క్రొయేషియా జట్టుకు బ్రహ్మరథం.. సంబరాల్లో దేశం

Croatia football Team Gets Grand Welcome - Sakshi

ఫుట్‌బాల్‌ ప్రపంచ కప్‌-2018 తుదిపోరులో ఫ్రాన్స్‌ చేతిలో ఓటమిపాలైనా అభిమానుల హృదయాలు కొల్లగొట్టిన క్రొయేషియా జట్టుకు స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. ఊహించని రీతిలో దేశ అధికారులు, అభిమానులు తమ ఆటగాళ్లకు ఘన స్వాగతం పలకడాన్ని ఎంతో గౌరవంగా భావించారు. గోల్డెన్‌ బాల్‌ (బెస్ట్‌ ప్లేయర్‌) అందుకున్న లుకా మోడ్రిచ్‌తో కరచాలనం చేసేందుకు క్రొయేషియా వాసులు పోటీపడ్డారు. దేశ రాజధాని జాగ్రిబ్‌ నగరంలో ఓపెన్‌ టాప్‌ బస్సులో వచ్చిన ఆటగాళ్లకు కరతాళ ధ్వనులతో, ప్లేయర్ల పేర్ల నినాదాలతో గ్రాండ్‌ వెల్‌కమ్‌ పలికారు. ఆటగాళ్ల రాక సందర్భంగా దేశంలోని ప్రధాన నగరాల కూడళ్లలో క్రొయేషియా జాతీయ గీతాన్ని ఆలపించి వారు సాధించిన ఘనతకు అసలుసిసలైన గుర్తింపునిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

సరిగ్గా 50 లక్షల జనాభా కూడా లేని క్రొయేషియా పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. అందుకు కారణం రష్యాలో జరిగిన సాకర్‌ ప్రపంచకప్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలో దిగి, దిగ్గజ జట్లను మట్టికరించడమే. అయితే ఫైనల్లో పటిష్ట ఫ్రాన్స్‌ జట్టుతో చివరివరకూ పోరాడిన క్రొయేషియా ఆటగాళ్లు దేశంలో సూపర్‌ స్టార్లయ్యారు. ఇప్పుడు క్రొయేషియాలో ఎక్కడ చూసినా ఫుట్‌బాల్‌ ఆటగాళ్ల ఘనత గురించే. వరల్డ్‌కప్‌ చరిత్రలో ఇప్పటివరకు ఫైనల్‌ చేరిన జట్లలో క్రొయేషియా (20)దే పెద్ద ర్యాంకు.. అయినా అసాధారణ ఆటతీరుతో ఆ ప్లేయర్లు జననీరాజనాలు అందుకుంటున్నారు. ఒకవేళ క్రొయేషియా కప్‌ నెగ్గి ఉంటే.. అత్యధిక ర్యాంకుతో బరిలోకి కప్‌ సాధించిన జట్టుగా నిలిచి ఫ్రాన్స్‌ పేరిట ఉన్న రికార్డును తిరగరాసేది. 1998 వరల్డ్‌ కప్‌లో ఫ్రాన్స్‌ 18వ ర్యాంకుతో బరిలో దిగి టైటిల్‌ నెగ్గడం విశేషం.

మరోవైపు అధ్యక్షురాలు కొలిండా గ్రాబర్‌ సైతం దేశ ప్రజల మనసుల్ని గెలిచారు. ఫైనల్లో జట్టు ఓటమిని జీర్ణించుకోలేక ఏడుస్తున్న క్రొయేషియా కెప్టెన్‌ లుకా మోడ్రిక్‌ కన్నీళ్లు తుడిచి.. లీడర్‌ అంటే ఎలా ఉండాలో నేర్పారు. విజయం సాధించినప్పుడు సంబరాల్లో పాల్గొన్న ఆమె.. జట్టు ఓడిన సమయంలోనూ వారి వెన్నంటే నిలిచారు.

ఆమెను చూసి ప్రపంచం నేర్చుకోవాలి!

క్రొయేషియా.. మేనియా!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top