తేలిగ్గా తీసుకోవట్లేదు! | Not taking New Zealand lightly: mahendra singh dhoni | Sakshi
Sakshi News home page

తేలిగ్గా తీసుకోవట్లేదు!

Jan 14 2014 12:43 AM | Updated on Oct 17 2018 4:43 PM

తేలిగ్గా తీసుకోవట్లేదు! - Sakshi

తేలిగ్గా తీసుకోవట్లేదు!

న్యూజిలాండ్ జట్టును వారి సొంతగడ్డపై ఎదుర్కోవడం సులభం కాదని భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వ్యాఖ్యానించాడు.

 నేపియర్: న్యూజిలాండ్ జట్టును వారి సొంతగడ్డపై ఎదుర్కోవడం సులభం కాదని భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వ్యాఖ్యానించాడు. వారిని తేలిగ్గా తీసుకుంటే ప్రతికూల ఫలితం ఎదురయ్యే ప్రమాదం ఉందని అతను అభిప్రాయపడ్డాడు. ‘న్యూజిలాండ్ అద్భుతమైన జట్టు. ఆ జట్టులో మంచి బౌలర్లు ఉన్నారు. ఇటీవల వారి ప్రదర్శన కూడా చాలా బాగుంది. అన్నింటికీ మించి కివీస్‌లోని పరిస్థితులపై వారికి అవగాహన ఉంది.
 
 ముఖ్యంగా గతంలో ఇక్కడ ఆడని మా ఆటగాళ్లకు పెద్ద సవాల్‌లాంటిదే’ ధోని విశ్లేషించాడు. ఐదు వన్డేలు, రెండు టెస్టుల సిరీస్ కోసం న్యూజిలాండ్ చేరుకున్న అనంతరం భారత కెప్టెన్ ఇక్కడ మీడియాతో మాట్లాడాడు. ‘మేం ప్రత్యర్థిని తేలిగ్గా తీసుకోవడం లేదు. మేం వారికి తగిన గౌరవం ఇస్తాం. ఒంటిచేత్తో విజయాన్ని అందించగల సత్తా ఉన్న అనుభవజ్ఞులు కొంత మంది ఆ జట్టులో ఉన్నారు’ అని ధోని అన్నాడు.
 బౌలర్లు రాణిస్తారు...
 వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్ కోసం ఈ సిరీస్ తమ జట్టులోని యువ ఆటగాళ్లకు సన్నాహకంగా ఉపయోగపడుతుందని భారత కెప్టెన్ అభిప్రాయపడ్డాడు. ‘ఇది మా కుర్రాళ్లకు మంచి అవకాశం. ఇక్కడి మైదానాలు ఇతర దేశాల్లో వాటికంటే భిన్నంగా ఉంటాయి. ఫీల్డింగ్ స్థానాలు కూడా అదే తరహాలో అనిపిస్తాయి.
 
 అందుకే ప్రత్యేకంగా ఫీల్డింగ్ స్థానాలు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ పర్యటన సరికొత్త అనుభవంగా మిగులుతుంది’ అని ధోని అన్నాడు. భారత జట్టు బౌలర్లు రాణించగలరని కెప్టెన్ విశ్వాసం వ్యక్తం చేశాడు. ‘బౌలర్లు బాగా ఆడతారని నేను నమ్ముతున్నా. అయితే ఇది కూడా పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. వికెట్  ఫాస్ట్ బౌలింగ్‌కు అనుకూలిస్తే దానిని ఉపయోగించుకోగల సత్తా మా బౌలర్లలో ఉంది’ అని ధోని వ్యాఖ్యానించాడు.
 
 వన్డే సిరీస్‌కు వెటోరి దూరం!
 వెన్నునొప్పితో బాధ పడుతున్న కివీస్ సీనియర్ ఆటగాడు డానియెల్ వెటోరి భారత్‌తో జరిగే వన్డే సిరీస్‌కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సిరీస్ కోసం బుధవారం జట్టును ఎంపిక చేయనున్న సెలక్షన్ కమిటీ అతని పేరును పరిశీలించే అవకాశం లేదని సమాచారం.

 
 న్యూజిలాండ్ కోచ్ మైక్ హెసన్ ఈ విషయాన్ని సూత్రప్రాయంగా వెల్లడించారు. సుదీర్ఘ కాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్న వెటోరి త్వరలోనే తన కెరీర్‌ను కూడా ముగించవచ్చని వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగానే అతను ఐపీఎల్‌లో బెంగళూరు జట్టు కోచ్‌గా బాధ్యతలు చేపట్టినట్లు అతని సన్నిహిత వర్గాలు భావిస్తున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement