రికార్డులు ‘కింగ్‌’ కోహ్లి

Kohli Smashes Record For Fastest To 11000 ODI Runs - Sakshi

ఏమని చెప్పినా.. ఎంతని పొగిడినా అతని గురించి తక్కువే.. క్రికెట్‌ కోసమే అతడు పుట్టాడేమో అనే అనుమానం కలిగించే ఆట అతడి సొంతం.. అతడి ఆట చూసి అసూయపడని క్రికెటర్‌ ఉండకపోవచ్చు. ఇక ఈ ఆటగాడి శకంలో మేము ఆడనందుకు సంతోషిస్తున్నామని అనుకోని మాజీ దిగ్గజ బౌలర్లు ఉండకపోవచ్చు. అతడికి సాధ్యం కానిది ఏమీ లేదు అంటే అతిశయోక్తి కాదు. మరికొంత కాలం అతడి ఆట ఇలాగే కొనసాగితే సాధించేందుకు రికార్డులు, భవిష్యత్‌లో సాధించే ఆటగాళ్లు బహుశా ఉండకపోవచ్చు. ప్రపంచకప్‌లో భాగంగా దాయాది పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మరో అద్భుతమైన ఘనతను అందుకున్నాడు.

మాంచెస్టర్‌ : టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి అంతర్జాతీయ క్రికెట్‌లో రికార్డుల రారాజు. అతడి రికార్డులు, ఘనతల గురించే చెప్తే ఒడిసేది కాదు.. రాస్తే పుస్తకం సరిపోదు. ఇప్పటికే లెక్కలేనన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకున్న టీమిండియా పరుగుల యంత్రం తాజాగా మరో ఘనతన తన పేరిట లిఖించుకున్నాడు. ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 57 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద 11,000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ క్రమంలో పలు రికార్డులను కోహ్లి బద్దలుకొట్టాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన 11 ఏళ్లలోపే ఈ మైలురాయిని అందుకున్న తొలి క్రికెటర్‌గా రికార్డు సాధించాడు. వన్డేల్లో 11వేల పరుగుల మైలురాయిని సచిన్ టెండూల్కర్ 276 ఇన్నింగ్స్‌ల్లో అందుకోగా.. తాజాగా విరాట్ కోహ్లి కేవలం 222 ఇన్నింగ్స్‌ల్లోనే చేరుకుని ఆ రికార్డ్‌ని బ్రేక్ చేశాడు. సచిన్ తర్వాత రికీ పాంటింగ్ (286 ఇన్నింగ్స్‌లు), సౌరవ్ గంగూలీ (288) టాప్-4లో కొనసాగుతున్నారు. ఇప్పటికే 10వేల పరుగుల మైలురాయిని కూడా వేగంగా(205 ఇన్నింగ్స్‌లు) అందుకున్న క్రికెటర్‌గా రికార్డుల్లో కోహ్లీ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక కోహ్లి ఇప్పటికే అందుకున్న రికార్డులను పరిశీలిస్తే..


కింగ్‌ కోహ్లి ఖాతాలో ఇప్పటికే చేరిన పలు రికార్డులు.. 

  • ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై సెంచరీ చేసిన తొలి భారత క్రికెటర్‌.
  • పదివేల పరుగులు పూర్తిచేసిన అతిచిన్న వయస్కుడిగా కోహ్లి రికార్డు నెలకొల్పాడు.
  • శ్రీలంక, వెస్టిండీస్‌లతో జరిగిన వేర్వేరు సిరీస్‌ల్లో మూడు వరుస సెంచరీలు చేసిన తొలి క్రికెటర్‌.
  • ఒక క్యాలెండ్‌ సంవత్సరంలో అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో(11) వెయ్యి పరుగులు చేసిన తొలి ఆటగాడు కోహ్లి. గతంలో దక్షిణాఫ్రికా ఆటగాడు హషీమ్‌ ఆమ్లా(15 ఇన్సింగ్స్‌లు)పేరిట ఈ రికార్డు ఉంది.
  • సారథిగా కోహ్లి టెస్టుల్లో అత్యంత వేగంగా నాలుగు వేల పరుగులు సాధించిన ఆటగాడు. అది కూడా అతితక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే(65). గతంలో బ్రయాన్‌ లారా(71 ఇన్నింగ్స్‌లు)పేరిట ఆ రికార్డు ఉండేది. 
  • ఒక టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ డబుల్‌ సెంచరీ సాధించిన తొలి సారథి.
  • ఒక క్యాలెండ్‌ సంవత్సరంలో ఆరు సెంచరీలు సాధించిన ఫస్ట్‌ కెప్టెన్‌. 
  • సారథిగా ఆరు డబుల్‌ సెంచరీలు సాధించిన తొలి క్రికెటర్‌.
  • ఓవరాల్‌గా అంతర్జాతీ క్రికెట్‌లో యాభైకి పైగా సగటుతో అత్యధిక పరుగులు, సెంచరీలు సాధించిన తొలి ఢిల్లీ క్రికెటర్‌. 
  • ఆరు ద్విశతకాలు బాదిన తొలి రైట్‌ హ్యాండ్‌ బ్యాట్స్‌మెన్‌.
  • అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక ద్విశతక భాగస్మామ్యాలు నమోదు చేసిన ఆటగాడు. రోహిత్‌ శర్మతోనే నాలుగు ద్విశతక భాగస్వామ్యాలు నమోదు చేశాడు.
Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top