హలో.. నేను మీ ప్రియమైన హరీశ్‌ను..!

Minister Harish Rao innovative campaign on swachh survekshan - Sakshi

     స్వచ్ఛ సర్వేక్షణ్‌పై మంత్రి వినూత్న ప్రచారం 

     మొబైల్‌ ద్వారా ప్రజలకు సందేశం 

     చైతన్యం, అవగాహన కోసం కొత్త ఒరవడి 

సిద్దిపేటజోన్‌: స్వచ్ఛ సర్వేక్షణ్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు వినూత్న పంథాను ఎంచుకున్నారు. తన వాయిస్‌తో కూడిన సందేశాన్ని పట్టణ ప్రజలకు ఫోన్‌ ద్వారా వినిపించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ‘నమస్కారం.. నేను మీ ప్రియమైన హరీశ్‌రావును మాట్లాడుతున్నాను.

ఈ ఏడాది జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మన సిద్దిపేట పట్టణం పోటీలో ఉంది. మన పట్టణాన్ని మీ సహకారంతో బహిరంగ మలమూత్ర విసర్జన రహిత పట్టణం (ఓడీఎఫ్‌)గా చేసుకుని ఇప్పటికే ఆదర్శంగా నిలిచాం. ఇక, మీ భాగస్వామ్యంతో ఇంటింటికి చెత్త సేకరణ, దాని నిర్వహణ సమర్థవంతంగా నిర్వహిస్తున్నాం. హరితహారంలో ముందున్నాం. వీటిని మరింత విజయవంతం చేయడంలో మీ సహకారం ఎంతో అవసరం.

ఈ స్వచ్ఛ సర్వేక్షణ్‌లో పాల్గొని మన సిద్దిపేట పట్టణాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలపాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను’అని సందేశం వినిపిస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి ‘040’కోడ్‌తో వచ్చే ఈ కాల్‌ పట్టణంలోని అందరికీ చేరుతోంది. ఫోన్‌ ఎత్తగానే మంత్రి గొంతుతో కూడిన సందేశం వినిపిస్తుంది. ‘ఈ మహా యజ్ఞంలో మీరు భాగస్వామ్యం కావడానికి 1969 నంబర్‌కు మిస్డ్‌ కాల్‌ ఇవ్వండి. లేదా స్వచ్చ సర్వేక్షణ్‌ 2018 వెబ్‌కు లాగిన్‌ అయ్యి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి’అంటూ మంత్రి సందేశం ముగుస్తుంది. అయితే.. ఇప్పుడు పట్టణంలో ఇది హాట్‌ టాపిక్‌గా మారింది.

సిద్దిపేటకు ర్యాంకు ఇవ్వడానికి బుధవారం నుంచి మూడు రోజుల పాటు కేంద్ర బృందం పర్యటించనుంది. ఈ బృందం ప్రజలను కూడా కలుస్తుందని, చెత్త సేకరణ, పారిశుధ్య నిర్వహణ తదితర అంశాలపై బృందం సభ్యులు వివిధ ప్రశ్నలు వేస్తారని, వాటికి తదనుగుణంగా సమాధానాలు ఇవ్వాలని మంత్రి ఆ సందేశంలో వినిపిస్తున్నారు.  

Read latest Siddipet News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top