విశ్వసమరం విజేత ఇంగ్లండ్‌

New Zealand Won The Toss Elected To Bat First Against England - Sakshi

లండన్‌ : నరాలు తెగే ఉత్కంఠ పోరులో చివరికి ఇంగ్లండ్‌నే విజయం వరించింది. తొలుత స్కోర్లు సమం కావడంతో మ్యాచ్‌ టై అయింది. అనంతరం సూపర్‌ ఓవర్‌లో కూడా ఇరుజట్ల స్కోర్‌ సమం కావడంతో బౌండరీల ఆధారంగా ఇంగ్లండ్‌ కప్‌ కైవసం చేసుకుంది. 

ఫైనల్‌ మ్యాచ్‌ టై కావడంతో సూపర్‌ ఓవర్‌తో ఫలితం తేలనుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ బౌల్‌​ వేసిన ఓవర్‌లో 15 పరుగులు సాధించింది. స్టోక్స్‌, బట్లర్‌లు బౌల్ట్‌ బౌలింగ్‌ల్‌ ఎదురుదాడికి దిగారు. దీంతో అవలీలగా 15 పరుగులు రాబట్టారు.  

ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ టై అయింది. దీంతో సూపర్‌ ఓవర్‌తో ఫలితం తేలనుంది. కివీస్‌ నిర్దేశించిన 242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ నిర్ణీత ఓవర్లలో 241 పరుగులకే ఆలౌటైంది. చివరి ఓవర్‌లో ఇంగ్లండ్‌ విజయానికి 15 పరుగులు అవసరం కాగా..  ట్రెంట్‌ బౌల్ట్‌ బౌలింగ్‌లో ఇంగ్లండ్‌ 14 పరుగులు మాత్రమే సాధించింది. దీంతో స్కోర్లు సమం అయ్యాయి.  

నరాలు తెగే ఉత్కంఠ. విజయం ఇరువురి జట్ల మధ్య దోబుచూలాడుతోంది. ఇంగ్లండ్‌ విజయం సాధించాలంటే 6 బంతుల్లో 15 పరుగులు సాధించాలి. క్రీజులో బెన్‌ స్టోక్స్‌(70), రషీద్‌(0)లు ఉన్నారు. విజయం ఇరువురి మధ్య దోబుచులాడుతోంది. ఇంగ్లండ్‌ ఆశలన్నీ స్టోక్స్‌పైనే ఉన్నాయి.  

కీలకసమయంలో స్వల్ప వ్యవధిలో ఇంగ్లండ్‌ రెండు వికెట్లను చేజార్చుకుంది. బట్లర్‌(55), వోక్స్‌(2)లు వెంటవెంటే ఔటయ్యారు. దీంతో ఇంగ్లండ్‌ విజయావకాశాలు ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌పైనే ఉన్నాయి.  

ఇంగ్లండ్‌కు షాక్‌. కీలక సమయంలో జోస్‌ బట్లర్‌(59) ఔటయ్యాడు. ఫెర్గుసన్‌ బౌలింగ్‌లో బట్లర్‌ భారీ షాట్‌ ఆడాడు. అయితే టిమ్‌ సౌథీ కళ్లుచెదిరే రీతిలో క్యాచ్ అందుకోవడంతో బట్లర్‌ వెనుదిరిగాడు. దీంతో ఐదో వికెట్‌కు 110 పరుగుల భాగస్మామ్యానికి తెరపడింది. స్టోక్స్‌(51), వోక్స్‌(1) క్రీజులో ఉన్నారు. 

ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌​ స్టోక్స్‌, వికెట్‌ కీపర్‌ బట్లర్‌లు కీలక సమయంలో తామేంటో నిరూపించుకున్నారు ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఫైనల్‌ మ్యాచ్‌లో వీర్దిదరూ అర్దసెంచరీలతో ఆకట్టుకున్నారు. 86 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన ఇంగ్లండ్‌ను బట్లర్‌-స్టోక్స్‌లు ఆదుకున్నారు. 

ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ వికెట్‌ కీపర్‌ బట్లర్‌ల సూపర్‌ ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్‌ విజయం వైపు అడుగులు వేస్తోంది. 86 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన ఇంగ్లండ్‌ను ఈ జంట ఆదుకుంది. వీరిద్దరూ ఐదో వికెట్‌కు ఇప్పటికే 84 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ప్రస్తుతం ఇంగ్లండ్‌ విజయం సాధించాలంటే 60 బంతుల్లో 72 పరుగులు సాధించాలి. ఇప్పటికైతే ఇరుజట్లకు విజయావకాశాలు ఉన్నాయి.  

న్యూజిలాండ్‌ బౌలర్‌ ఫెర్గుసన్‌ కళ్లు చెదిరే రీతిలో క్యాచ్‌ అందుకోవడంతో ఇయాన్‌ మోర్గాన్‌(9) వెనుదిరిగాడు. దీంతో ఇంగ్లండ్‌ 86 పరుగులకే నాలుగు కీలక వికెట్లను చేజార్చుకుంది. ప్రస్తుతం ఇంగ్లండ్‌ 24 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. క్రీజులో స్టోక్స్‌(5), బట్లర్‌(2) లు క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఈ భాగస్వామ్యంపైనే ఇంగ్లండ్‌ విజయావకాశాలు ఉన్నాయి. 

ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఫైనల్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ మూడో వికెట్‌ను చేజార్చుకుంది. ఫెర్గుసన్‌ బౌలింగ్‌లో నిలకడగా రాణిస్తున్న బెయిర్‌ స్టో(36) దురదృష్టవశాత్తు ఔటయ్యాడు. దీంతో 71 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్‌ కష్టాల్లో పడింది. రాయ్‌(17), రూట్‌(7)లు తీవ్రంగా నిరాశపరిచారు. ప్రస్తుతం ఇంగ్లండ్‌ 20 ఓవర్లలో​ 3 వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది. క్రీజులో మోర్గాన్(8)‌, స్టోక్స్‌(1)లు ఉన్నారు.

ఆరంభంలోనే జాసన్‌ రాయ్‌ వికెట్‌ కోల్పోవడంతో ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ జోయ్‌ రూట్‌, బెయిర్‌ స్టోలు మరో వికెట్‌ పడకుండా ఆచితూచి ఆడుతున్నారు. 13 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్‌ వికెట్‌ నష్టపోయి 41 పరుగులు చేసింది. బెయిర్‌ స్టో (20; 36 బంతుల్లో), రూట్‌(​3; 22 బంతుల్లో)లు క్రీజులో ఉన్నారు. 

ఇంగ్లండ్‌కు షాక్‌.. రాయ్‌ ఔట్‌
లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే షాక్‌ తగిలింది. ఆ జట్టు స్టార్‌ బ్యాట్స్‌మన్‌ జేసన్‌ రాయ్‌(17)ను మ్యాట్‌ హెన్రీ ఔట్‌ చేశాడు. దీంతో 28 పరుగులకే ఇంగ్లండ్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. రాయ్‌ అవుటవ్వడంతో రూట్‌ క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం బెయిర్‌ స్టో 14 పరుగులతో, రూట్‌ పరుగులేమి చేయకుండా క్రీజులో ఉన్నారు. 

తొలి బంతికే రివ్యూ తీసుకున్న కివీస్‌
తొలి బంతికే రివ్యూ తీసుకుని న్యూజిలాండ్‌ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కివీస్‌ నిర్దేశించిన 242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే అదృష్టం కలిసొచ్చింది. ట్రెంట్‌బోల్ట్‌ వేసిన తొలి ఓవర్‌ తొలి బంతి జాసన్‌ రాయ్‌ వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు. దీంతో కివీస్‌ ఆటగాళ్లు అప్పీల్‌ చేయగా అంపైర్‌ నాటౌట్ ప్రకటించాడు. కివీస్‌ రివ్యూకి వెళ్లగా అంపైర్‌ కాల్‌ వచ్చింది. దీంతో రాయ్‌ బతికిపోయాడు. 

