రాష్ట్రంలో మెడికల్‌ ఫీజుల దోపిడీ

Vishnukumar raju on Medical fees exploitation in the state  - Sakshi

     ప్రభుత్వమే దగ్గరుండి ప్రోత్సహిస్తోంది

     మండిపడిన బీజేపీ నేత విష్ణుకుమార్‌ రాజు

సాక్షి, అమరావతి: ప్రభుత్వమే అధిక ఫీజులను ప్రోత్సహిస్తూ పేద విద్యార్థులు వైద్య విద్య చదువుకునే పరిస్థితులు లేకుండా చేస్తోందని, రాష్ట్రంలో అతిపెద్ద కుంభకోణం ఏదైనా ఉందంటే అది మెడికల్‌ ఫీజులే అని బీజేపీ శాసనసభాపక్షనేత విష్ణుకుమార్‌ రాజు సర్కార్‌పై విరుచుకుపడ్డారు. మెడికల్‌ అడ్మిషన్లపై బుధవారం కాలింగ్‌ అటెన్షన్‌పై ఆయన మాట్లాడారు. ఏ రాష్ట్రంలో లేనంతగా ఫీజులు రాష్ట్రంలో వసూలు చేస్తున్నారని విమర్శించారు. వసూలు చేసుకోండని స్వయానా ప్రభుత్వమే జీవో ఇవ్వడం దారుణమన్నారు. చంద్రన్న బీమా అంశంపై కూడా ఆయన మాట్లాడుతూ కేంద్రం 45 శాతం నిధులిస్తున్నా మోదీ ఫొటో పెట్టకుండా కేవలం సీఎం ఫొటోనే పెట్టడం అన్యాయమన్నారు.

టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల్లో పారదర్శకంగా కౌన్సెలింగ్‌ చేసినప్పుడు మన రాష్ట్రంలో ఎందుకు చెయ్యలేకపోయారని నిలదీశారు. దీనికి మంత్రి యనమల సమాధానమిస్తూ ఫీజుల పెంపుపై యాజమాన్యాలు సుప్రీం నుంచి ఆర్డరు తెచ్చుకున్నాయన్నారు. శ్రీకాకుళంలోని రిమ్స్‌లో 30 అధ్యాపక పోస్టులు ఖాళీ ఉన్నాయని మంత్రి యనమల వెల్లడించారు. అసెంబ్లీలో బుధవారం ప్రశ్నోత్తరాల సందర్భంగా ఎమ్మెల్యే కలమట  అడిగిన ప్రశ్నకు మంత్రి ఈమేరకు సమాధానమిచ్చారు. వేతనాలు చాల్లేదంటూ కాంట్రాక్టు ఉద్యోగులు మానేస్తున్నారని, అందువల్ల రెగ్యులర్‌ నియామకాలకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రధాని మోదీని ప్రజలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నందు వల్లే ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (పీఎంజేజేవై)కు ఆయన ఫొటో పెట్టలేదని  మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు.  

అసెంబ్లీలో రెండు బిల్లులకు ఆమోదం
అసెంబ్లీ సమావేశాల్లో చివరిరోజైన బుధవారం రెండు బిల్లులు ఆమోదం పొందాయి. ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్స్‌ రిజిస్ట్రేషన్‌ (రెండవ సవరణ) బిల్లు, ఆంధ్రప్రదేశ్‌ ద్రవ్య వినియోగ (నెం.3) బిల్లులను ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top