‘ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం సీట్లు ఫ్రీగా ఇవ్వాలి’ | YS Jagan Speech In AP Assembly Over Education Regulatory and Monitoring Commission Bill | Sakshi
Sakshi News home page

‘ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం సీట్లు ఫ్రీగా ఇవ్వాలి’

Jul 29 2019 6:07 PM | Updated on Jul 29 2019 6:50 PM

YS Jagan Speech In AP Assembly Over Education Regulatory and Monitoring Commission Bill - Sakshi

సాక్షి, అమరావతి : చదువుకోవడం పిల్లల హక్కు అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. విద్యాహక్కుచట్టాన్ని కచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. చదువు అనేది పేదరికం నుంచి బయటపడేసే ఆయుధమని తెలిపారు. సోమవారం పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ బిల్లుకు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అంతకు ముందు ఈ అంశంపై జరిగిన చర్చలో సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ‘ఏపీలో 33 శాతం మంది నిరాక్ష్యరాసులు ఉన్నారని.. జాతీయ సగటుతో పొల్చితే ఇది ఎక్కువగా ఉండటం బాధకరం. గత ప్రభుత్వం పద్దతి ప్రకారం ప్రభుత్వ స్కూళ్లను నీరుగారుస్తూ వచ్చింది. రేషనలైజేషన్‌ పేరుతో స్కూళ్లను మూసేశారు. ప్రైవేటు స్కూళ్లు ఇష్టానుసారం ఫీజులు పెంచినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. మధ్యాహ్న భోజనానికి సంబంధించిన సరుకుల బిల్లులు 8 నెలల పాటు చెల్లించని పరిస్థితి. 

విద్యాసంస్థలు లాభాపేక్షతో నడుపడం సరైంది కాదు. ప్రతి ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం సీట్లు ఉచితంగా ఇవ్వాలి. చదువనేది ప్రతి ఒక్కరికి అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో ఈ బిల్లును తీసుకొస్తున్నాం. రిటైర్డ్‌ హైకోర్టు జడ్జి ఈ కమిషన్‌కు చైర్మన్‌గా ఉంటారు. జాతీయ స్థాయిలో ప్రముఖ విద్యా నిపుణులను ఈ కమిషన్‌లో సభ్యులుగా ఉంటారు. స్కూళ్లకు సంబంధించిన ప్రతి అంశాన్ని ఈ కమిషన్‌ పర్యవేక్షిస్తుంది. ఏదైనా స్కూలుకు వెళ్లి అక్కడ అడ్మిషన్, టీచింగ్‌ ప్రక్రియలను పర్యవేక్షించే అధికారం ఉంటుంది. స్కూళ్ల గ్రేడింగ్‌ను, విద్యాహక్కు చట్టం అమలును, అక్రిడేషన్‌ను ఈ కమిషన్‌ పరిధిలోకి తీసుకు వస్తున్నాం. నిబంధనలు పాటించని స్కూళ్ల యాజమాన్యాలను హెచ్చరించడమే కాదు, జరిమానాలు విధించడం, చివరకు వాటిని కూడా మూసివేయించే అధికారం ఈ కమిషన్‌కు ఉంటుంద’ని తెలిపారు.

యూనివర్సిటీలను ప్రక్షాళన చేస్తాం : ఆదిమూలపు
అంతేకాకుండా ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ బిల్లుకు కూడా ఏపీ అసెంబ్లీ సోమవారం ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై చర్చలో భాగంగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ మాట్లాడుతూ.. 8 మంది సభ్యులతో ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. వృతి విద్యా కోర్సులను ప్రవేశపెట్టాలనే ఆలోచన చేస్తున్నట్టు వెల్లడించారు. యూనివర్సిటీలను ప్రక్షాళన చేసే దిశలో అడుగులు వేస్తున్నామన్నారు. గత ఐదేళ్ల చంద్రబాబు పాలన కేవలం మాటలకే పరిమితమైందని విమర్శించారు. పబ్లిసిటీ కోసం జ్ఞానభేరి కార్యక్రమాలు పెట్టి ప్రజాధనాన్ని దోచుకున్నారని మండిపడ్డారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement