక్టరీ
న్యూఢిల్లీ: ఉత్కంఠ ఊపేసిన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఆధిక్యం చేతులు మారుతూ చివరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్... ఆఖరికి ‘సూపర్ ఓవర్’కు వెళ్లగా... అందులోనూ ఆకట్టుకున్న క్యాపిటల్స్ ఐపీఎల్ 18వ సీజన్లో ఐదో విజయం ఖాతాలో వేసుకుంది. సొంతగడ్డపై తొలి విజయం సాధించిన ఢిల్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని అందుకుంది. బుధవారం జరిగిన ఈ పోరులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ పొరెల్ (37 బంతుల్లో 49; 5 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా... కేఎల్ రాహుల్ (38; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), స్టబ్స్ (18 బంతుల్లో 34 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), అక్షర్ పటేల్ (14 బంతుల్లో 34; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. అనంతరం రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు సరిగ్గా 188 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (37 బంతుల్లో 51; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), నితీశ్ రాణా (28 బంతుల్లో 51; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకాలు సాధించగా... సామ్సన్ (19 బంతుల్లో 31; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు. ఆఖర్లో తీవ్ర ఒత్తిడిలో ధ్రువ్ జురెల్ (17 బంతుల్లో 26; 2 సిక్స్‌లు), హెట్‌మైర్ (15 నాటౌట్; 1 ఫోర్) మెరుగైన ప్రదర్శన కనబర్చారు. స్కోర్లు సమం కావడంతో విజేతను నిర్ణయించేందుకు ‘సూపర్ ఓవర్’ ఆడించారు. స్కోరు వివరాలు: ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: మెక్‌గుర్క్ (సి) జైస్వాల్ (బి) ఆర్చర్ 9; పొరెల్ (సి) పరాగ్ (బి) హసరంగ 49; కరుణ్ (రనౌట్) 0; రాహుల్ (సి) హెట్‌మైర్ (బి) ఆర్చర్ 38; స్టబ్స్ (నాటౌట్) 34; అక్షర్ (సి) జురెల్ (బి) తీక్షణ 34; అశుతోష్ (నాటౌట్) 15; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 188. వికెట్ల పతనం: 1–34, 2–34, 3–97, 4–105, 5–146. బౌలింగ్: ఆర్చర్ 4–0–32–2; తుషార్ 3–0–38–0; సందీప్ 4–0–33–0; తీక్షణ 4–0–40–1; హసరంగ 4–0–38–1; పరాగ్ 1–0–6–0. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) స్టార్క్ (బి) కుల్దీప్ 51; సామ్సన్ (రిటైర్డ్ హర్ట్) 31; పరాగ్ (బి) అక్షర్ 8; నితీశ్ రాణా (ఎల్బీ) స్టార్క్ 51; జురేల్ (రనౌట్) 26; హెట్‌మైర్ (నాటౌట్) 15; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 188. వికెట్ల పతనం: 1–76, 2–112, 3–161, 4–188. బౌలింగ్: స్టార్క్ 4–0–36–1; ముకేశ్ 3–0–31–0; మోహిత్ 4–0– 38–0; విప్రాజ్ 1–0–13–0; అక్షర్ 3–0–23–1; కుల్దీప్ 4–0–33–1; స్టబ్స్ 1–0–12–0. సూపర్ ఓవర్ సాగిందిలా...