ప్రజలకో న్యాయం.. నేతలకో న్యాయమా?

Who Will Implement Supreme Court Suggestions on Tainted leaders - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఎన్నికల్లో నేర చరిత కలిగిన రాజకీయ నాయకులు పోటీ చేయకుండా నిరోధించే అధికారం తమకు లేదని, ఈ విషయంలో తాము పార్లమెంట్‌ పాత్రను నిర్వహించలేమని సుప్రీంకోర్టు ఇటీవల స్పష్టం చేసిన విషయం తెల్సిందే. హత్యలు, కిడ్నాప్‌లు, రేప్‌లు లాంటి కీలక కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ నాయకులు కూడా ఎన్నికల్లో పోటీ చేస్తుండడం పట్ల ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా నాయకత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. నేర చరితులను ప్రజలు ఎన్నుకోకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి కేంద్రానికి, ఎన్నికల కమిషన్‌కు కొన్ని సూచనలు చేసింది.

తాము ఎదుర్కొంటున్న ప్రతి కేసు వివరాలను అభ్యర్థులు తమ అఫిడవిట్‌లో విధిగా నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్‌కు కోర్టు సూచించింది. అలాగే రాజకీయ పార్టీలు పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేర చరితుల వివరాలను వెబ్‌సైట్లలో పొందుపర్చాలని సూచించింది. అలాగే నేర చరితులు ఎన్నికల్లో పోటీ చేయడాకుండా పార్లమెంట్‌లో  చట్టం తీసుకరావాలని కూడా కోర్టు సూచించింది. ఇంతవరకు సుప్రీం కోర్టు సూచనలు బాగానే ఉన్నాయిగానీ వీటిని అమలు చేసేది ఎవరు? ఏ పార్టీ అధికారంలో ఉన్న ఈ దిశగా చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. ఎందుకంటే ప్రతి పార్టీ తరఫున ఎన్నికల్లో నేర చరితులే పోటీలు పడుతున్నారు.

కేసుల్లో శిక్ష పడిన రాజకీయ నాయకులను ఎన్నికల్లో పోటీ చేయకుండా నివారించేందుకు 1951–ప్రజా ప్రాతినిథ్య చట్టంలోని 8వ సెక్షన్‌ అడ్డుపడుతోంది. పెండింగ్‌ కేసులున్న వారిని నిరోధించలేక పోతోంది. దాంతో వివిధ రాజకీయ పార్టీల తరఫున నేర చరితులు పోటీ చేస్తూనే ఉన్నారు. 2004లో పార్లమెంట్‌ ఎన్నికల్లో 124 మంది, 2009లో 162 మంది, 2014లో 184 మంది పోటీ చేశారు. కేసులు నమోదయిన వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా చట్టం తీసుకొచ్చినట్లయితే రాజకీయ నాయకులను పోటీ చేయకుండా అడ్డుకునేందుకు ఎవరైన అనవసరమైన కేసులు పెట్టవచ్చన్నది రాజకీయ పార్టీల భావం. అన్ని కేసుల్లో కాకుండా హత్య, కిడ్నాప్, రేప్‌ లాంటి కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న వారిని పోటీ చేయకుండా నివారించవచ్చు. కానీ శిక్ష పడనంత వరకు ప్రతి ఒక్కరు నిర్దోషులేనని ఎన్నికల కమిషన్‌ ఎప్పటి నుంచో వాదిస్తోంది.

ఈ లెక్కన దేశంలో నేడు వివిధ కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న 2.7 లక్షల మంది అండర్‌ ట్రయల్స్‌ కూడా నిర్దోషులే. వారంతా అన్యాయంగా జైల్లో మగ్గుతున్నారు. వారందరికి వ్యక్తిగత ఇష్టత. స్వేచ్ఛా కదలికలు, వత్తి స్వేచ్ఛ, ప్రతిష్టకు సంబంధించిన ప్రాథమిక హక్కులు లేకుండా చట్ట ప్రకారమే హరిస్తున్నారు. అదే రాజకీయ నాయకులకేమో పోటీచేసే హక్కు ఉందంటున్నారు. ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాస్తూ నేతల చట్టపరమైన హక్కుకు రక్షణ కల్పించడం ఎంత అన్యాయం? రాజకీయ నాయకులు కేసులను ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుల ద్వారా విచారించడం ఒక్కటే ఇందుకు సరైన పరిష్కారం అని అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ సుప్రీం కోర్టుకు సూచించారు. అయితే ఈ విషయాన్ని పరిగణలోకి కోర్టు తీసుకోక పోవడం ఆశ్చర్యం.

కేసుల త్వరితగతి పరిష్కారం కోసం ప్రత్యేక సీబీఐ కోర్టులు, ప్రత్యేక వినియోగదారుల కోర్టులు, రేప్‌ కేసులకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేస్తున్నప్పుడు నేతల కేసుల విచారణకు ఎందుకు ప్రత్యేక లేదా ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేయకూడదు? ఎన్నికల పిటిషన్లను హైకోర్టులు ఆరు నెలల్లోగా పరిష్కరించాలనే మార్గదర్శకాలు ఇప్పటికే ఉన్నాయి. శాసన సభ్యులపై నమోదయ్యే కేసులను ఏడాదిలోగా విచారించి తీర్పు చెప్పాలని, అలా కుదరనప్పుడు అందుకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు వివరణ ఇవ్వాలని పబార్గినేట్‌ కోర్టులకు 2014లో సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అందుకు పూర్తిగా సహకరిస్తామని కేంద్ర ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది. మరి నేరచరితులు అడ్డుకునేందుకు దొరికిన అవకాశాన్ని సుప్రీం కోర్టు ఇప్పుడు ఎందుకు వదులుకుందో అర్థం కాదు. కొన్ని విషయాల్లో తన పరిధి దాటి క్రియాశీలతను ప్రదర్శించే సుప్రీం కోర్టు ఆ క్రియాశీలతను రాజకీయ ప్రక్షాళనలో చూపకపోవడం అధర్మమే!

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top