
కేప్‌టౌన్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో మరో విజయం సాధించి ఆధిక్యం అందుకునే దిశగా దక్షిణాఫ్రికా అడుగులు వేస్తోంది. న్యూలాండ్స్ మైదానంలో జరుగుతున్న మూడో టెస్టులో సఫారీలకు పట్టు చిక్కింది. మ్యాచ్ మూడో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తమ రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. మార్క్‌రమ్ (84; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక అర్ధ సెంచరీతో ఇన్నింగ్స్‌ను నడిపించగా, ఏబీ డివిలియర్స్ (51 బ్యాటింగ్; 6 ఫోర్లు, ఒక సిక్స్) మరో సారి తన విలువను ప్రదర్శించాడు.
కమిన్స్‌కు 2 వికెట్లు దక్కాయి. తొలి ఇన్నింగ్స్‌లో దక్కిన 56 పరుగుల ఆధిక్యం కలుపుకొని ప్రస్తుతం దక్షిణాఫ్రికా ఓవరాల్‌గా 294 పరుగులు ముందంజలో ఉంది. క్రీజ్‌లో డివిలియర్స్‌తో పాటు డి కాక్ (29 బ్యాటింగ్; 2 ఫోర్లు, ఒక సిక్స్) ఉన్నాడు. ఇప్పటికే నిలదొక్కుకున్న వీరిద్దరు నాలుగో రోజు చెలరేగితే ఆధిక్యం మరింత పెరిగే అవకాశం ఉంది. అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 245/9తో ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా మరో పది పరుగులు జోడించి తొలి ఇన్నింగ్స్‌లో 255 పరుగులకు ఆలౌటైంది. మోర్కెల్, రబడ చెరో 4 వికెట్లు పడగొట్టారు.