సూపర్ ఓవర్లో ఢిల్లీ తరఫున బౌలింగ్ చేసిన స్టార్క్... తన యార్కర్లతో ప్రత్యర్థిని కట్టిపడేశాడు. తొలి బంతికి పరుగులేమీ రాకపోగా... రెండో బంతికి హెట్‌మైర్ ఫోర్ కొట్టాడు. మూడో బంతికి సింగిల్ రాగా... నాలుగో బంతికి పరాగ్ ఫోర్ కొట్టాడు. ఆ బంతి నోబాల్ అని తేలగా... మరుసటి బంతికి పరాగ్ రనౌటయ్యాడు. ఐదో బంతికి రెండో పరుగు తీసే క్రమంలో జైస్వాల్ రనౌటవడంతో రాయల్స్ ఇన్నింగ్స్ ముగిసింది. ఛేదనలో తొలి బంతికి రెండు పరుగులు తీసిన రాహుల్... రెండో బంతిని బౌండరీకి తరలించాడు. మూడో బంతికి సింగిల్ రాగా... నాలుగో బంతికి స్టబ్స్ సిక్స్ బాది మ్యాచ్‌ను ముగించాడు. ఐపీఎల్లో నేడుముంబై X హైదరాబాద్‌వేదిక: ముంబైరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
IPL 2025: ‘సన్’కు స్టార్క్ స్ట్రోక్
సన్‌రైజర్స్ ‘విధ్వంసక’ బ్యాటింగ్ బృందం మరోసారి నిరాశపర్చింది. సొంతగడ్డపై ఓటమి తర్వాత వైజాగ్ చేరిన రైజర్స్ ఆట మాత్రం మారలేదు. బ్యాటింగ్ వైఫల్యంతో ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో జట్టు సాధారణ స్కోరుకే పరిమితమైంది. అనికేత్ వర్మ సిక్సర్లతో జోరు ప్రదర్శించినా అది సరిపోలేదు. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ అలవోకగా విజయతీరం చేరింది. తొలి వికెట్‌కు 55 బంతుల్లోనే 81 పరుగులు వచ్చాక లక్ష్యం సునాయాసమైపోయింది. ఫలితంగా ఢిల్లీ ఖాతాలో వరుసగా రెండో విజయం చేరగా, హైదరాబాద్ వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. సాక్షి, విశాఖపట్నం: ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండో పరాజయాన్ని ఎదుర్కొంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ 18.4 ఓవర్లలో 163 పరుగులకే ఆలౌటైంది. అనికేత్ వర్మ (41 బంతుల్లో 74; 5 ఫోర్లు, 6 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా... హెన్రిచ్ క్లాసెన్ (19 బంతుల్లో 32; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మిచెల్ స్టార్క్ (5/35) ఐదు వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీయగా, కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఢిల్లీ 16 ఓవర్లలో 3 వికెట్లకు 166 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ఫాఫ్ డుప్లెసిస్ (27 బంతుల్లో 50; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ చేయగా... జేక్ ఫ్రేజర్ (32 బంతుల్లో 38; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), అభిషేక్ పొరేల్ (18 బంతుల్లో 34 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఐపీఎల్లో తొలి మ్యాచ్ ఆడిన సన్‌రైజర్స్ లెగ్‌స్పిన్నర్ జీషాన్ అన్సారీకే మూడు వికెట్లు దక్కాయి. కీలక భాగస్వామ్యం... స్టార్క్ వేసిన తొలి ఓవర్లో ట్రవిస్ హెడ్ (12 బంతుల్లో 22; 4 ఫోర్లు) రెండు ఫోర్లు కొట్టి జోరుగా మొదలుపెట్టినా, దురదృష్టవశాత్తూ అదే ఓవర్లో అభిషేక్ శర్మ (1) రనౌటయ్యాడు. హెడ్ బంతిని ఆడి సింగిల్ కోసం ప్రయత్నించగా నెమ్మదిగా స్పందించిన అభిషేక్ క్రీజ్‌కు చేరుకునేలోగా నిగమ్ విసిరిన త్రో వికెట్లను పడగొట్టింది. ఇషాన్ కిషన్ (2) ఈ మ్యాచ్‌లోనూ విఫలం కాగా, ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య గ్రౌండ్లోకి వచ్చిన ‘లోకల్ బాయ్’ నితీశ్ కుమార్ రెడ్డి (0) తీవ్రంగా నిరాశపర్చాడు. స్టార్క్ బౌలింగ్‌లో తాను ఎదుర్కొన్న రెండో బంతినే భారీ షాట్ ఆడబోయి గాల్లోకి లేపగా అక్షర్ పటేల్ చేతికి చిక్కాడు. స్టార్క్ తర్వాతి హెడ్ కూడా అవుట్ కావడంతో రైజర్స్ స్కోరు 4.1 ఓవర్లలో 37/4 వద్ద నిలిచింది. ఈ దశలో అనికేత్, క్లాసెన్ కలిసి జట్టును ఆదుకున్నారు. అప్పటికీ నాలుగు వికెట్లు కోల్పోయినా... వీరిద్దరు దూకుడు మాత్రం తగ్గించకుండా ఓవర్‌కు 11 రన్‌రేట్‌తో పరుగులు రాబట్టారు. 