క్రొయేషియా.. మేనియా!

Croatia .. Mania! - Sakshi

సాకర్‌ ఫీవర్‌లో ఇప్పుడందరి మాట ఇదే

జాగ్రెబ్‌: క్రొయేషియా.. 50 లక్షల జనాభా కూడా లేని ఈ దేశం పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. రష్యాలో జరుగుతున్న సాకర్‌ ప్రపంచకప్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలో దిగి, దిగ్గజ జట్లను మట్టికరిపిస్తూ ఫైనల్‌ చేరి ఆ దేశ జట్టు పెను సంచలనమే సృష్టించింది. ఆదివారం ఫ్రాన్స్‌తో జరిగే ఆఖరి పోరాటానికి సిద్ధమైంది. బుధవారం ఇంగ్లండ్‌ను సెమీఫైనల్‌లో ఓడించినప్పటి నుంచి నెటిజన్లు ఎక్కువగా అన్వేషిస్తున్నది క్రొయేషియా గురించే కావడం గమనార్హం. చరిత్రలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న ఈ చిన్న దేశం గురించి కొన్ని వివరాలు..

పురాతన చారిత్రక నేపథ్యం..
ఆరు నుంచి 14వ శతాబ్దం వరకు క్రొయేషియన్లు అనేక ఒడిదుడుకులు చవిచూశారు. 1527లో ఒట్టోమన్‌ చక్రవర్తుల ఆక్రమణల నేపథ్యంలో క్రొయేషియన్‌ పార్లమెంట్‌ ఫెర్డినాండ్‌ను తమ అధినేతగా ఎన్నుకుంది. 1918 తొలి ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత సెర్బ్‌లు, స్లోవియన్లతో కలిసి క్రొయేషియన్లు యుగోస్లావియా రాజ్యాన్ని స్థాపించారు. సొంతంగా దేశం ఏర్పాటు చేసుకోవాలన్న ఆకాంక్షల మధ్య తలెత్తిన గందరగోళ పరిస్థితుల్లో 1929లో రాజు అలెగ్జాండర్‌ పార్లమెంట్‌ను పక్కనపెట్టి నియంతృత్వ పాలన సాగించాడు. 1941, ఏప్రిల్‌ 6న జర్మనీ బలగాలు దాడిచేసి క్రొయేషియా రాజ్యాన్ని ఆక్రమించుకుని ఫాసిస్టు నాయకుడు ఉస్టేన్‌ నేతృత్వంలో కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాయి.

రెండో ప్రపంచయుద్ధం ముగిసిన తరువాత టిటో నేతృత్వంలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడింది. 1980లో టిటో కన్ను మూశాక, 1989 నాటికి తూర్పు ఐరోపాలోని అనేక దేశాల్లో కమ్యూనిస్ట్‌ పాలన అంతమైంది. 1991లో క్రొయేషియన్లు స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నారు. క్రొయేషియా సరిహద్దుల్లో నివసిస్తున్న సెర్బ్‌ల రక్షణ పేరుతో యుగోస్లావియా సైన్యం దేశంలోకి చొచ్చుకురావడం సుదీర్ఘ యుద్ధానికి దారి తీసింది. 1992 జనవరి 15న క్రొయేషియాను ఐరోపా మండలి గుర్తించింది. ఎర్తుట్‌ ఒప్పందం వల్ల 1995లో ఆ యుద్ధం ముగిసింది. 1998 వరకు ఐరాస కింద ఉన్న తూర్పు స్లొవోనియాను క్రొయేషియాకు అప్పగించారు. 2009లో నాటో కూటమిలో, 2013లో ఐరోపా మండలిలో చేరింది.

పొంచి ఉన్న సవాళ్లు..
ప్రస్తుతం క్రొయేషియా ఆర్థిక వ్యవస్థ కొన్ని సవాళ్లు ఎదుర్కొంటోంది. ఇతర దేశాల నుంచి వస్తున్న వలసలతో పాటు యువతలో 43 శాతం నిరుద్యోగం దేశాన్ని పట్టిపీడిస్తోంది. కమ్యూనిజం నుంచి ఇప్పుడిప్పుడే పెట్టుబడిదారీ విధానంవైపు అడుగులేస్తోంది. ఈయూ, ఐరాస, కౌన్సిల్‌ ఆఫ్‌ యూరోప్, నాటో, డబ్ల్యూటీవోలలో సభ్యదేశంగా కొనసాగుతోంది. ఐరాస శాంతి పరిరక్షక దళంలో కీలకపాత్ర పోషిస్తోంది. దేశ ఆర్థికవ్యవస్థలో సేవా, పారిశ్రామిక, వ్యవసాయ, పర్యాటక రంగాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ప్రపంచంలోని టాప్‌–20 పర్యాటక ప్రాంతాల్లో క్రొయేషియా ఒకటిగా ఉంది.

ఆసక్తికర విషయాలు...
► జనాభా: 41,63,968 (ఐరాస గణాంకాల ప్రకారం)
► జన సాంద్రత: చ.కి.మీకు 74 మంది
► వైశాల్యం: 55,960 చ.కి.మీ.లు
► పట్టణ జనాభా: 60.60 శాతం
►  ప్రపంచంలోనే అతి చిన్న పట్టణం (17–23 మంది మాత్రమే నివసిస్తారు) ‘హమ్‌’ ఇక్కడే ఉంది.
► అత్యంత సుందరమైన సూర్యాస్తమయాన్ని ఇక్కడి డాల్‌మేషియాలోని ‘జడర్‌’లో వీక్షించవచ్చు.
►  ప్రపంచ ప్రసిద్ధి చెందిన ‘డాల్‌మేషియన్‌’ శునకాల మూలాలు 17వ శతాబ్దంలో ఇక్కడే బయటపడ్డాయి.
►  క్రొయేషియాలో ఎనిమిది జాతీయ పార్కులు, 11 నేచర్‌ పార్కులు, రెండు నేచర్‌ రిజర్వులున్నాయి.
►  హెచ్‌బీఓ సిరీస్‌ ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’ను డాల్‌మేషియన్‌ తీరంలో చిత్రీకరిస్తున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top