కోహ్లి పరుగుల రికార్డు బ్రేక్‌! | Sakshi
Sakshi News home page

కోహ్లి పరుగుల రికార్డు బ్రేక్‌!

Published Tue, Sep 10 2019 12:47 PM

Smith Surpasses Kohli In Illustrious Test List - Sakshi

మాంచెస్టర్‌:  ఇటీవల టెస్టుల్లో నంబర్‌ వన్‌ ర్యాంకును దక్కించుకుని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని వెనక్కినెట్టిన ఆసీస్‌ క్రికెటర్‌ స్టీవ్‌ స్మిత్‌ మరో ఘనత సాధించాడు.  యాషెస్‌ సిరీస్‌లో స్మిత్‌ ఇప్పటివరకూ 671 పరుగులు సాధించాడు. సుమారు 135 సగటుతో పరుగుల దాహం తీర్చుకున్నాడు. ఈ క్రమంలోనే విరాట్‌ కోహ్లిని అధిగమించాడు స్మిత్‌. మూడు టెస్టుల సిరీస్‌ పరంగా కానీ మూడు మ్యాచ్‌లు ఆడిన తర్వాత కానీ అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో స్మిత్‌ మూడో స్థానాన్ని ఆక్రమించాడు. అదే సమయంలో కోహ్లితో పాటు పాకిస్తాన్‌ మాజీ ఆటగాడు మహ్మద్‌ యూసఫ్‌ రికార్డును బ్రేక్‌ చేశాడు. 2006-07 సీజన్‌లో వెస్టిండీస్‌తో  జరిగిన మూడు టెస్టు సిరీస్‌లో యూసఫ్‌ 665  పరుగులు సాధించాడు. ఇక 2017-18 సీజన్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో కోహ్లి 610 పరుగులు నమోదు చేశాడు.

అయితే యాషెస్‌ సిరీస్‌లో ఇప్పటివరకూ మూడు టెస్టులు మాత్రమే ఆడిన స్మిత్‌.. కోహ్లి, యూసఫ్‌ల పరుగుల రికార్డును సవరించాడు. ఈ జాబితాలో ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ గ్రాహం గూచ్‌(1990లో భారత్‌పై 752 పరుగులు),  వెస్టిండీస్‌ దిగ్గజ ఆటగాడు బ్రియన్‌ లారా(2001-02 సీజన్‌లో శ్రీలంకపై 688 పరుగులు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.యాషెస్‌ సిరీస్‌ తొలి టెస్టు రెండు ఇన‍్నింగ్స్‌ల్లో స్మిత్‌ 144 పరుగులు, 142 పరుగులు సాధించాడు. ఇక రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 92 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌కు గాయం కారణంగా దూరమయ్యాడు. ఇక మూడో టెస్టులో స్మిత్‌ ఆడకపోగా, నాల్గో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 211 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 82 పరుగులు సాధించాడు.

Advertisement
Advertisement