ఇంగ్లండ్‌ లక్ష్యం 242
ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఫైనల్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న కివీస్‌.. బ్యాట్స్‌మెన్‌ వైఫల్యంతో సాదారణ స్కోర్‌కే పరిమితమైంది. హెన్రీ నికోలస్‌(55), టామ్‌ లాథమ్‌(47) మినహా ఎవరూ అంతగా రాణించలేదు. ఇంగ్లండ్‌ బౌలర్లలో క్రిస్‌ వోక్స్‌, ఫ్లంకెట్‌లు తలో మూడు వికెట్లు పడగొట్టారు.   

ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ఏడో వికెట్‌ను కోల్పోయింది. టామ్‌ లాథమ్‌(47)ను క్రిస్‌ వోక్స్‌ స్లోబాల్‌తో బోల్తా కొట్టించాడు. దీంతో చివరి వరకు ఉండి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ అందిస్తాడునుకున్న లాథమ్‌ కూడా ఔట్‌ కావడంతో కివీస్‌ ఫ్యాన్స్‌ తీవ్ర నిరాశకు గురయ్యారు.   

న్యూజిలాండ్‌ ఆరో వికెట్‌ను చేజార్చుకుంది. ప్రధాన బ్యాట్స్‌మెన్‌ దారిలోనే గ్రాండ్‌హోమ్‌(16)కూడా పెవిలియన్‌ బాట పట్టాడు. ఆరో వికెట్‌కు 46 పరుగులు జోడించిన అనంతరం గ్రాండ్‌హోమ్‌ను క్రిస్‌ వోక్స్‌ అవుట్‌ చేశాడు. 

పోరాడుతున్న లాథమ్‌
ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఫైనల్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మన్‌ టామ్‌ లాథమ్‌ ఆకట్టుకుంటున్నాడు. హెన్నీ నికోలస్‌ మినహా ప్రధాన బ్యాట్స్‌మెన్‌ విఫలమైన చోట లాథమ్‌ ఒంటరి పోరాటం చేస్తున్నాడు. లాథమ్‌(41)తో పాటు గ్రాండ్‌హోమ్‌(13) క్రీజులో ఉన్నారు. 46 ఓవర్లు ముగిసే సరికి కివీస్‌ ఐదు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. 

ఐదో వికెట్‌ కోల్పోయిన కివీస్‌
ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ఐదో వికెట్‌ను కోల్పోయింది. జేమ్స్‌ నీషమ్‌(19)ను ఫ్లంకెట్‌ ఔట్‌ చేయడంతో 173 పరుగులకే ఐదు వికెట్లు​ కోల్పోయిన కివీస్‌ పీకల్లోతు కష్టాల్లో పడింది. 70 పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లను పడగొట్టిన ఇంగ్లండ్‌ ప్రత్యర్థి జట్టును ఒత్తిడిలోకి నెట్టింది. ప్రస్తుతం టామ్‌ లాథమ్‌(23)తో పాటు గ్రాండ్‌ హోమ్‌(4) క్రీజులో ఉన్నారు. 40 ఓవర్లు ముగిసే సరికి కివీస్‌ 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఫ్లంకెట్‌ మూడు వికెట్లతో రాణించగా..వుడ్‌, వోక్స్‌లు తలో వికెట్‌ పడగొట్టారు.

టేలర్‌ ఔట్‌
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఫైనల్‌ పోరులో న్యూజిలాండ్‌ నాల్గో వికెట్‌ను కోల్పోయింది. కివీస్‌ స్కోరు 141 పరుగుల వద్ద ఉండగా రాస్‌ టేలర్‌(15) పెవిలియన్‌ చేరాడు. ఇన్నింగ్స్‌ 34 ఓవర్‌ తొలి బంతికి టేలర్‌ ఔటయ్యాడు. మార్క్‌ వుడ్‌ బౌలింగ్‌లో టేలర్‌ ఎల్బీగా పెవిలియన్‌ బాట పట్టాడు. లాథమ్‌(11), జేమ్స్‌ నీషమ్‌(0)లు క్రీజ్‌లో ఉన్నారు.