6 పరుగుల వద్ద పొరేల్ క్యాచ్ వదిలేయడంతో అనికేత్‌కు లైఫ్ లభించింది. స్టార్క్ ఓవర్లో క్లాసెన్ వరుసగా 6, 4 కొట్టగా, నిగమ్ ఓవర్లో అనికేత్ వరుసగా 4, 6 బాదాడు. ఆ తర్వాత అక్షర్ ఓవర్లో అనికేత్ వరుసగా రెండు భారీ సిక్స్‌లు బాదాడు. ఈ జోడీ 42 బంతుల్లో 77 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పగా, నిగమ్ అద్భుత క్యాచ్‌తో క్లాసెన్ వెనుదిరిగాడు. 34 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అనికేత్ మరింత చెలరేగిపోతూ అక్షర్ ఓవర్లో వరుసగా 4, 6, 6 బాదడం విశేషం. అయితే ఇతర బ్యాటర్లంతా విఫలం కావడంతో మరో 8 బంతులు మిగిలి ఉండగానే జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. ఆరంభం నుంచే దూకుడు... ఛేదనలో ఢిల్లీకి ఏ దశలోనూ ఇబ్బంది ఎదురుకాలేదు. ఓపెనర్లు జేక్ ఫ్రేజర్, డుప్లెసిస్ ధాటిగా ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టారు. దాంతో పవర్‌ప్లే ముగిసేసరికి ఢిల్లీ 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 52 పరుగులు చేసింది. ఈ క్రమంలో జేక్ ఫ్రేజర్ తనకు వచ్చిన రెండు ‘లైఫ్’లను పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. 26 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న డుప్లెసిస్... 40 ఏళ్లు దాటిన తర్వాత ఐపీఎల్లో హాఫ్ సెంచరీ అరుదైన ఆటగాళ్లు గిల్‌క్రిస్ట్, గేల్, ద్రవిడ్ సరసన నిలిచాడు. అన్సారీ వేసిన 10వ ఓవర్ ఆసక్తికరంగా సాగింది. తొలి బంతికి అతను డుప్లెసిస్‌ను అవుట్ చేయగా, రెండో బంతికి పొరేల్ సింగిల్ తీశాడు. తర్వాతి మూడు బంతుల్లో వరుసగా 4, 4, 6 బాదిన జేక్ ఫ్రేజర్ చివరి బంతికి అవుటయ్యాడు. షమీ వేసిన తర్వాతి ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ కొట్టిన కేఎల్ రాహుల్ (5 బంతుల్లో 15; 2 ఫోర్లు, 1 సిక్స్)ను కూడా అన్సారీనే వెనక్కి పంపించాడు. 52 బంతుల్లో 49 పరుగులు చేయాల్సిన ఈ స్థితిలో పొరేల్, స్టబ్స్ (14 బంతుల్లో 21 నాటౌట్; 3 ఫోర్లు) ఇక ఆలస్యం చేయలేదు. ఫటాఫట్‌గా 28 బంతుల్లోనే అభేద్యంగా 51 పరుగులు జత చేసి మ్యాచ్‌ను ముగించారు. ఆకట్టుకున్న అన్సారీ సన్‌రైజర్స్ జట్టు తరఫున ఈ మ్యాచ్‌లో 25 ఏళ్ల లెగ్‌స్పిన్నర్ జీషాన్ అన్సారీ ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నో స్వస్థలం. 5 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో బరిలోకి దిగిన అతను ఐపీఎల్‌కు ముందు యూపీ తరఫున ఒకే ఒక టి20 మ్యాచ్ ఆడాడు. 