
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో గత నాలుగేళ్లలో పాలన ఎలా ఉందంటే.. గుడిని, గుడిలో లింగాన్ని మింగేసిన ఘనత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకే దక్కిందంటూ వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. టీడీపీ పాలనలో ప్రజలకే కాదు ఆలయాలకు, దేవుళ్లకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్ జగన్ విమర్శించారు. 143వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా సోమవారం గన్నవరంలో బ్రహ్మలింగయ్య చెరువును వైఎస్ జగన్ పరిశీలించారు. నీరు-చెట్టు పథకం కింద ఇసుక, మట్టిని టీడీపీ నేతలు అక్రమంగా తరలిస్తున్నారని పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ వైఎస్ జగన్‌కు స్థానికులు వివరించారు.
అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. నీరు-చెట్టు పథకం కింద టీడీపీ నేతలు కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. కింది స్థాయి నుంచి ఏపీ మంత్రి నారా లోకేష్, సీఎం చంద్రబాబు వరకు కమీషన్లు వెళ్తున్నాయంటూ విమర్శలు చేశారు. ప్రజలు వ్యతిరేకిస్తున్నా టీడీపీ నేతలు దుర్మార్గంగా మట్టిని తరలిస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీ నేతల అక్రమాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే.. మట్టి తవ్వేందుకు దేవాలయం అడ్డు వస్తుందని అందులో ఉన్న విగ్రహాలను రాత్రికి రాత్రే తరలించారని గుర్తుచేశారు. రాష్ట్రంలో ప్రతి చెరువు పరిస్థితి ఇలానే ఉందంటూ ఆందోళన వైఎస్ జగన్ వ్యక్తం చేశారు.
'మట్టితో వ్యాపారం ఎలా చేయాలో చంద్రబాబుకు బాగా తెలుసు. ఆయన ఏపీలో అదేపని చేసి చూపిస్తున్నారు. సీఎం క్యాంప్ ఆఫీస్‌కి 35 కిలోమీటర్ల దూరంలో ఇసుక వ్యాపారం జరుగుతుంటే.. ఇక రాష్ట్రం ఎలా బాగుపడుతుంది. చివరికి దేవుళ్లను కూడా గుళ్లలో ఉండనీయం లేదు. రాష్ట్రాన్ని స్కామ్ ఆంధ్రప్రదేశ్‌గా చంద్రబాబు మార్చేశారు. నేను వస్తున్నానని తెలిసి ఈ రోజు తాత్కాలికంగా పనిని ఆపేశారు. రోజు వందల లారీలతో ఇసుక, మట్టిని అక్రమంగా తరలించేస్తున్నారు. చంద్రబాబు హయాంలో ప్రజలకే కాదు దేవుళ్లకు సైతం రక్షణ లేకుండా పోయిందంటూ' నాలుగేళ్ల చంద్రబాబు పాలనను వైఎస్ జగన్ ఎండగట్టారు.