నికోలస్‌ ఔట్‌

ఇంగ్లండ్‌తో జరుగుతున్న ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. అర్దసెంచరీ సాధించి మంచి ఊపుమీదున్న నికోలస్‌(55)ను ప్లంకెట్‌ బౌల్డ్‌ చేశాడు. ఇప్పటికే విలియమ్సన్‌ను ఔట్‌ చేసిన ప్లంకెట్‌.. నికోలస్‌ను కూడా ఔట్‌చేసి కివీస్‌ను మరింత కష్టాల్లోకి నెట్టాడు. ప్రస్తుతం కివీస్‌ 27 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. క్రీజులో టేలర్‌(6), లాథమ్‌(0)లు ఉన్నారు. 

నికోలస్‌ హాఫ్‌ సెంచరీ
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో హెన్రీ నికోలస్‌ అర్దసెంచరీ సాధించాడు. 71 బంతుల్లో నాలుగు ఫోర్లతో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. మార్టిన్‌ గప్టిల్‌(19), విలియమ్సన్‌(30)లు నిరాశపరిచినప్పటికీ నికోలస్‌ బాధ్యతాయుతంగా ఆడాడు. తొలి వికెట్‌కు 29, పరుగులు రెండో వికెట్‌కు 74 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. 

విలియమ్సన్‌ ఔట్‌
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌కు భారీ షాక్‌ తగిలింది. సారథి విలియమ్సన్‌(30)ను ఫ్లంకెట్‌ను ఔట్‌ చేసి కివీస్‌ను కష్టాల్లో పడేశాడు. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో కివీస్‌ బ్యాటింగ్‌కు వెన్నెముకలా నిలిచిన విలియమ్సన్‌ స్వల్పస్కోర్‌కే వెనుదిరగడం కివీస్‌ ఎదురుదెబ్బే​. ఇక సీనియర్‌ ఆటగాడు రాస్‌ టేలర్‌ ఇన్నింగ్స్‌పైనే కివీస్‌ ఆధారపడి ఉంది. ప్రస్తుతం కివీస్‌ 23 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. నికోలస్‌ 46 పరుగులతో, టేలర్‌ పరుగులేమి చేయకుండా క్రీజులో ఉన్నారు. 

అర్దసెంచరీ భాగస్వామ్యం
ఓపెనర్‌ హెన్రీ నికోలస్‌తో కలిసి కేన్‌ విలియమ్సన్‌ రెండో వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. 29 పరుగులకే మార్టిన్‌ గప్టిల్‌(19) వికెట్‌ కోల్పోవడంతో కివీస్‌ కష్టాల్లో పడింది. అయితే ఈ తరుణంలో నికోలస్‌తో కలిసి విలియమ్సన్‌ బాధ్యతాయుతంగా ఆడుతున్నాడు. ప్రస్తుతం కివీస్‌ 20 ఓవర్లకు వికెట్‌ నష్టానికి 91 పరుగులు చేసింది. నికోలస్‌ 40 పరుగులతో, విలియమ్సన్‌ 24పరుగులతో క్రీజులో ఉన్నారు.

విలియమ్సన్‌ రికార్డు
ఫైనల్‌ మ్యాచ్‌లో కివీస్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌ రికార్డు సాధించాడు. ఒక ప్రపంచకప్‌లో కెప్టెన్‌గా అత్యధిక పరుగులు సాధించిన శ్రీలంక మాజీ సారథి మహేళ జయవర్దనే(548, 2007 ప్రపంచకప్‌లో) రికార్డును విలియమ్సన్‌ తాజాగా బద్దలుకొట్టాడు.

కివీస్‌ 15 ఓవర్లు 63/1
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 15 ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టానికి 63 పరుగులు చేసింది. ప్రస్తుతం నికోలస్‌ 27 పరుగులతో, విలియమ్సన్‌ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆరంభంలోనే క్రిస్‌ వోక్స్‌ బౌలింగ్‌లో మార్టిన్‌ గప్టిల్‌(19) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో విలియమ్సన్‌, నికోలస్‌లు ఆచితూచి ఆడుతున్నారు.

