టీమిండియాకు షాక్‌.. సిరీస్‌ నుంచి ఔట్‌

Prithvi Shaw Ruled Out Of Test Series Against Australia - Sakshi

పెర్త్‌: టీమిండియా సంచలన ఆటగాడు, యువ ఓపెనర్‌ పృథ్వీ షా​ ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌కు పూర్తిగా దూరమయ్యాడు. తొలి రెండు టెస్టులకు మడమ గాయం కారణంగా దూరమైన షా.. మూడో టెస్టు వరకైనా అందుబాటులో ఉంటాడని బీసీసీఐ తొలుత భావించింది. అయితే గాయం నుంచి పృథ్వీ షా పూర్తిగా కోలుకోకపోడంతో అతడిని జట్టు నుంచి తప్పించింది.  పృథ్వీ షా స్థానంలో మరో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌కు అవకాశం కల్పించింది. ఆసీస్‌తో చివరి రెండు టెస్టులకు తలపడబోయే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న ఆల్‌రౌండర్‌ హార్థిక్‌ పాండ్యా తిరిగి టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు.

టీమిండియాకు ఎదురుదెబ్బే!
ఆసీస్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో టీమిండియాకు ఓపెనింగే ప్రధాన సమస్య. ఓపెనర్లు మురళీ విజయ్‌, కేఎల్‌ రాహుల్‌లు దారుణంగా విపలమవుతుండటంతో మిగతా బ్యాట్స్‌మెన్‌పై ప్రభావం ఎక్కువగా చూపుతోంది. మంచి ఫామ్‌లో ఉన్న పృథ్వీ షా మెల్‌బోర్న్‌ వేదికగా జరగబోయే టెస్టు మ్యాచ్‌కు అందుబాటులోకి వస్తే ఓపెనింగ్‌ సమస్య తీరుతుందని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భావించింది. అయితే షా పూర్తి సిరీస్‌కు దూరమవడంతో టీమిండియాకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలిందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇక రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ఎదురీదుతోంది. ఓపెనర్లు మరోసారి విఫలవడం, పుజారా, కోహ్లి, రహానే తక్కువ స్కోర్లకే వెనుదిరగడంతో టీమిండియా పీకల్లోతు కష్టాలో పడింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. హనుమ విహారి(24), రిషభ్‌ పంత్‌(9) లు క్రీజులో ఉన్నారు. టీమిండియా రెండో టెస్టులో విజయం సాధించాలంటే చివరి రోజు మరో 175 పరుగుల సాధించాలి.

చివరి రెండు టెస్టులకు భారత జట్టు ఇదే    
విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), అజింక్యా రహానే(వైస్‌ కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, మురళీ విజయ్‌, మయాంక్‌ అగర్వాల్‌, చతేశ్వర్‌ పుజారా, రోహిత్‌ శర్మ, హనుమ విహారీ, రిషభ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌),  పార్థీవ్‌ పటేల్‌(వికెట్‌ కీపర్‌), హర్దిక్‌ పాండ్యా, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌, ఇషాంత్‌ శర్మ, మహ్మద్‌ షమీ, ఉమేశ్‌ యాదవ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, జస్ప్రిత్‌ బుమ్రా

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top