‘గుర్తుపెట్టుకోండి.. అతడే మ్యాచ్‌ డిసైడర్‌’ | Vikram Rathour Said Pant Could Turn Out A Match Winner For India | Sakshi
Sakshi News home page

‘అతడే టీమిండియా మ్యాచ్‌ విన్నర్‌’

Dec 14 2019 6:08 PM | Updated on Dec 14 2019 6:08 PM

Vikram Rathour Said Pant Could Turn Out A Match Winner For India - Sakshi

చివరి 15 ఇన్నింగ్స్‌ల్లో ఒకేఒక అర్దసెంచరీ.. ఎనిమిది మ్యాచ్‌ల్లో సింగిల్‌ డిజిట్‌ స్కోర్‌.. కీలక సమయంలో చేతులెత్తేయడం

చెన్నై: ‘చివరి 15 ఇన్నింగ్స్‌ల్లో ఒక అర్దసెంచరీ.. ఎనిమిది మ్యాచ్‌ల్లో సింగిల్‌ డిజిట్‌ స్కోర్‌’  ఇది టీమిండియా యువ సంచలనం రిషభ్‌ పంత్‌ బ్యాటింగ్‌ పరిస్థితి. తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన మూడు టీ20ల్లో వరుసగా 18, 33 నాటౌట్‌, 0 పరుగులతో తీవ్రంగా నిరాశపరిచాడు. దీంతో పంత్‌పై అటు క్రికెట్‌ అభిమానులతో పాటు, క్రీడా పండితులు దుమ్మెత్తిపోస్తున్నారు. అంతేకాకుండా పంత్‌ను తప్పించి కేరళ క్రికెటర్‌ సంజూ శాంసన్‌ను తీసుకోవాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే ఈ తరుణంలో రిషభ్‌ పంత్‌పై టీమిండియా బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాథోడ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
 

‘గత కొద్ది నెలలుగా అతడి బ్యాటింగ్‌, వికెట్‌ కీపింగ్‌ తీరును టీమ్‌ మేనేజ్‌మెంట్‌ నిశితంగా పరిశీలిస్తోంది. అతడిలో అపారమైన ప్రతిభ దాగుంది. అతడు టీమిండియాలో లేక ఏ జట్టులో ఉన్నా ఎక్స్‌ ఫ్యాక్టర్‌ పాత్ర పోషిస్తాడనే నమ్మకం మా అందరిలో ఉంది. అందుకే అతడు ఫామ్‌లో లేక తంటాలు పడుతుంటే మేము(టీమ్‌ మేనేజ్‌మెంట్‌) అండగా నిలవాలని అనుకున్నాం. తన వైఫల్యంపై పంత్‌ కూడా నిరాశతోనే ఉన్నాడు. అందుకే నెట్స్‌లో కఠోర సాధన చేస్తున్నాడు. ఒక్కసారి అతడు ఫామ్‌ అందుకుంటే టీమిండియా మ్యాచ్‌ విన్నర్‌ లేక డిసైడర్‌ పంత్‌ అవడం ఖాయం.  

ఇక టీమిండియా మిడిలార్డర్‌ సమస్య పూర్తిగా తీరిందని చెప్పలేను. టీ20 ప్రపంచకప్‌కు ఎక్కువ సమయం లేనందున ప్రయోగాలకు వెళ్లకుండా ఉండటమే బెటర్‌. అయితే శ్రేయస్‌ అయ్యర్‌, శివమ్‌ దూబేలతో మిడిలార్డర్‌ బలంగా ఉందనే విశ్వాసం ఉంది’అంటూ బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాథోడ్‌ పేర్కొన్నాడు. ఇక విండీస్‌పై టీ20 సిరీస్‌ నెగ్గిన టీమిండియా ఆదే ఉత్సాహంలో మూడు వన్డేల సిరీస్‌కు సమయాత్తమవుతోంది. ఆదివారం చెన్నై వేదికగా ఇరు జట్ల మధ్య తొలి వన్డే జరగనుంది.  

చదవండి:
బాలీవుడ్‌ భామతో రిషభ్‌ డేటింగ్‌!
ధోని పేరు జపించడం మానేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement