గుర్తుండిపోయే ‘నైట్‌ వాచ్‌మ్యాన్‌’ ఇన్నింగ్స్‌

On This Day In 2006, A Nightwatchman Hit Double Century - Sakshi

చివరిటెస్టులో రికార్డు బ్యాటింగ్‌

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా మాజీ బౌలర్‌ జాసన్‌ గిలెస్పీకి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 1996-2006 మధ్య కాలంలో ఆస్ట్రేలియా క్రికెట్‌ పేస్‌ దళంలో కీలక పాత్ర పోషించాడు. ఆసీస్ తరపున గిలెస్పీ 71 టెస్టులు, 97 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 259 వికెట్లు, వన్డేల్లో 142 వికెట్లను గిలెస్పీ సాధించాడు. ఇక బిగ్‌బాష్‌ లీగ్‌లో అడిలైడ్‌ స్టైకర్స్‌కు చీఫ్‌ కోచ్‌గా గిలెస్పీ చేశాడు. అయితే గిలెస్పీ పేరిట అరుదైన రికార్డు ఉంది. కేవలం బౌలర్‌గా మాత్రమే తెలిసిన గిలెస్పీ ఒక బ్యాటింగ్‌ రికార్డును కూడా సాధించాడు. అది కూడా డబుల్‌ సెంచరీ రికార్డు. ఒక నైట్‌వాచ్‌ మ్యాన్‌గా దిగి అత్యధిక స్కోరు సాధించిన రికార్డు ఇప్పటికీ గిలెస్పీ పేరిటే ఉంది. అది జరిగి నేటికి సరిగ్గా 14 ఏళ్లు అయ్యింది. (రోహిత్‌ క్రికెటర్‌ కాదన్న పఠాన్‌.. సమర్థించిన షమీ)

2006, ఏప్రిల్‌ 19 వ తేదీన గిలెస్పీ ఈ ఫీట్‌ నమోదు చేశాడు. బంగ్లాదేశ్‌తో చిట్టగాంగ్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో మూడో రోజు ఆట కాసేపట్లో ముగుస్తుందనగా మాథ్యూ హేడెన్‌ ఔటయ్యాడు. దాంతో నైట్‌వాచ్‌ మ్యాన్‌ పాత్రలో గిలెస్పీని పంపించారు. ఆరోజు మరో వికెట్‌ ఇవ్వకుండా ఉండటం కోసం గిలెస్పీని ఆసీస్‌ పంపితే, అతను ఆ ఆ తదుపరి రోజంతా క్రీజ్‌లో ఉండి డబుల్‌ సెంచరీతో మెరిశాడు. 425 బంతుల్ని ఎదుర్కొన్న గిలెస్పీ 26 ఫోర్లు, 2 సిక్స్‌లతో అజేయంగా 201 పరుగులు చేసి ఆసీస్‌ను పటిష్ట స్థితిలో నిలిపాడు. అతనికి జతగా మైక్‌ హస్సీ(182) కూడా రాణించడంతో ఆసీస్‌ 581 పరుగుల వద్ద తమ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. దాంతో ఆసీస్‌కు 384 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. ఆపై బంగ్లాదేశ్‌ తన రెండో ఇన్నింగ్స్‌లో 304 పరుగులకు ఆలౌట్‌ కావడంతో ఆసీస్‌ ఇన్నింగ్స్‌ తేడాతో విజయం సాధించింది. ఆసీస్‌ ఇన్నింగ్స్‌ విజయం సాధించడానికి గిలెస్పీ విశేషంగా రాణించడమే ఒక కారణంగా కాగా, అతని కెరీర్‌ చివరి టెస్టులో ఈ రికార్డు సాధించడం మరో విశేషం.(అప్పుడు రైనాకే ధోని ఓటేశాడు: యువీ)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top