షెడ్యూల్‌ను గౌరవించాలి: ధోని | Need to respect the schedule: Mahendra Singh Dhoni | Sakshi
Sakshi News home page

షెడ్యూల్‌ను గౌరవించాలి: ధోని

Dec 3 2013 2:19 AM | Updated on Sep 2 2017 1:11 AM

దక్షిణాఫ్రికా పర్యటన లో ఎన్ని మ్యాచ్‌లు ఆడుతున్నామనేది ముఖ్యం కాదని, ఎన్ని మ్యాచ్‌లు ఆడినా నాణ్యత ముఖ్యమని భారత కెప్టెన్ ధోని అన్నాడు.

 జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా పర్యటనలో ఎన్ని మ్యాచ్‌లు ఆడుతున్నామనేది ముఖ్యం కాదని, ఎన్ని మ్యాచ్‌లు ఆడినా నాణ్యత ముఖ్యమని భారత కెప్టెన్ ధోని అన్నాడు. సోమవారం దక్షిణాఫ్రికా చేరగానే ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్థానిక మీడియా ఎక్కువగా షెడ్యూల్ గురించే ప్రశ్నించింది. దక్షిణాఫ్రికా బోర్డుతో బీసీసీఐ విభేదాల వల్ల మ్యాచ్‌ల సంఖ్య తగ్గడం గురించి గుచ్చి గుచ్చి ప్రశ్నలు అడిగారు. దీనికి ధోని కూడా తెలివిగా సమాధానం చెప్పాడు. ‘బోర్డు పరిపాలకుల మధ్య మ్యాచ్‌లు ఏర్పాటు చేసి ఆడుకోమని చెబితే సరిపోతుంది (నవ్వుతూ). షెడ్యూల్ ఎలా ఉందనేది ముఖ్యం కాదు.

మేం ఏడాదంతా విరామం లేకుండా ఎక్కడో చోట క్రికెట్ ఆడుతూనే ఉన్నాం. మ్యాచ్‌ల సంఖ్య కంటే మ్యాచ్‌ల నాణ్యత ముఖ్యం’ అని ధోని చెప్పాడు. బోర్డు పెద్దల మధ్య విభేదాల సంగతి తమకు తెలియదని, రెండు దేశాల క్రికెటర్ల మధ్య మాత్రం మంచి స్నేహం ఉందని చెప్పాడు. ‘ఐపీఎల్‌లో మేమంతా కలిసి ఆడుతున్నాం. ఇరు దేశాల క్రికెటర్లు మంచి స్నేహితులు’ అని చెప్పారు. ఎవరైనా ప్రేక్షకులు మీపై ఏదైనా వస్తువు విసిరితే ఏం చేస్తారని ప్రశ్నించగా... ‘ఏం చేస్తాం... తిరిగి ఇచ్చేస్తాం’ అని నవ్వుతూ అన్నాడు. ఇలాంటి విషయాలను చూసుకోవడానికి భద్రతా సిబ్బంది ఉంటారని ధోని బదులిచ్చాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement