దేవతల యజ్ఞాన్ని రాక్షసులు అడ్డుకున్నట్టు..

YSRCP MLA Ambati Rambabu Fires on TDP Chief Chandrababu Naidu - Sakshi

జగన్‌ మంచి పనులు చేస్తుంటే.. చం‍ద్రబాబు అడ్డుపడుతున్నారు

బాబు పిల్లిలా అరిస్తే పులిలా గాండ్రించారంటోంది ఎల్లో మీడియా

సీఎం మీద ప్రతిక్షణం బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారు

టీడీపీ అధినేతపై అంబటి రాంబాబు 

సాక్షి, తాడేపల్లి:  అవినీతిరహిత పరిపాలన అందించేందుకు  సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిరంతరం పని చేస్తున్నారని వైస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. రాష్ట్రాన్ని 14 ఏళ్లు పరిపాలించిన చంద్రబాబు మాత్రం ప్రతిక్షణం సీఎం వైఎస్‌ జగన్‌ మీద బురద చల్లాలని ప్రయత్నం చేస్తున్నారని, ఒకవైపు చంద్రబాబు విషం కక్కుతుండగా.. మరోవైపు ఎల్లో మీడియా దానికి వంతపాడుతోందని మండిపడ్డారు. చంద్రబాబు పిల్లిలా అరిస్తే పులిలా గాండ్రించారని ఎల్లో మీడియా మొదటి పేజీలో వార్తలు రాస్తోందని, దేవతలు యజ్ఞం చేస్తుంటే రాక్షసులను అడ్డుకున్నట్లు, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంచి పనులు చేస్తుంటే.. చంద్రబాబు అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఆయన గురువారం తాడేపల్లిలో విలేకరులతో మాట్లాడారు. 

ఎల్లో మీడియా సాయంతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు తండీ కొడుకులు  ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు తన పాలనలో వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని, రివర్స్ టెండరింగ్ ద్వారా అవినీతిని అరికడతామని  సీఎం వైఎస్‌ జగన్‌ చెప్పారని, రివర్స్ టెండరింగ్‌ అద్భుతమైన విజయం సాధించిందన్నారు. రివర్స్ టెండరింగ్ ద్వారా పొలవరంలో 780 కోట్ల ప్రజా ధనాన్ని సీఎం ఆదా చేశారని కొనియాడారు. పీపీఏల ద్వారా ఏడాదికి రూ. 2,500 కోట్లు నష్టం ప్రభుత్వానికి వస్తుందని, పీపీఏల్లో వందల కోట్లు కమీషన్ పేర్లతో నొక్కేశారని అంబటి పేర్కొన్నారు. 

రూ. 87వేల కోట్ల రైతు రుణాలను రూ. 24వేలకోట్లకు కుదించి.. అందులో రూ.15వేల కోట్ల రుణాలు మాత్రమే చంద్రబాబు తనహయాంలో మాఫీచేశారని, 4, 5 విడతల రుణమాఫీ నిధులు ఇవ్వకుండా చంద్రబాబు రైతులను మోసం చేశారని అంబటి మండిపడ్డారు. చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ హామీకి సీఎం వైఎస్‌ జగన్‌కు ఏమి సంబంధమని ప్రశ్నించారు. సీఎం వైఎస్‌ జగన్‌ గ్రామస్వరాజ్యంవైపు అడుగులు వేస్తుంటే.. గ్రామసచివాలయాల పరీక్షల పేపర్‌ లీక్‌ అయిందని ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 4 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు వీలుగా సీఎం వైఎస్‌ జగన్‌ రూపకల్పన చేశారని వివరించారు.

బాబుకు సిగ్గు అనిపించడం లేదా?
లింగమనేని గెస్ట్‌హౌస్‌లో చంద్రబాబు ఎందుకు ఉన్నారు? ఆయన సొంత ఇల్లు ఎందుకు కట్టుకోలేదని అంబటి ప్రశ్నించారు. అనుమతి లేని అక్రమ నివాసంలో ఆయన ఎందుకు ఉంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.  40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకొనే చంద్రబాబుకు అక్రమ ఇంట్లో ఉండటం సిగ్గు అనిపించడం లేదా అని నిలదీశారు. చంద్రబాబు వెంటనే  ఆ అక్రమ ఇంటి నుంచి మారి ఆదర్శమైన రాజకీయ నాయకుడిగా మారాలని సూచించారు. 

కమలవనంలో పచ్చ పుష్పం
సుజనా చౌదరి కమలవనంలో ఉన్న పచ్చ పుష్పమని ఎద్దేవా చేశారు. ఇంకా టీడీపీ నేతగానే సుజనా చౌదరి మాట్లాడుతున్నారని, రివర్స్ టెండరింగ్‌లో రూపాయలు వందల కోట్లు మిగిలిన సంగతి సుజనా చౌదరికి కనిపించడం లేదా అని నిలదీశారు. గతంలో మేఘ కంపెనీకి చంద్రబాబు కాంట్రాక్టులు ఇవ్వలేదా? అని ప్రశ్నించారు. 
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top