2016 అండర్–19 వరల్డ్ కప్‌లో రన్నరప్‌గా నిలిచిన భారత జట్టులో రిషభ్ పంత్, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, సర్ఫరాజ్‌లతో పాటు అన్సారీ కూడా సభ్యుడిగా ఉన్నాడు. గత ఏడాది యూపీ టి20 లీగ్‌లో మీరట్ మావెరిక్స్ తరఫున ఆడి అత్యధిక వికెట్లు (24) తీయడంతో అందరి దృష్టిలో పడ్డాడు. ‘గూగ్లీ’ అతని ప్రధాన బలం. వేలంలో సన్‌రైజర్స్ జట్టు విప్రాజ్ నిగమ్‌తో పాటు అన్సారీ కోసం పోటీ పడింది. నిగమ్‌ను ఢిల్లీ సొంతం చేసుకోగానే అన్సారీని రైజర్స్ ఎంచుకుంది.స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ శర్మ (రనౌట్) 1; హెడ్ (సి) కేఎల్ రాహుల్ (బి) స్టార్క్ 22; ఇషాన్ కిషన్ (సి) స్టబ్స్ (బి) స్టార్క్ 2; నితీశ్ కుమార్ రెడ్డి (సి) అక్షర్ పటేల్ (బి) స్టార్క్ 0; అనికేత్ (సి) జేక్ ఫ్రేజర్ (బి) కుల్దీప్ 74; క్లాసెన్ (సి) నిగమ్ (బి) మోహిత్ 32; మనోహర్ (సి) డుప్లెసిస్ (బి) కుల్దీప్ 4; కమిన్స్ (సి) జేక్ ఫ్రేజర్ (బి) కుల్దీప్ 2; ముల్డర్ (సి) డుప్లెసిస్ (బి) స్టార్క్ 9; హర్షల్ పటేల్ (సి) అక్షర్ పటేల్ (బి) స్టార్క్ 5; షమీ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (18.4 ఓవర్లలో ఆలౌట్) 163. వికెట్ల పతనం: 1–11, 2–20, 3–25, 4–37, 5–114, 6–119, 7–123, 8–148, 9–162, 10–163. బౌలింగ్: మిచెల్ స్టార్క్ 3.4–0–35–5, ముకేశ్ కుమార్ 2–0–17–0, అక్షర్ పటేల్ 4–0–43–0, విప్రాజ్ నిగమ్ 2–0–21–0, మోహిత్ శర్మ 3–0–25–1, కుల్దీప్ యాదవ్ 4–0–22–3. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: జేక్ ఫ్రేజర్ (సి అండ్ బి) అన్సారి 38; డుప్లెసిస్ (సి) ముల్డర్ (బి) అన్సారి 50; పొరేల్ (నాటౌట్) 34; కేఎల్ రాహుల్ (బి) అన్సారి 15; స్టబ్స్ (నాటౌట్) 21; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (16 ఓవర్లలో 3 వికెట్లకు) 166. వికెట్ల పతనం: 1–81, 2–96, 3–115. బౌలింగ్: మొహమ్మద్ షమీ 3–0–31–0, అభిషేక్ శర్మ 3–0–27–0, ప్యాట్ కమిన్స్ 2–0–27–0, హర్షల్ పటేల్ 3–0–17–0, జీషాన్ అన్సారి 4–0–42–3, వియాన్ ముల్డర్ 1–0–16–0. -
ICC Rankings: టాప్‌లో లబూషేన్.. దిగజారిన కోహ్లి ర్యాంక్
దుబాయ్: ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఆసీస్ బ్యాటర్ల హవా కొనసాగింది. ఏకంగా నలుగురు ఆటగాళ్లు టాప్-10లో చోటు దక్కించుకున్నారు. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో సత్తా చాటిన ఆసీస్ ఆటగాడు లబూషేన్(103, 51) 912 పాయింట్లతో.. ఇంగ్లండ్ సారధి జో రూట్(897)ను వెనక్కు నెట్టి అగ్రస్థానానికి చేరుకోగా, స్టీవ్ స్మిత్(884) మూడో స్థానంలో, డేవిడ్ వార్నర్(775) ఆరు, ట్రవిస్ హెడ్(728) పదో స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ 5వ ర్యాంక్‌ను నిలబెట్టుకోగా, టెస్ట్ సారధి విరాట్ కోహ్లి ఓ స్థానాన్ని కోల్పోయి 7వ ప్లేస్‌లో ఉన్నాడు. 🔝 Labuschagne dethrones Root 💪 Starc makes significant gains Australia stars shine in the latest @MRFWorldwide ICC Men’s Test Player Rankings. 👉 https://t.co/DNEarZ8zhm pic.twitter.com/W3Aoiy3ARP — ICC (@ICC) December 22, 2021 ఇక బౌలింగ్ విషయానికొస్తే.. ఈ విభాగంలోనూ ఆసీస్ ప్లేయర్ల హవానే నడించింది. యాషెస్ రెండో టెస్ట్‌లో 6 వికెట్లు సాధించి ఇంగ్లండ్ పతనాన్ని శాసించిన మిచెల్ స్టార్క్.. దాదాపు ఏడాది తర్వాత తిరిగి టాప్-10లో చోటు దక్కించుకోగా.. ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌కు దూరమైనప్పటికీ ఆసీస్ టెస్ట్ కెప్టెన్ పాట్ కమిన్స్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగలిగాడు. టీమిండియా సీనియర్ స్పిన్నర్ ఆశ్విన్ రెండో స్థానాన్ని కాపాడుకున్నాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో ఇంగ్లండ్ సారధి రూట్ కెరీర్(111 టెస్ట్‌ల తర్వాత)లో తొలిసారి టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. 🔹 Babar Azam surges to the 🔝 🔹 Mohammad Rizwan into the top three 🔥 Significant gains for Pakistan batters in the latest @MRFWorldwide ICC Men’s T20I Player Rankings 👉 https://t.co/hBFKXGWUp4 pic.twitter.com/qqUfYsFGkA — ICC (@ICC) December 22, 2021 మరోవైపు టీ20 ర్యాంకింగ్స్‌లో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్, ఇంగ్లండ్ ఆటగాడు డేవిడ్ మలాన్‌లు సంయుక్తంగా అగ్రపీఠాన్ని అధిరోహించగా.. పాక్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ 798 పాయింట్లతో మూడో ప్లేస్‌లో నిలిచాడు. ఈ జాబితాలో టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్ 729 పాయింట్లతో ఐదో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. చదవండి: అభిమానులకు ‘గుడ్‌న్యూస్’... స్టేడియంలోకి అనుమతి.. అయితే! -
శాసించే స్థితిలో ఆస్ట్రేలియా
పెర్త్: స్వదేశంలో ఏడో డే నైట్ టెస్టులో విజయం దిశగా ఆస్ట్రేలియా జట్టు సాగుతోంది. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో భాగంగా ఇక్కడ డే నైట్‌గా జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా శాసించే స్థితికి చేరుకుంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ఓవరాల్‌గా తమ ఆధిక్యాన్ని 417 పరుగులకు పెంచుకుంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 109/5తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్... ఆసీస్ బౌలర్ల విజృంభణకు 166 పరుగులకే కుప్పకూలింది. రాస్ టేలర్ (134 బంతుల్లో 80; 9 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 52 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టగా... స్పిన్నర్ లయన్‌కు రెండు వికెట్లు లభించాయి. 250 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించిన ఆస్ట్రేలియా ప్రత్యర్థిని ఫాలోఆన్ ఆడించకుండా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 57 ఓవర్లలో 6 వికెట్లకు 167 పరుగులు చేసింది. బర్న్స్ (123 బంతుల్లో 53; 6 ఫోర్లు), లబ్‌షేన్ (81 బంతుల్లో 50; 3 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. వేడ్ (8 బ్యాటింగ్), కమిన్స్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. కివీస్ బౌలర్ టిమ్ సౌతీ నాలుగు వికెట్లు తీశాడు. -
ఒక బెస్ట్ బౌలర్‌కు ఇచ్చే గౌరవం ఇదేనా?: కోహ్లి
