వచ్చి రాగానే ర్యాంక్‌ లాగేసుకున్నాడు

India lose top ODI spot to South Africa in latest ICC rankings

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) వన్డే ర్యాంకింగ్స్‌లో దక్షిణాఫ్రికా టాప్ ప్లేస్ ను దక్కించుకుంది. ఈ మేరకు ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో సఫారీలు ప్రథమ స్థానానికి చేరగా, టీమిండియా రెండో ర్యాంకు పరిమితమైంది. బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ ను ఇంకా వన్డే మిగిలి ఉండగానే చేజిక్కించుకున్న సఫారీలు అగ్రస్థానాన్ని సైతం కైవసం చేసుకున్నారు. ఆస్ర్టేలియాపై 4-1తో సిరీస్‌ విజయం సాధించిన కోహ్లీసేన ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకోగా.. అది మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న సిరీస్‌లో వరుస విజయాలు సాధిస్తున్న సఫారీ జట్టు తిరిగి తొలి స్థానాన్ని చేజిక్కించుకుంది. ఇరు జట్లు 120 పాయింట్లతో ఉన్నప్పటికే దశాంశాలు తేడాతో సౌతాఫ్రికా తొలిస్థానంలో కొనసాగుతోంది. టీమిండియా తిరిగి అగ్రస్థానాన్ని అందుకోవాలంటే ఈ నెల 22 నుంచి న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌లో తమ ఫామ్‌ను కొనసాగించాల్సిందే. 
 
ఇక బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్‌ విషయానికి వస్తే.. వచ్చిరాగానే అద్భుతమైన సెంచరీతో చెలరేగిన ఏబీ డెవిలియర్స్‌ మొదటి స్థానాన్ని దక్కించుకోగా.. రన్‌ మెషీన్‌ విరాట్‌ కోహ్లీ రెండో స్థానానికి పడిపోయాడు.కెప్టెన్‌తో పాటు ఓపెనర్‌ రోహిత్‌శర్మ మాత్రమే టాప్‌ టెన్‌లో ఉన్నాడు. గతంలో కంటే రెండు స్థానాలు కోల్పోయిన రోహిత్‌ శర్మ ప్రస్తుతం ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు.

ఇక బౌలింగ్‌ విభాగంలో.. టీమిండియా నుంచి టాప్‌ టెన్లో ఇద్దరు బౌలర్లకు చోటు దక్కింది. డెత్‌ ఓవర్స్‌ స్పెషలీస్ట్‌ జస్పీత్‌ బూమ్రాకు ఆరోస్థానం దక్కగా.. స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ ఎనిమిదో స్థానంలో  ఉన్నాడు. ఈ విభాగంలో తొలి స్థానాన్ని పాకిస్తాన్‌కు చెందిన హసన్‌అలీ చేజిక్కించుకున్నాడు. ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో ఇప్పటికే 9 వికెట్లు తీసి మాంచి ఊపు మీద ఉన్న హసన్‌ అలీ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తొలి స్థానాన్ని దక్కించుకోవడం ఇదే తొలిసారి.. కాగా.. ఈ ఏడాది ఇప్పటివరకు ఐదుగురు బౌలర్లు మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top