రోహిత్‌ రాయుడు సెంచరీ వృథా

Rohit Rayudu ton in vain as Mumbai storm into Final - Sakshi

 సెమీస్‌లో హైదరాబాద్‌ ఓటమి

 మెరిసిన పృథ్వీ షా, శ్రేయస్‌ అయ్యర్‌

 విజయ్‌ హజారే ట్రోఫీ

ఫైనల్లో ముంబై  

సీజన్‌ మొత్తం నిలకడగా రాణించిన హైదరాబాద్‌ జట్టుకు కీలకపోరులో నిరాశే ఎదురైంది. హేమాహేమీలతో కూడిన ముంబై జోరు ముందు నిలవలేక సెమీఫైనల్లో ఓటమి పాలైంది. బ్యాటింగ్‌లో ఫర్వాలేదనిపించి గౌరవప్రద స్కోరు చేసినా...  పటిష్ట ముంబై లైనప్‌ ముందు అది సరిపోలేదు. స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ జోరుకు తోడు వరుణుడు కూడా సహకరించడంతో విజయ్‌ హజారే టోర్నీలో ముంబై ఫైనల్‌కు దూసుకెళ్లింది.   

బెంగళూరు: విజయ్‌ హజారే ట్రోఫీ వన్డే టోర్నీలో హైదరాబాద్‌ జట్టు పోరాటం ముగిసింది. సంచలనాలు సృష్టిస్తూ తొలిసారి సెమీస్‌ చేరిన హైదరాబాద్‌ పటిష్ట ముంబైని నిలవరించలేక ఓటమి పాలైంది. క్వార్టర్స్‌లో ఆంధ్రపై గెలిచి మంచి జోరు మీదున్న హైదరాబాద్‌ సెమీస్‌లో ముంబై దూకుడు ముందు నిలువలేకపోయింది. రోహిత్‌ రాయుడు (132 బంతుల్లో 121 నాటౌట్‌; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ శతకంతో చెలరేగడంతో... టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ తుషార్‌ దేశ్‌పాండే (3/55) రాణించాడు. అనంతరం యువ సంచలనం పృథ్వీ షా (44 బంతుల్లో 61; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), శ్రేయస్‌ అయ్యర్‌ (53 బంతుల్లో 55 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకాలతో సత్తా చాటడంతో ముంబై 60 పరుగుల తేడాతో గెలుపొందింది. లక్ష్యఛేదనలో 25 ఓవర్లలో 155/2తో ముంబై బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో వర్షం రావడంతో మ్యాచ్‌ ఆగిపోయింది. వర్షం తగ్గకపోవడంతో వీజేడీ పద్ధతి ప్రకారం ముంబైను విజేతగా ప్రకటించారు. వీజీడీ పద్ధతి ప్రకారం 25 ఓవర్లలో ముంబై విజయం ఖరారు కావాలంటే 95 పరుగులు చేయాల్సింది. అయితే ఆ స్కోరుకంటే ముంబై 60 పరుగులు ఎక్కువగానే చేసి విజయాన్ని దక్కించుకుంది.

అతనొక్కడే...

ముందుగా బ్యాటింగ్‌ చేయాలనుకున్న కెప్టెన్‌ అంబటి రాయుడు నిర్ణయం హైదరాబాద్‌కు కలిసిరాలేదు. ఈ టోర్నీలో ఇప్పటివరకు జట్టుకు శుభారంభాలు అందించిన ఓపెనర్లు తన్మయ్‌ అగర్వాల్‌ (11), అక్షత్‌ రెడ్డి (7) విఫలమయ్యారు. తుషార్‌ చెలరేగడంతో వీరిద్దరూ పెవిలియన్‌ చేరారు. అనంతరం బావనక సందీప్‌ (29; 3 ఫోర్లు, 1 సిక్స్‌)తో కలిసి రోహిత్‌ రాయుడు ఇన్నింగ్స్‌ను చక్కబెట్టే ప్రయత్నం చేశాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 50 పరుగులు జోడించాక సందీప్‌ ఔటయ్యాడు. ఆ తర్వాత అంబటి రాయుడు (11), సుమంత్‌ (3), సీవీ మిలింద్‌ (10) వెంటవెంటనే పెవిలియన్‌ చేరారు. ఈ సమయంలో రోహిత్‌ రాయుడు ఆకాశ్‌ భండారి (19; 2 ఫోర్లు)తో కలిసి ఏడో వికెట్‌కు 57 పరుగులు... మెహదీ హసన్‌ (17 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్‌)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 58 పరుగులు జోడించి జట్టుకు మంచి స్కోరు అందించాడు.  

లక్ష్యం చిన్నబోయింది...

ఓ మోస్తరు లక్ష్యఛేదనలో బరిలో దిగిన ముంబైకి ఓపెనర్లు మెరుపు ఆరంభాన్నిచ్చారు. రోహిత్‌ శర్మ (24 బంతుల్లో 17; 2 ఫోర్లు) అండగా పృథ్వీ షా రెచ్చిపోయాడు. హైదరాబాద్‌ కెప్టెన్‌ అంబటి రాయుడు లెగ్‌ స్పిన్నర్‌ ఆకాశ్‌ భండారితో తొలి ఓవర్‌ వేసే అవకాశం ఇచ్చాడు. అయితే భండారి బౌలింగ్‌లో బౌండరీలతో పృథ్వీ షా విరుచుకుపడ్డాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 9.5 ఓవర్లలో 73 పరుగులు జోడించారు. షా ధాటికి హైదరాబాద్‌ ప్రధాన పేసర్‌ సిరాజ్‌ 3 ఓవర్లలోనే 33 పరుగులు సమర్పించుకున్నాడు. అనంతరం మెహదీ హసన్‌ వరుస ఓవర్లలో వీరిద్దరినీ ఔట్‌ చేసినా... కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్, అజింక్య రహానే (17 నాటౌట్‌)తో కలిసి మూడో వికెట్‌కు అజేయంగా 73 పరుగులు జోడించాడు. దీంతో ముంబై 25 ఓవర్లలోనే 155/2తో నిలిచింది. నేడు జరిగే రెండో సెమీఫైనల్లో జార్ఖండ్‌తో ఢిల్లీ తలపడనుంది. గెలిచిన జట్టుతో శనివారం జరిగే ఫైనల్లో ముంబై ఆడుతుంది.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top