
కల్యాణి (బెంగాల్): రంజీ ట్రోఫీ సీజన్‌లో హైదరాబాద్‌కు ఐదో పరాజయం... మూడో రోజే ముగిసిన మ్యాచ్‌లో మంగళవారం బెంగాల్ జట్టు ఇన్నింగ్స్, 303 పరుగుల తేడాతో హైదరాబాద్‌ను చిత్తుగా ఓడించింది. 464 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కోల్పోయి ఫాలోఆన్ ఆడిన హైదరాబాద్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 161 పరుగులకే ఆలౌటైంది. టి. రవితేజ (53) అర్ధ సెంచరీ చేయగా, మిగిలిన వారంతా విఫలమయ్యారు. ఆకాశ్‌దీప్ 4 వికెట్లతో ప్రత్యరి్థని దెబ్బ తీశాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 83/5తో ఆట కొనసాగించిన హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 171 పరుగులకే కుప్పకూలింది. జావీద్ అలీ (72) ఒక్కడే కొంత ప్రతిఘటించాడు. బెంగాల్ లెఫ్టార్మ్ స్పిన్నర్ షహబాజ్ అహ్మద్ (4/26) ‘హ్యాట్రిక్’ నమోదు చేయడం విశేషం. ఇన్నింగ్స్ 47వ ఓవర్లో వరుస బంతుల్లో అతను జావీద్ అలీ, రవికిరణ్, సుమంత్‌లను అవుట్ చేశాడు.