తొలి వన్డే : టీమిండియాకు మరో భారీ షాక్‌..!

New Zealand Vs India 1st ODI Team India Fined 80 Percent For Slow Over Rate - Sakshi

హామిల్టన్‌ : న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ను 5-0 తో క్లీన్‌స్వీప్‌ చేసిన టీమిండియాకు తొలి వన్డే రూపంలో షాక్‌ తగిలింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన తొలి వన్డేలో కివీస్‌ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. బ్యాటింగ్‌లో అదరగొట్టిన ఆతిథ్య జట్టు 348 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 11 బంతులు మిగిలి ఉండగానే చేధించింది. అయితే, భారీ స్కోరును కాపాడుకోలేపోయిన విరాట్‌ సేనకు స్లోఓవర్‌ రేట్‌ రూపంలో మరో భారీ షాక్‌ తగిలింది. నిర్ణీత సమయంలో ఓవర్లు వేయలేపోయిన టీమిండియా 4 ఓవర్లు ఆలస్యంగా మ్యాచ్‌ను ముగించిందని పేర్కొంటూ ఐసీసీ రిఫరీ ప్యానెల్‌ భారత ఆటగాళ్లకు పెనాల్టీ విధిస్తున్నట్టు వెల్లడించింది. టీమిండియా ఆటగాళ్ల మ్యాచ్‌ ఫీజులో 80 శాతం కోత విధిస్తున్నట్టు మ్యాచ్‌ రిఫరీ క్రిస్‌ బ్రాడ్‌ ఒక ప్రకటనలో తెలిపారు.
(చదవండి : టీమిండియాకు షాక్‌; తొలి వన్డేలో ఓటమి)

‘ఐసీసీ ప్రవర్తనా నియమావళి ఆర్టికల్‌ 2.22 ప్రకారం ప్రతి ఓవర్‌ నిర్ణీత సమయంలో పూర్తి కావాలి. లేనిపక్షంలో ఒక ఓవర్‌కు 20 శాతం చొప్పున ఆటగాళ్లు, ఆ జట్టు సిబ్బంది మ్యాచ్‌ ఫీజులో కోత తప్పదు. టీమిండియా హామిల్టన్‌లో జరిగిన తొలి వన్డేలో నాలుగు ఓవర్లు ఆలస్యంగా మ్యాచ్‌ను ముగించింది. ఫీల్డ్‌ అంపైర్లు షాన్‌ హేగ్‌, లాంగ్టన్‌ రూజర్‌, థర్డ్‌ అంపైర్‌ బ్రూస్‌ ఆక్సన్‌ఫోర్డ్‌, ఫోర్త్‌ అంపైర్‌ క్రిస్‌ బ్రోన్‌ ఫిర్యాదు మేరకు టీమిండియాకు జరిమానా తప్పలేదు’అని మ్యాచ్‌ రిఫరీ క్రిస్‌ బ్రాడ్‌ పేర్కొన్నారు. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి స్లోఓవర్‌ రేట్‌ను అంగీకరించిన నేపథ్యంలో తదుపరి వాదనలు ఉండవని రిఫరీ స్పష్టం చేశారు. ఇదిలావుండగా.. వెల్లింగ్టన్‌లో జరిగిన నాలుగో టీ20లోనూ, మౌంట్‌మాంగనీలో జరిగిన చివరి ఐదో టీ20 లోనూ స్లోఓవర్‌ రేటు కారణంగా భారత ఆటగాళ్ల మ్యాచ్‌ ఫీజులో వరుసగా.. 40 శాతం, 20 శాతం కోత విధించారు.
(చదవండి : దాదా కెప్టెన్సీ రికార్డు బద్దలు కొట్టిన కోహ్లి)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top