
దేశం కోసం ప్రపంచకప్‌లో పోరాడేందుకు తహతహలాడుతున్నాడు..
లండన్: టీమిండియా డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్‌పై క్రికెట్ గాడ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రశంసల జల్లు కురిపించారు. ఐసీసీ వంటి మెగా టోర్నీల్లో గణాంకాలే అతడి గురించి చెబుతాయని, ప్రత్యేకంగా ఎవరూ చెప్పల్సిన అవసరం లేదన్నారు. ఇక ధావన్ గాయం నుంచి అంతగా ఆందోళన పడాల్సిన అవసరంలేదన్నాడు. ధావన్ గొప్ప పోరాట యోధుడని, అతడు ప్రపంచకప్‌లో పోరాడేందుకు తహతహలాడుతున్నాడని పేర్కొన్నాడు. మనందరికంటే ఎక్కువగా అతడు ప్రపంచకప్‌లో ఫైటింగ్ చేయాలని ఆత్రుతగా ఉన్నాడని, ఆ తపనే అతడి గాయం నుంచి త్వరగా కోలుకునేలా చేస్తుందన్నాడు.
‘2009 న్యూజిలాండ్ పర్యటనలో నా చేతి బొటనవేలికి గాయమై ఫ్రాక్చర్ అయింది. అయినా సిరీస్ మొత్తం నేను ఆడాను. బ్యాటింగ్ చేసేటప్పుడు అంతగా ఇబ్బంది ఉండదు కానీ ఫీల్డింగ్ చేసేటప్పుడు కష్టంగా ఉంటుంది. అందుకే ఆ సిరీస్‌లో కేవలం బ్యాటింగ్ మాత్రమే చేశాను. ధావన్ గాయం కూడా అంతగా ప్రమాదకరమైనది కాదు. ప్రపంచకప్‌లో దేశం తరుపున ఫైటింగ్ చేయడానికి త్వరలోనే మైదానంలోకి దిగుతాడు. అతడు గొప్ప పోరాటయోధుడు. ఇక ప్రపంచకప్‌లో ఇప్పటివరకు టీమిండియా ప్రదర్శన సంతృప్తికరంగా ఉంది’అంటూ సచిన్ పేర్కొన్నారు. ఇక ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా పాకిస్తాన్‌తో ఆదివారం(జూన్ 16) తలపడనుంది. ధావన్‌కు గాయం కారణంగా రోహిత్‌తో కలిసి రాహుల్ ఓపెనింగ్ దిగుతాడు. నాలుగో స్థానంలో విజయ్ శంకర్ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
చదవండి:
ధావన్ ట్వీట్‌ను కాపీ కొట్టిన బంగ్లా క్రికెటర్!
శిఖర్ ధావన్ తీవ్ర కసరత్తు