టాప్‌ నీదా.. నాదా: కోహ్లి వర్సెస్‌ రోహిత్‌

Ind vs WI: Kohli, Rohit Set To Resume Race To The Top - Sakshi

హైదరాబాద్‌:  ప్రస్తుత భారత క్రికెట్‌ జట్టులో అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్‌ ఎవరంటే అది కచ్చితంగా విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మలే. వీరిద్దరూ అంతర్జాతీయ క్రికెట్‌లో పరుగుల మోత మోగిస్తూ రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతున్నారు. అలాంటిది వీరి మధ్య ఒక ఆసక్తికర పోరుకు విండీస్‌-భారత్‌ల టీ20 సిరీస్‌ వేదిక కానుంది. ఇప్పటివరకూ రోహిత్‌ శర్మ తన అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో 93 ఇన్నింగ్స్‌ల్లో 2,539 పరుగుల సాధించాడు. దాంతో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా ఉన్నాడు. ఇక కోహ్లి 67 టీ20 ఇన్నింగ్స్‌ల్లో 2,450 పరుగులు సాధించి రెండో స్థానంలో ఉన్నాడు.(ఇక్కడ చదవండి: భారత జట్టు ‘ఛేజ్‌ డ్రిల్‌’)

అంతర్జాతీయ టీ20ల్లో రోహిత్‌-కోహ్లిలే పరుగుల పరంగా టాప్‌-2 స్థానాల్లో వరుసగా ఉండటంతో నంబర్‌ వన్‌ స్థానంపై ఆసక్తి నెలకొంది. మరి రోహిత్‌ తన పరుగుల వేటను సాగించి తన టాప్‌ను నిలబెట్టుకుంటాడా.. లేక కోహ్లి పరుగుల మోత మోగించి రోహిత్‌ను అధిగమిస్తాడా అనే దానిపై అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఏది ఏమైనా భారత్‌-విండీస్‌ల పోరు కంటే కూడా కోహ్లి-రోహిత్‌ల పోరు ఈ సిరీస్‌లో అత్యంత ఆసక్తికరంగా కానుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ జాబితాలో మూడో స్థానంలో న్యూజిలాండ్‌ క్రికెటర్‌ మార్టిన్‌ గప్టిల్‌(2436) ఉన్నాడు.

ఇదిలా ఉంచితే,  అంతర్జాతీయ టీ20ల్లో అత్యధికంగా యాభైకి పరుగులు సాధించిన జాబితాలో రోహిత్‌-కోహ్లిలు నువ్వా-నేనా అన్నట్లు తలపడుతున్నారు. వీరిద్దరూ 22సార్లు యాభైకి పరుగులు సాధించి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. ఇందులో రోహిత్‌ శర్మ 18 హాఫ్‌ సెంచరీలు, 4 సెంచరీలతో 22సార్లు యాభైకి పైగా పరుగుల్ని సాధించగా, కోహ్లి సాధించినవి 22 హాఫ్‌ సెంచరీలుగా ఉన్నాయి. అటు తర్వాత మార్టిన్‌ గప్టిల్‌(17) మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top