మెరిసిన స్మృతి మంధాన.. ఆసీస్‌ లక్ష్యం 168

ICC Womens World Cup 2018 India Scored 167 Runs Against Australia - Sakshi

ప్రొవిడెన్స్‌ (గయానా): మహిళల టీ20 ప్రపంచప్‌లో భాగంగా గ్రూప్‌ ‘బి’ చివరి లీగ్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు టీమిండియా 168 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. స్మృతి మంధాన (83; 55 బంతుల్లో 9ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగగా, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌( 43; 27 బంతుల్లో 3ఫోర్లు, 3 సిక్సర్లు) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది.  టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన భారత్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగలింది. సీనియర్‌ ప్లేయర్‌ మిథాలీ రాజ్‌కు విశ్రాంతినివ్వడంతో ఒపెనర్‌గా వచ్చిన వికెట్‌కీపర్‌ తానియా భాటియా (2) పూర్తిగా నిరాశ పరిచింది. అనంతర క్రీజులోకి వచ్చిన రోడ్రిగ్స్‌ (6) కూడా తక్కువ స్కొర్‌కే వెనుదిరిగింది. 

మంధాన, హర్మన్‌ప్రీత్‌ ధనాధన్‌
ఓ వైపు వికెట్లు పడుతున్నా స్టార్‌ ఓపెనర్‌ మంధాన తనదైన రీతిలో చెలరేగిపోయింది. అగ్నికి వాయువు తోడైనట్టు మంధానకు హర్మన్‌ప్రీత్‌ జత కలిసింది. ఇద్దరూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. వీరిద్దరి జోరుకు స్కోర్‌ బోర్డు పరుగులు పెట్టింది. ఈ క్రమంలో మంధాన టీ20ల్లో ఆరో అర్థ సెంచరీ పూర్తి చేసుకుంది.  అయితే వీరిద్దరి వీరవిహారానికి స్కోర్‌ 200 దాటుతుందా అనిపించింది. కానీ భారీ షాట్‌ ఆడే ప్రయత్నంలో హర్మన్‌ ప్రీత్‌ వెనుదిరగగా, అనంతరం క్రీజులోకి వచ్చిన వారు ఘోరంగా విఫలమయ్యారు. వేద కృష్ణమూర్తి(3), హేమలత(1), దీప్తి(8) వెంటవెంటనే వెనుదిరిగారు. అయితే చివర్లో సెంచరీ సాధిస్తుందనుకున్న తరుణంలో మంధాన భారీ షాట్‌ ఆడే  ప్రయత్నంలో వెనుదిరిగింది. ఆసీస్‌ ఆటగాళ్లలో పెర్రీ(3/16), కిమిన్సే(2/42), గార్డనర్‌(2/25)లు రాణించారు. 
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top