కివీస్‌ 10 ఓవర్లలో 33/1
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో పది ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్‌ వికెట్‌ నష్టానికి 33 పరుగులు చేసింది. ప్రస్తుతం నికోలస్‌ 10 పరుగులతో, విలియమ్సన్‌ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. ఆరంభంలోనే క్రిస్‌ వోక్స్‌ బౌలింగ్‌లో మార్టిన్‌ గప్టిల్‌(19) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.  దీంతో 29 పరుగులకే కివీస్‌ కీలక వికెట్‌ను కోల్పోయింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న కివీస్‌కు ఓపెనర్లు ఆదిరే ఆరంభాన్ని అందించలేదు.

గప్టిల్‌ ఔట్‌..
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌కు ఆదిలోనే షాక్‌ తగిలింది. క్రిస్‌ వోక్స్‌ బౌలింగ్‌లో మార్టిన్‌ గప్టిల్‌(19) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో 29 పరుగులకే కివీస్‌ కీలక వికెట్‌ను కోల్పోయింది. గప్టిల్‌ ఔటవ్వడంతో విలియమ్సన్‌ క్రీజులోకి వచ్చాడు. 

సిక్సర్‌, ఫోర్‌తో మెరిసిన గప్టిల్‌
ఇప్పటివరకు ప్రపంచకప్‌లో మెరవని మార్టన్‌ గప్టిల్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో చాలా ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాడు. జోఫ్రా ఆర్చర్‌ వేసిన నాలుగో ఓవర్‌లో ఒక సిక్సర్‌, ఒక ఫోర్‌తో ఆకట్టుకున్నాడు. దీంతో గప్టిల్‌ ఫామ్‌లోకి వచ్చాడని కివీస్‌ అభిమానులు ఆనందపడుతున్నారు.

రివ్యూతో బతికిపోయిన నికోలస్‌
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో రివ్యూతో న్యూజిలాండ్‌ ఓపెనర్‌ నికోలస్‌ బతికిపోయాడు. వోక్స్‌ వేసిన మూడో ఓవర్‌ మూడో బంతి నికోలస్‌ ప్యాడ్‌లకు తగిలడంతో ఇంగ్లండ్‌ ఆటగాళ్లు అప్పీల్‌ చేయగా అంపైర్‌ ధర్మసేన ఔట్‌గా ప్రకటించాడు. దీంతో నికోలస్‌ రివ్యూకు వెళ్లాడు. బంతి వికెట్‌ను మిస్‌ అవుతుండటంతో థర్డ్‌ అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించాడు.

వైడ్‌తో ఫైనల్‌ మ్యాచ్‌ పారంభం
వైడ్‌తో ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ప్రారంభమైంది. క్రిస్‌ వోక్స్‌ వేసిన తొలి ఓవర్‌ తొలి బంతి వైడ్‌ కావడంతో న్యూజిలాండ్‌కు అదనంగా ఒక పరుగు లభించింది. ఇక టాస్‌ గెలిచి కివీస్‌ బ్యాటింగ్‌ ఎంచుకోవడంతో మార్టిన్‌ గప్టిల్‌, నికోలస్‌లు ఓపెనర్లుగా బరిలోకి దిగారు. కప్‌ కొట్టాల్సిన మ్యాచ్‌లో మార్గిన్‌ గప్టిల్‌ రాణించాలని కివీస్‌ కోరుకుంటుంది. అతడి రాణిస్తే ఇంగ్లండ్‌ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించాలని కివీస్‌ ఆరాటపడుతోంది. 

