విజయంతో ముగించాడు

Lewis Hamilton Cruises To 11th Win Of F1 Championship Season - Sakshi

అబుదాబి గ్రాండ్‌ప్రి విజేత హామిల్టన్‌

సీజన్‌లో 11 టైటిల్స్‌

అబుదాబి: పోల్‌ పొజిషన్‌తో రేసును ప్రారంభించి... అదే జోరును చివరి ల్యాప్‌ వరకు కొనసాగించి... మెర్సిడెస్‌ జట్టు డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌ 2019 ఫార్ములావన్‌ సీజన్‌ను విజయంతో ముగించాడు. ఆదివారం జరిగిన సీజన్‌లో చివరిదైన 21వ రేసు అబుదాబి గ్రాండ్‌ప్రిలో 34 ఏళ్ల హామిల్టన్‌ చాంపియన్‌గా నిలిచాడు. 55 ల్యాప్‌ల ఈ రేసును హామిల్టన్‌ గంటా 34 నిమిషాల 05.715 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. వెర్‌స్టాపెన్‌ (రెడ్‌బుల్‌) రెండో స్థానంలో... లెక్‌లెర్క్‌ (ఫెరారీ) మూడో స్థానంలో నిలిచారు. కెరీర్‌లో 88వ సారి రేసును ‘పోల్‌ పొజిషన్‌’తో ఆరంభించిన హామిల్టన్‌ ఈ సీజన్‌లో 11వ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. సీజన్‌లో రెండు రేసులు మిగిలి ఉండగానే ప్రపంచ డ్రైవర్స్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ను ఖాయం చేసుకున్న హామిల్టన్‌ మొత్తం 413 పాయింట్లు సాధించాడు. బొటాస్‌ (మెర్సిడెస్‌–326 పాయింట్లు) రెండో స్థానంలో ... వెర్‌స్టాపెన్‌ (278 పాయింట్లు) మూడో స్థానంలో నిలిచారు.

►3 ఈ ఏడాది ఫార్ములావన్‌ సీజన్‌లో పాల్గొన్న 10 జట్లలో మూడు జట్లు మాత్రమే టైటిల్స్‌ సాధించాయి.

►5 ఈ ఏడాది ఫార్ములావన్‌ సీజన్‌లో మొత్తం 21 రేసులు జరిగాయి. అయితే ఐదుగురు డ్రైవర్లు మాత్రమే కనీసం ఒక్కో టైటిల్‌ సాధించగలిగారు. హామిల్టన్‌ 11 టైటిల్స్‌ నెగ్గాడు. బొటాస్‌ 4 టైటిల్స్, వెర్‌స్టాపెన్‌ 3 టైటిల్స్, లెక్‌లెర్క్‌ 2 టైటిల్స్, వెటెల్‌ ఒక టైటిల్‌
గెలిచారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top