సిడ్నీ: ఇటీవల ముగిసిన టెస్టు సిరీస్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేక విమర్శరలు ఎదుర్కొంటున్న ఆసీస్ ప్రధాన పేసర్ మిచెల్ స్టార్క్‌కు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మద్దతుగా నిలిచాడు. ఎంతోకాలంగా ఆసీస్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న స్టార్క్.. ఏదొక సిరీస్‌లో ఆకట్టుకోలేకపోతే ఆ దేశ మాజీలు ఒక్కసారిగా విమర్శలు ఎక్కుపెట్టడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నాడు. కొన్ని సందర్భాల్లో ఎవరైనా గాడి తప్పడం సహజమేనని, అటువంటి తరుణంలో వారికి మద్దతుగా ఉండాలే తప్ప ఇలా విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నించాడు. ఒక బెస్ట్ బౌలర్‌కు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ కోహ్లి నిలదీశాడు. ‘చాలా ఏళ్లుగా స్టార్క్ మీ జట్టులో నంబర్ వన్ బౌలర్‌గా కొనసాగుతున్నాడు. ఇప్పుడు అదే బౌలర్‌పై వరుసగా విమర్శలు చేయడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. స్టార్క్ మీ అత్యుత్తమ బౌలర్ అనుకుంటే అతనికి కొంత స్వేచ్ఛ ఇవ్వండి. మళ్లీ గాడిలో పడటానికి అతనికి మద్దతుగా నిలవండి. అంతే కానీ విమర్శలు చేస్తే అతనిపై మరింత ఒత్తిడి పెరుగుతుంది. అపార నైపుణ్యమున్న ఈ తరహా బౌలర్‌పై ఒత్తిడి పెంచి దూరం చేసుకోవద్దు. ఆస్ట్రేలియా సాధించిన ఎన్నో విజయాల్లో స్టార్క్ ప్రధాన పోషిస్తూ వస్తున్నాడు. అతని సేవల్ని కోల్పోవద్దు’ అని కోహ్లి పేర్కొన్నాడు. భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో స్టార్క్ 13 వికెట్లు తీశాడు. దాంతో ఆసీస్ దిగ్గజ ఆటగాళ్లు షేన్ వార్న్, మిచెల్ జాన్సన్‌ల నుంచి విమర్శలు ఎదుర్కొన్నాడు స్టార్క్. కాగా, భారత్‌తో త్వరలో ఆరంభం కానున్న వన్డే సిరీస్ నుంచి స్టార్క్‌కు విశ్రాంతినిచ్చారు. యాషెస్ సిరీస్‌ను దృష్టిలో పెట్టుకుని స్టార్క్‌ను భారత్‌తో జరిగే వన్డే సిరీస్‌కు ఎంపిక చేయలేదు. -
లంకను ఆదుకున్న 2 'సెంచరీ' భాగస్వామ్యాలు
ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో శ్రీలంక 48.5ఓవర్లలో 288 పరుగుల వద్ద ఆలౌటైంది. మూడొందల పరుగులు అలవోకగా చేసేలా కనిపించిన లంక, ఆసీస్ పేసర్లు చెలరేగడంతో తన చివరి 5 వికెట్లను 17 పరుగుల వ్యవధిలో కోల్పోవడంతో సాధారణ స్కోరుకు పరిమితమైంది. ఆరంభంలో కాస్త తడబడిన లంక కుశాల్ మెండిస్ హాఫ్ సెంచరీ(69 బంతుల్లో 69 పరుగులు: 9 ఫోర్లు), చండిమల్(67 బంతుల్లో 48 పరుగులు: 2 ఫోర్లు, 1 సిక్స్) మూడో వికెట్ కు సెంచరీ(125 పరుగుల) భాగస్వామ్యంతో కోలుకుంది. వీరిద్దరిని ఆసీస్ బౌలర్ జంపా స్వల్ప వ్యవధిలో ఔట్ చేయడం ఫలితంగా 158 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి లంకకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. అయితే ఆరో వికెట్ కు కుశాల్ పెరీరా(53 బంతుల్లో 54 పరుగులు: 5 ఫోర్లు, 1 సిక్స్), లంక కెప్టెన్ ఎంజెలో మాథ్యూస్(60 బంతుల్లో 57 పరుగులు: 1 ఫోర్, 1 సిక్స్) రాణించి సెంచరీ భాగస్వామ్యాన్ని (103పరుగులు) జతచేశారు. చివర్లో ఆసీస్ పేసర్ జేమ్స్ ఫాల్కనర్ హ్యాట్రిక్ వికెట్లు తీయడం, ఒకే ఓవర్లో స్టార్క్ రెండు వికెట్లు తీయడంతో 300 స్కోరు దాటేలా కనిపించిన లంక 288 పరుగులకే పరిమితమైంది. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, జంపా, ఫాల్కనర్ తలో మూడు వికెట్లు పడగొట్టగా, లియాన్ ఒక్క వికెట్ తీశాడు. -
