సాయి ప్ర‌ణీత్ సంచ‌ల‌నం

B Sai Praneeth stuns Olympic champion Chen Long to move to Swiss Open final - Sakshi

రియో ఒలింపిక్స్‌ చాంపియన్‌  చెన్‌ లాంగ్‌పై విజయం

స్విస్‌ ఓపెన్‌ లో టైటిల్‌ పోరుకు అర్హత

నేటి ఫైనల్లో   షి యుకితో అమీతుమీ

బాసెల్‌ (స్విట్జర్లాండ్‌): స్విస్‌ ఓపెన్‌  వరల్డ్‌ టూర్‌ సూపర్‌–300 బ్యాడ్మింటన్‌  టోర్నమెంట్‌లో తెలుగు తేజం భమిడిపాటి సాయిప్రణీత్‌ పెను సంచలనం సృష్టించాడు. అంచనాలకు మించి రాణించి... రియో ఒలింపిక్స్‌ చాంపియన్‌ , ప్రపంచ ఐదో ర్యాంకర్‌ చెన్‌ లాంగ్‌ను బోల్తా కొట్టించి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో ప్రపంచ 22వ ర్యాంకర్‌ సాయిప్రణీత్‌ 21–18, 21–13తో రెండు సార్లు ప్రపంచ చాంపియన్‌గా, ఒకసారి ఆసియా చాంపియన్‌ గా నిలిచిన చెస్‌  లాంగ్‌ను చిత్తు చేశాడు. నేడు జరిగే ఫైనల్లో చైనాకే చెందిన ప్రపంచ రెండో ర్యాంకర్‌ షి యుకితో సాయిప్రణీత్‌ అమీతుమీ తేల్చుకుంటాడు.
 
వెనుకబడి... పుంజుకొని 
చెన్‌  లాంగ్‌తో గతంలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయిన సాయిప్రణీత్‌ మూడో ప్రయత్నంలో గెలుపొందడం విశేషం. 46 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో సాయిప్రణీత్‌ ఒకదశలో 7–11తో వెనుకబడ్డాడు. కానీ పట్టుదలతో ఆడిన ఈ హైదరాబాద్‌ ప్లేయర్‌ ఆ తర్వాత స్కోరును సమం చేయడమే కాకుండా 17–13తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అదే ఊపులో తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో గేమ్‌లో ఆరంభం నుంచే సాయిప్రణీత్‌ తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు. చెన్‌  లాంగ్‌ జోరుకు అడ్డుకట్ట వేశాడు. మొదట్లోనే 7–4తో ఆధిక్యంలోకి వెళ్లిన సాయిప్రణీత్‌ క్రమం తప్పకుండా పాయింట్లు స్కోరు చేసి ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ విజయాన్ని ఖాయం చేసుకున్నాడు.   

స్విస్‌ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరిన ఐదో భారతీయ ప్లేయర్‌గా సాయిప్రణీత్‌ గుర్తింపు పొందాడు. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్‌ (2015), హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ (2016), సమీర్‌ వర్మ (2018)... మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్‌ (2011, 2012) ఫైనల్‌కు చేరుకోవడమే కాకుండా విజేతలుగా కూడా  నిలిచారు. 

►సాయంత్రం గం. 4.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–2లో  ప్రత్యక్ష ప్రసారం 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top