ఈసారి వన్డే వరల్డ్‌కప్‌లో కొత్త చాంపియన్‌ అవతరించబోతోంది.  ఒకటి అందరూ టైటిల్‌ ఫేవరెట్‌గా పేర్కొన్న జట్టు ఇంగ్లండ్‌ కాగా టోర్నీ మధ్యలో కొంత తడబాటుకు గురైనా.. ఆ తర్వాత అంచనాలకు తగ్గ ఆటతో ఫైనల్లోకి దూసుకొచ్చిన న్యూజిలాండ్‌. ఈ రెండు జట్లు మెగా టైటిల్‌ పోరులో తలపడుతున్నాయి. క్రికెట్‌కు పుట్టినిల్లయినా.. ఒకటికి మూడు సార్లు ఫైనల్‌ చేరినా.. ఇప్పటిదాకా ప్రపంచకప్‌ కల తీరని జట్టు ఇంగ్లండ్‌ది. ఇంకొకటి పెద్దగా అంచనాల్లే కుండా బరిలోకి దిగి.. లీగ్‌ దశలో డక్కామొక్కీలు తిని.. కష్టం మీద నాకౌట్‌కు చేరి.. సెమీస్‌లో బలమైన భారత జట్టుకు షాకిచ్చి ఫైనల్లో అడుగుపెట్టిన కివీస్‌. ప్రపంచ కప్‌లో ఎప్పుడూ మెరుగైన ప్రదర్శనే చేసే ఆ జట్టుకు.. టైటిల్‌ మాత్రం అందని ద్రాక్షే. ఒకసారి ఫైనల్‌ ఆడింది. కానీ కప్పు అందలేదు. మరికొద్ది గంటల్లో ఇరు జట్ల దశాబ్దాల నిరీక్షణకు ఆదివారం తెరపడబోతోంది. లార్డ్స్‌ మైదానంలో జరుగుతున్న తుది సమరంలో న్యూజిలాండ్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన కివీస్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ ముందుగా బ్యాటింగ్‌ చేసేందుకు మొగ్గుచూపాడు. ఇరు జట్లు ఎటువంటి మార్పులు చేయకుండా బరిలోకి దిగుతున్నాయి.

ఇరు జట్ల బలాబలాలు చూస్తే న్యూజిలాండ్‌ కన్నా ఇంగ్లండ్‌ కొన్ని మెట్లు పైనే ఉంది. బ్యాటింగ్‌ ఆ జట్టుకు ప్రధాన బలం. జేసన్‌ రాయ్‌, బెయిర్‌స్టో, రూట్‌, మోర్గాన్‌, స్టోక్స్‌, బట్లర్‌.. ఇలా భీకరమైన లైనప్‌ ఉందా జట్టుకు. లీగ్‌ దశ మధ్యలో తడబాటుకు గురైనప్పటికీ.. నాకౌట్‌ అవకాశాలు ప్రమాదంలో పడ్డ స్థితిలో ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ బాధ్యత తీసుకున్నారు. చివరి మూడు మ్యాచ్‌ల్లో అదరగొట్టారు. న్యూజిలాండ్‌కు బ్యాటింగే సమస్యగా ఉంది. ఓపెనర్ల వైఫల్యం ఆ జట్టుకు పెద్ద తలనొప్పిగా మారింది. స్టార్‌ బ్యాట్స్‌మన్‌ గప్తిల్‌ టోర్నీ మొత్తంలో 167 పరుగులే చేశాడు. కివీస్‌ ఫైనల్‌ వరకు వచ్చిందంటే అది కెప్టెన్‌ విలియమ్సన్‌ పోరాట ఫలితమే. మిడిలార్డర్లో టేలర్‌, నీషమ్‌ ఓ మోస్తరుగా రాణిస్తున్నారు.  బౌలింగ్‌లో న్యూజిలాండ్‌దే పైచేయి. బౌల్ట్‌, హెన్రీ, ఫెర్గూసన్‌, శాంట్నర్‌ నిలకడగా రాణిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. సెమీస్‌లో హెన్రీ, బౌల్ట్‌, శాంట్నర్‌ ఎలా విజృంభించారో  తెలిసిందే. ఇంగ్లండ్‌ బౌలర్లు టోర్నీ  ఆరంభంలో సాధారణంగా కనిపించారు కానీ.. తర్వాత పుంజుకున్నారు. ఆర్చర్‌, వోక్స్‌, రషీద్‌ మంచి ఫామ్‌లోనే ఉన్నారు. ఏది ఏమైనా ఇరు జట్లు తొలిసారి వరల్డ్‌కప్‌ను సాధించడానికి శాయశక్తుల పోరాడతారనడంలో ఎటువంటి సందేహం లేదు. దాంతో ఆసక్తికర సమరం ఖాయం.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top