మూడో టెస్టుకు ఇంగ్లండ్‌ జట్టు ఇదే!

Stokes Return To England Team For 3rd Test Against India - Sakshi

సిరీస్‌పై కన్నేసిన ఆతిథ్య జట్టు

మూడో టెస్టు గెలిచి సిరీస్‌ ఆశలు నిలుపుకోవాలని కోహ్లి సేన ఆరాటం

నాటింగ్‌హామ్‌: టీమిండియాపై వరుస రెండు టెస్టు విజయాలతో ఊపుమీదున్న ఆతిథ్య ఇంగ్లండ్‌ జట్టు మూడో టెస్టుకు సిద్ధమైంది. ఇప్పటికే ఐదు టెస్టుల సిరీస్‌లో 2-0తో ఇంగ్లండ్‌ ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. ట్రెంట్‌బ్రిడ్జ్‌ మైదానంలో జరుగనున్న మూడో టెస్టులో గెలిచి సిరీస్‌ కైవసం చేసుకోవాలని ఇంగ్లండ్‌ వ్యూహాలు రచిస్తోంది. ఇదివరకు జరిగిన రెండు టెస్టుల మాదిరిగానే ఇంగ్లండ్‌ తన తుదిజట్టును మ్యాచ్‌కు ఒకరోజు ముందే ప్రకటించింది. కోర్టులో కేసు సందర్భంగా రెండో టెస్టుకు దూరమైన ఇంగ్లండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ తిరిగి తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. తొలి టెస్టు హీరో స్యామ్‌ కుర్రాన్‌ను జట్టు నుంచి తప్పించి స్టోక్స్‌కు అవకాశం కల్పించారు. రెండో టెస్టులో స్టోక్స్‌ స్థానంలో వచ్చి వీరోచిత ఇన్నింగ్స్‌ ఆడిన క్రిస్‌ వోక్స్‌పై ఇంగ్లండ్‌ సారథి జోయ్‌ రూట్స్‌ మరోసారి నమ్మకం ఉంచాడు.

స్టోక్స్‌లో పునరుత్తేజం
‘బ్రిస్టల్‌ పబ్‌ ఉదంతం’ నుంచి బయటపడిన స్టోక్స్‌కు మరింత ఉత్తేజాన్ని ఇచ్చే అంశం తుది జట్టులో చోటు దక్కడం.  ‘స్టోక్స్‌లో అపారమైన ఆట దాగుంది.. పబ్‌ గొడవ నుంచి త్వరగా బయటపడి ఆటపై దృష్టి పెట్టాలి. టీమిండియాతో జరగబోయే మిగిలిన టెస్టుల్లో అతని నుంచి విధ్వంసకర ఆటను కోరుకుంటున్నాను. కుర్రాన్‌ను జట్టు నుంచి తప్పించటం బాధ కలిగించే అంశమే.. అతను ఆడిన రెండో టెస్టులోనే అద్భుత ఆటతీరు కనబర్చాడు. అతడికి మంచి భవిష్యత్‌ ఉంటుంది. నాటింగ్‌హామ్‌ టెస్టులో గెలవడానికి గల వ్యూహాలను రచించాం.. అన్నీ అనుకున్నట్లు జరిగితే సిరీస్‌ ఇక్కడే గెలుస్తాం’ అంటూ బ్రిటీష్‌ సారథి జోయ్‌ రూట్‌ పేర్కొన్నాడు. 

ఇంగ్లండ్‌ తుదిజట్టు: 
జోయ్‌ రూట్‌(కెప్టెన్‌), అలిస్టర్‌ కుక్‌, కీటన్ జెన్నింగ్స్‌, పోప్, జానీ బెయిర్‌ స్టో(వికెట్‌ కీపర్‌), బెన్‌ స్టోక్స్‌, జోస్‌ బట్లర్‌‌, క్రిస్‌ వోక్స్‌, అదిల్‌ రషీద్, స్టువార్ట్‌ బ్రాడ్‌, జేమ్స్‌ అండర్సన్‌.

చదవండి: ఇంగ్లండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌కు ఊరట!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top