ఆమెను చూసి ప్రపంచం నేర్చుకోవాలి!

Croatias President Taught the World About Leadership - Sakshi

గత నెలన్నర రోజులుగా సాగిన  ఫిఫా ప్రపంచకప్‌ ముగిసింది. అంచనాలు లేని జట్టు టైటిల్‌ కైవసం చేసుకోగా... అనామక జట్టు శక్తివంచన లేకుండా పోరాడి ఓడింది. పోరాడి ఓడిన ఆ అనామక జట్టు దేశ అధ్యక్షురాలు ఇప్పుడు ప్రపంచానికే స్పూర్తిదాయకంగా నిలిచారు. ఆ అనామక జట్టు క్రొయేషియా అయితే ఆ దేశ అధ్యక్షురాలు కొలిండా గ్రాబర్‌-కిటారోవిక్‌. మన హైదరాబాద్‌ నగరంలో సగం కూడా (50 లక్షలు) జనాభా లేని ఆ దేశం సంచలనాలు సృష్టిస్తూ ఫిఫా ప్రపంచకప్‌ ఫైనల్లోకి దూసుకెళ్లడం గమనార్హం. ఫైనల్లో ఆ జట్టు తృటిలో టైటిల్‌ చేజార్చుకున్నా.. ఆ దేశ అధ్యక్షురాలి ప్రదర్శన మాత్రం ప్రపంచం గర్వించేలా మిన్నంటింది. ఆమెను చూసి నాయకత్వం అంటే ఏమిటో ఇప్పుడు ప్రపంచానికే బోధపడింది.

736 మంది ఆటగాళ్లు 32 జట్లతో 31 రోజుల పాటు పోరాడి నెగ్గిన రెండు జట్లు తుదిసమరానికి సిద్దమైన సమయం. విజయం ఎవరిని వరిస్తుందా అని నరాలు తెగేంతా ఉత్కంఠకర ఫైనల్‌ మ్యాచ్‌.. మరోవైపు పలు దేశ అధ్యక్షులు ఆసీనులైన సందర్భం. మ్యాచ్‌ ప్రారంభమైంది. కానీ అందరీ చూపు వీఐపీ గ్యాలరీవైపే. అవును అక్కడ  ఎరుపు తెలుపు రంగులతో కూడిన టీషర్టులు ధరించిన జట్టు జెర్సీతో క్రొయేషియా దేశ అధ్యక్షురాలు గ్రాబర్‌ కిటారోవిక్‌ సందడి చేస్తున్నారు. ఏ రేంజ్‌లో అంటే గంతులేస్తూ మరీ తమ జట్టుకు దగ్గరుండి మద్దతు తెలుపున్నారు. కానీ పోరాడిన క్రోయేషియా చివరకు ఓటమిని చవిచూసింది. ఫ్రాన్స్‌ విశ్వవిజేతగా నిలిచింది. చమర్చిన కన్నీళ్లతో అభిమానుల భావోద్వేగానికి గురయ్యారు. అంతటి ఉద్విగ్ఘమై క్షణాల్లో ఎవరైనా ఓటమిని జీర్ణించుకోలేక అసహనం, అసంతృప్తి, ఆవేదన వంటివెన్నో వ్యక్తం చేస్తారు. కానీ అలా చేస్తే ఆమె క్రొయేషియా అధ్యక్షురాలు ఎలా అవుతారు. అవును ఏమాత్రం దిగులు చెందని ఆమె తమ జట్టుకు అండగా నిలిచారు. ఓడిన జట్టుకు ఆమె అందించిన ధైర్యం అందరినీ ఆశ్చర్యపరిచింది.

కెప్టెన్ కన్నీళ్లు తుడిచిన అధ్యక్షురాలు
తన అద్భుత ప్రదర్శనతో ముందుండి ఫైనల్‌కు చేర్చిన క్రొయేషియా జట్టు కెప్టెన్‌ లుకా మోడ్రిక్ ఓటమిని జీర్ణించుకోలేక కన్నీటి పర్యంతమయ్యాడు. ఇది చూసిన ఆ దేశాధ్యక్షురాలు అతడి దగ్గరికి వచ్చి కన్నీళ్లు తుడిచారు. బాధపడొద్దని ఓదార్చారు. ఈ ఘటన అభిమానులందరికి ఉద్వేగానికి గురిచేయగా.. ఆమె పక్కన నిలుచున్న ఇతర దేశ అధ్యక్షులను చప్పట్లతో అభినందించేలా చేసింది. మరోవైపు జోరు వాన కురుస్తున్నా.. ఆతిథ్య దేశపు అధ్యక్షుడు గొడుగుతో మైదానంలోకి వచ్చినా ఆమె మాత్రం అలానే ఆ వర్షంలో తడుస్తూ.. బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతేకాకుండా ఇరు జట్ల ఆటగాళ్లను ఆప్యాయంగా హత్తుకుని అభినందించారు.

ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్‌తో కలసి క్రొయేషియా ఆటగాళ్ల డ్రెస్సింగ్ రూమును సందర్శించారు. ఓటమితో దిగులు చెందుతున్న వారిని అభినందిస్తూ భరోసానిచ్చారు. ఇది చూసినప్పుడు దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు, దివంగత నేత నెల్సెన్‌ మండేలా చెప్పిన ‘కష్టాలు ఉన్నప్పుడే నాయకుడిగా ముందుండాలి.. అప్పుడే మీ నాయకత్వానికి విలువ ఉంటుంది’  అనే మాటలు గుర్తొస్తాయి. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తోంది. అధ్యక్షురాలు కాకమందు.. ఆమె పుల్‌బ్రైట్‌ స్కాలర్‌, అమెరికాకు అంబాసిడర్‌, నాటో అసిస్టెంట్‌ సెక్రటరీగా పనిచేశారు. ప్రస్తుతం క్రొయేషియా అధ్యక్షురాలిగా తూర్పు యూరోపియన్‌ ఆర్థిక వ్యవస్థలో తమ దేశాన్ని ముందంజలో నిలుపుతున్నారు. ఆమె 2015లో తొలిసారి ఆ దేశ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.

చదవండి: విశ్వవిజేత ఫ్రాన్స్‌

భూతల స్వర్గం క్రొయేషియా

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top