48 బంతుల్లోనే సెంచరీ

48 బంతుల్లోనే సెంచరీ


 న్యూఢిల్లీ: యువ క్రికెటర్ రిషబ్ పంత్ భారత ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో చరిత్ర సృష్టించాడు. రంజీ ట్రోఫీలో భాగంగా ఈ ఢిల్లీ క్రికెటర్ జార్ఖండ్‌పై మెరుపు వేగంతో 48 బంతుల్లోనే శతకం బాదాడు. దీంతో ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో 28 ఏళ్ల రికార్డును తుడిచిపెట్టాడు. 1987-88 సీజన్‌లో జరిగిన ఇరానీ కప్‌లో రెస్టాఫ్ ఇండియాపై తమిళనాడు మాజీ ఓపెనర్ వీబీ చంద్రశేఖర్ 56 బంతుల్లోనే చేసిన సెంచరీయే ఇప్పటిదాకా రికార్డుగా కొనసాగింది. అంతకుముందు ఏడాది రాజేశ్ బోరా కూడా ఇన్నే బంతుల్లో శతకం సాధించాడు. అయితే ప్రపంచ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మాత్రం 19 ఏళ్ల రిషబ్ పంత్ సాధించిన ఫీట్ రెండో స్థానంలో నిలుస్తుంది. షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్ (1982)లో దక్షిణ ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ హూక్స్ 34 బంతుల్లోనే ప్రత్యర్థి విక్టోరియాపై శతకం కొట్టి ఈ జాబితాలో తొలి స్థానంలో ఉన్నాడు.

 

 కేరళలోని తుంబాలో జరిగిన రంజీ మ్యాచ్ రెండో ఇన్నింగ్‌‌సలో పంత్ ఓవరాల్‌గా 67 బంతుల్లో 135 పరుగులు సాధించి అవుటయ్యాడు. ఇందులో ఎనిమిది ఫోర్లు, 13 సిక్సర్లున్నాయి. ముఖ్యంగా స్పిన్నర్లు షాబాజ్ నదీమ్, సన్నీ గుప్తా బౌలింగ్‌లో భారీగా పరుగులు రాబట్టాడు. దీంతో ఫాలో ఆన్‌తో బరిలోకి దిగిన ఢిల్లీ చివరిదైన నాలుగో రోజు తమ రెండో ఇన్నింగ్‌‌సలో ఆరు వికెట్లకు 480 పరుగులు చేయడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్‌‌సలోనూ రిషబ్ 82 బంతుల్లోనే సెంచరీ చేయడం విశేషం. ఇక భీకర ఫామ్‌లో ఉన్న రిషబ్ ఈ సీజన్‌లో ఇప్పటికే ఏడు ఇన్నింగ్‌‌సలో వరుసగా 146, 308, 24, 9, 60, 117, 135 పరుగులతో జోరు మీదున్నాడు.

 

 అండర్-19 ప్రపంచకప్‌తో వెలుగులోకి..

 గతేడాది అక్టోబర్‌లోనే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన రిషబ్ పంత్ ఈ ఏడాది బంగ్లాదేశ్‌తో జరిగిన అండర్-19 ప్రపంచకప్ ద్వారా వెలుగులోకి వచ్చాడు. నమీబియాతో సెంచరీ చేసి జట్టును సెమీస్‌కు చేర్చాడు. ఆ మ్యాచ్ జరిగిన రోజే నిర్వహించిన ఐపీఎల్ వేలంలో రూ.10 లక్షల కనీస ధర ఉన్న పంత్‌ను ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఏకంగా రూ.1.9 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్‌లోనూ ఓ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. అయితే ఈ సీజన్ ఆరంభంలో ఆస్ట్రేలియాలో పర్యటించిన భారత్ ‘ఎ’ జట్టులో చోటు దక్కకపోవడం రిషబ్‌ను నిరాశపరిచింది. అందుకే భారీగా పరుగులు సాధించి మరోసారి ఎవరూ తనను పక్కకు తప్పించేలా చేయకూడదని నిర్ణయించుకున్నట్టు గత నెలలో ట్రిపుల్ సెంచరీ చేసిన అనంతరం పంత్ తెలిపాడు.

 

 ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్ల (21)ను బాదిన తొలి భారత ఆటగాడిగా పంత్ రికార్డు సృష్టించాడు. ఓవరాల్‌గా న్యూజిలాండ్‌కు చెందిన కొలిన్ మున్రో (23) ముందున్నాడు.

 

 

 ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో భారత ఆటగాళ్ల ఫాస్టెస్ట్ సెంచరీలు

 ఆటగాడు    ఎన్ని బంతుల్లో    జట్టు    ఎవరిపై    సీజన్

 రిషబ్    48    ఢిల్లీ    జార్ఖండ్    2016-17

 రాజేశ్ బోరా    56    అస్సాం    త్రిపుర    1987-88

 వీబీ చంద్రశేఖర్    56    తమిళనాడు    రెస్ట్ ఆఫ్ ఇండియా    1988-89

 రూబెన్ పాల్    60    తమిళనాడు    గోవా    1995-96

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top