స్టార్క్‌పై కెప్టెన్ స్మిత్ సీరియస్
ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ప్రవర్తనపై ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. న్యూజీలాండ్‌తో మ్యాచ్ సందర్భంగా స్టార్క్ ప్రవర్తన తనను తీవ్ర నిరాశకు గురిచేసిందని అన్నాడు. గబ్బాలో జరిగిన టెస్ట్ మ్యాచ్ చివరిరోజున స్టార్క్ తన సహనాన్ని కోల్పోయి న్యూజీలాండ్ బ్యాట్స్‌మెన్ మార్క్ క్రేగ్‌కు సమీపంగా బంతిని విసిరాడు. 84 వ ఓవర్లో స్టార్క్ బౌలింగ్‌లో క్రేగ్ వరుసగా రెండు ఫోర్లు బాదడంతో సహనాన్ని కోల్పోయిన స్టార్క్ తరువాత తనవైపు వచ్చిన బంతిని పట్టుకొని బలంగా క్రేగ్ వైపు విసిరాడు. స్టార్క్ ఇలా ప్రవర్తిస్తాడని ఊహించలేదన్న స్మిత్ తనకు కలిగిన అసహనాన్ని మరో విధంగా ఆట ద్వారా చూపాలి తప్ప ఇలా బంతిని బ్యాట్స్‌మెన్ పైకి విసరడం కరెక్ట్ కాదన్నారు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా న్యూజీలాండ్‌పై విజయం సాధించింది. తరువాత మ్యాచ్‌లలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తగా ఉండాలని సహచర ఆటగాన్ని స్మిత్ హెచ్చరించాడు. -
తొలి టెస్టులో ఆసీస్ గెలుపు
9 వికెట్లతో విండీస్ చిత్తు స్టార్క్‌కు 4 వికెట్లు రోసీయూ : ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన ఆస్ట్రేలియా... వెస్టిండీస్‌తో మూడు రోజుల్లోనే ముగిసిన తొలి టెస్టులో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కరీబియన్ జట్టు నిర్దేశించిన 47 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మూడోరోజు ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 5 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. వార్నర్ (28) అవుటైనా... మార్ష్ (13 నాటౌట్), స్మిత్ (5 నాటౌట్) జట్టుకు విజయాన్ని అందించారు. టేలర్‌కు ఒక వికెట్ దక్కింది. అంతకుముందు 25/2 ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం మూడో రోజు ఆట కొనసాగించిన విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 86 ఓవర్లలో 216 పరుగులకు ఆలౌటైంది. మార్లన్ శామ్యూల్స్ (184 బంతుల్లో 74; 7 ఫోర్లు, 1 సిక్స్), డోవ్రిచ్ (185 బంతుల్లో 70; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించినా మిగతా బ్యాట్స్‌మెన్ నిరాశపర్చారు. ఓ దశలో 37 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన విండీస్‌ను ఈ ఇద్దరు నాలుగో వికెట్‌కు 144 పరుగులు జోడించి ఆదుకున్నారు. అయితే ఆసీస్ బౌలర్ల ధాటికి విండీస్ చివరి 7 వికెట్లు 35 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. స్టార్క్ 4, జాన్సన్, హాజెల్‌వుడ్, లియోన్ తలా రెండు వికెట్లు తీశారు. వోజెస్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. సిరీస్‌లో ఆసీస్ 1-0 ఆధిక్యం సాధించింది. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు కింగ్‌స్టన్‌లో ఈనెల 11 నుంచి జరుగుతుంది.