భారత్‌ పంచ్‌ అదిరింది

Kavinder stuns World champ, Panghal beats Olympic champ to enter semis - Sakshi

ప్రపంచ చాంపియన్, ఒలింపిక్‌ చాంపియన్‌లపై నెగ్గిన భారత బాక్సర్లు కవిందర్, అమిత్‌

సెమీస్‌లోకి ప్రవేశంతో పతకాలు ఖాయం  ∙ క్వార్టర్స్‌లో ఓడిన లవ్లీనా, సీమా, రోహిత్‌ 

బ్యాంకాక్‌: ఆసియా సీనియర్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ల పంచ్‌ పవర్‌ కొనసాగుతోంది. పురుషుల విభాగంలో అమిత్‌ పంగల్‌ (52 కేజీలు), కవిందర్‌ సింగ్‌ బిష్త్‌ (56 కేజీలు), దీపక్‌ (49 కేజీలు)... మహిళల విభాగంలో సోనియా చహల్‌ (57 కేజీలు) సెమీఫైనల్లోకి దూసుకెళ్లి కనీసం కాంస్య పతకాలను ఖాయం చేసుకున్నారు. అయితే లవ్లీనా బొర్గోహైన్‌ (69 కేజీలు), సీమా పూనియా (ప్లస్‌ 81 కేజీలు), రోహిత్‌ టోకస్‌ (64 కేజీలు) పోరాటం క్వార్టర్‌ ఫైనల్లో ముగిసింది. 

అదే ఫలితం: సోమవారం జరిగిన బౌట్‌లలో అమిత్, కవిందర్‌ తమ అద్వితీయ ప్రదర్శనతో అదరగొట్టారు. రియో ఒలింపిక్స్‌ చాంపియన్‌ హసన్‌బాయ్‌ దస్మతోవ్‌ (ఉజ్బెకిస్తాన్‌)పై అమిత్‌... ప్రపం చ చాంపియన్‌ కైరాట్‌ యెరాలియెవ్‌ (కజకిస్తాన్‌)పై కవిందర్‌ అద్భుత విజయాలు సాధించారు. గతేడా ది జకార్తా ఆసియా క్రీడల ఫైనల్లో దస్మతోవ్‌ను ఓడించి స్వర్ణం నెగ్గిన అమిత్‌ ఈసారీ అదే ఫలితాన్ని పునరావృతం చేశాడు. తొలి రౌండ్‌ నుంచే పక్కా ప్రణాళికతో దూకుడుగా ఆడిన అమిత్‌ 4–1తో దస్మతోవ్‌ను ఓడించాడు. ఇటీవలే ఫిన్‌లాండ్‌లో జరిగిన గీబీ అంతర్జాతీయ టోర్నీలో స్వర్ణం సాధించిన కవిందర్‌ ఫామ్‌ను కనబరుస్తూ క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ చాంపియన్‌ను బోల్తా కొట్టించాడు. తొలి రౌండ్‌లో కైరాట్‌ ఆధిపత్యం చలాయించినా... తదుపరి రెండు రౌండ్‌లలో కవిందర్‌ తన ప్రత్యర్థి పంచ్‌లను కాచుకొని అవకాశం దొరికినపుడల్లా ఎదురుదాడి చేశాడు. చివరకు కవిందర్‌ను 3–2తో విజయం వరించింది. దీపక్‌ సింగ్‌తో క్వార్టర్‌ ఫైనల్లో తలపడాల్సిన అఫ్గానిస్తాన్‌ బాక్సర్‌ రామిష్‌ రహ్మాని గాయం కారణంగా బరిలోకి దిగలేదు. దాంతో దీపక్‌ను విజేతగా ప్రకటించారు. మహిళల 57 కేజీల క్వార్టర్‌ ఫైనల్లో జో సన్‌ వా (కొరియా)పై సోనియా 3–2తో విజయం సాధించి సెమీస్‌ బెర్త్‌ ఖాయం చేసుకుంది. ఇతర క్వార్టర్‌ ఫైనల్స్‌లో లవ్లీనా 0–5తో చెన్‌ నియెన్‌–చిన్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో... సీమా పూనియా 0–5తో యాంగ్‌ జియోలి (చైనా) చేతిలో... రోహిత్‌ 2–3తో చిన్‌జోరిగ్‌ బాతర్‌సుక్‌ (మంగోలియా) చేతిలో ఓడిపోయారు.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top