ఐసీసీ తీసుకున్న ఆ నిర్ణయం సూపర్‌: సచిన్‌

Sachin Welcomes ICC Decision To Scrapping Of Boundary Rule - Sakshi

ముంబై:  క్రికెట్లో సూపర్‌ ఓవర్‌పై కీలక నిర్ణయం తీసుకున్న అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ)ని భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ ప్రశంసించాడు. ప్రపంచకప్‌ సెమీస్, పైనల్లో సూపర్‌ ఓవర్‌ కూడా టై అయితే బౌండరీ లెక్కతో విజేతను నిర్ణయించకుండా.. ఫలితం వచ్చే వరకు సూపర్‌ ఓవర్‌లు ఆడిస్తామని ఐసీసీ సోమవారం స్పష్టం చేసింది. బోర్డు మీటింగ్‌లో పలు చర్చల అనంతరం ఐసీసీ ఈ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పటి వరకు సూపర్‌ ఓవర్‌ టై అయితే బౌండరీల లెక్కను బట్టి విజేతను నిర్ణయించేవారు. అయితే, ఫలితం వచ్చే వరకు సూపర్‌ ఓవర్‌లు ఆడించాలని ఇంతకుముందే సూచించిన సచిన్‌.. నిబంధనలో సవరణ చేసినందుకు ట్విట్టర్‌ వేదికగా ఐసీసీని ప్రశంసించారు. ‘సూపర్‌ ఓవర్‌లు చాలా ముఖ్యం. రెండు జట్ల స్కోర్లు టై అయినపుడు ఫలితాన్ని నిర్ణయించడంలో ఇదే సరైన మార్గం. ఐసీసీకి ధన్యవాదాలు’ అని సచిన్‌ అభినందించాడు.

ఇటీవల ఇంగ్లాండ్, న్యూజిలాండ్‌ మధ్య జరిగిన ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ టై కావడంతో విజేతను తేల్చేందుకు సూపర్‌ ఓవర్‌ ఆడించారు. కానీ సూపర్‌ ఓవర్‌ కూడా టైగా మారడంతో.. బౌండరీల లెక్కతో ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటించారు. ఇది సర్వత్రా విమర్శలకు దారితీసింది. ఐసీసీ నిబంధనలపై క్రికెటర్లు, మాజీ లు, అభిమానులు పెద్దఎత్తున విమర్శించారు. ఫలితం వచ్చే వరకు సూపర్‌ ఓవర్‌ను నిర్వహించాలని మాజీ క్రికెటర్లు చాలా మంది సూచించారు. ఇందులో సచిన్‌ కూడా ఉన్నాడు. దీంతో అనిల్‌ కుంబ్లే నేతృత్వంలో సూపర్‌ ఓవర్‌ నిబంధనలపై ఐసీసీ ఓ కమిటీని నియమించింది. కుంబ్లే కమిటీ సిఫార్సుల మేరకు ఐసీసీ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇక నుంచి సెమీఫైనల్, ఫైనల్‌ మ్యాచ్‌ల్లో సూపర్‌ ఓవర్‌ టై అయితే ఫలితం తేలేవరకు సూపర్‌ ఓవర్లు ఉంటాయి. కేవలం నాకౌట్‌ దశలోనే ఆడించే సూపర్‌ ఓవర్‌ లను ఇకపై లీగ్‌ దశలోనూ ఆడిస్తారు. అయితే ఆ సూపర్‌ ఓవర్‌ టై అయితే మ్యాచ్‌ను టైగా పరిగణిస్తారు. మరో సూపర్‌ ఓవర్‌ ఉండదు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top